
ఉరేసుకుని యువతి ఆత్మహత్య
జగిత్యాలక్రైం: జగిత్యాలలోని పోచమ్మవాడలో గంగధరి ప్రసన్నలక్ష్మీ (28) బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పోచమ్మవాడకు చెందిన ఉప్పునీటి గంగాధర్ కుమార్తె ప్రసన్నలక్ష్మీని వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామానికి చెందిన గంగధరి తిరుపతికి ఇచ్చి 2023లో వివాహం చేశారు. వీరికి ఏడాది బాబు ఉన్నాడు. తిరుపతి వెళ్లేందుకని ఇటీవలే జగిత్యాలలోని పుట్టింటికి వచ్చింది. ఇంతలో ఏమైందో తెలియదుగానీ.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
కొత్తపల్లి: కొత్తపల్లి మండలం నాగులమల్యాల గ్రామానికి చెందిన మొగిలిపాలెం గంగరాజు(42)బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు కొత్తపల్లి పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు గంగాధర మండలం సర్వారెడ్డిపల్లిలో పనిచేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న నాగులమల్యాలకు చెందిన గంగారాజు ప్రతి రోజు తన ద్విచక్ర వాహనంపై వెళ్లి వస్తుంటాడు. బుధవారం సర్వారెడ్డిపల్లిలో పనిముగించుకొని తన వాహనంపై నాగులమల్యాలకు వస్తుండగా కొత్తపల్లి శివారులోని వెలిచాల ఎక్స్‌రోడ్ దగ్గర లారీ ఢీకొట్టింది. గంగారాజుకు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అజాగ్రత్తగా లారీ నడిపి తన తండ్రి మృతికి కారణమైన లారీ డ్రైవర్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గంగరాజు కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కర్మకాండకు వెళ్లి యువకుడు గల్లంతు
జగిత్యాలక్రైం: కర్మకాండకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో యువకుడు గల్లంతైన సంఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని మంచినీళ్ల బావి ప్రాంతానికి చెందిన నీలి మల్లికార్జున్ నానమ్మ ఇటీవల మృతిచెందింది. బుధవారం కర్మకాండ నిర్వహించారు. శ్మశాన వాటిక పక్కనే ఉన్న చింతకుంట చెరువులో స్నానం చేస్తుండగా మల్లికార్జున్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. గజ ఈతగాళ్లను రంగంలోకి దింపినా అతని ఆచూకీ లభ్యం కాలేదు. మల్లికార్జున్ మృతిచెంది ఉంటాడని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.

ఉరేసుకుని యువతి ఆత్మహత్య