
కట్నం వేధింపులకు యువతి బలి
జగిత్యాలక్రైం/బుగ్గారం: కొడిమ్యాల మండలకేంద్రంలో వివాహిత దుబ్బాక జమున (23) కట్నం వేధింపులకు బలైంది. స్థానికుల కథనం ప్రకారం.. బుగ్గారం మండలకేంద్రానికి చెందిన జమునను ఏడాది క్రితం కొడిమ్యాలకు చెందిన దుబ్బాక రాహుల్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఆ సమయంలో కట్నకానుకలతోపాటు సామగ్రి, ఇతర లాంఛనాలు ముట్టజెప్పారు. కొద్దికాలంగా రాహుల్ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. వేధింపులు తాళలేక జమున క్రిమిసంహారక మందు తాగింది. అనంతరం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జమనను కట్నం కోసం వేధించి భర్తతోపాటు అత్తమామలు హత్య చేశారంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ రఘుచందర్, మల్యాల సీఐ రవి, కొడిమ్యాల ఎస్సై సందీప్ ఘటన స్థలానికి చేరుకుని నిందితులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించారు. మృతురాలి తల్లి కొమ్ము పోశవ్వ ఫిర్యాదు మేరకు జమున భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. జమున మృతదేహానికి బుగ్గారంలో దహన సంస్కారాలు నిర్వహించగా.. తల్లి పోశవ్వ తలకొరివి పెట్టింది.

కట్నం వేధింపులకు యువతి బలి