
అందని వైద్యం
● మెడికల్ కళాశాలలోనే ఎన్‌హెచ్‌ఎం సిబ్బంది ● ఇతర ఆస్పత్రుల్లో వైద్యుల కొరత ● పట్టింపులేని వైద్యశాఖ అధికారులు
జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రం కాకముందు.. డివిజన్ కేంద్రంగా ఉన్నప్పుడు ఇక్కడ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రి కొనసాగేది. జిల్లాకేంద్రం కావడం, మెడికల్ కళాశాల మంజూరు కావడంతో జనరల్ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ అయ్యింది. వైద్య విధాన పరిషత్ ఆస్పత్రిగా ఉన్న సమయంలో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కింద కాంట్రాక్ట్ పద్ధతిలో ఇద్దరు గైనకాలజిస్ట్‌లు, ఇద్దరు అనస్థిషియా, ముగ్గురు పిడియాట్రిక్స్ వైద్యులను నియమించారు. వైద్య విధాన పరిషత్‌గా ఉన్న సమయంలో వీరి సేవలు కొనసాగాయి. మెడికల్ కళాశాల ఏర్పాటైన మొదట్లో వైద్యులు తక్కువగా ఉండటంతో ఈ ఎన్‌హెచ్‌ఎం కింద నియమితులైన వారు అందులోనే సేవలందించారు. మెడికల్ కళాశాలకు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెన్సీలు పూర్తిస్థాయిలో నియామకం అయ్యారు. వైద్య విధాన పరిషత్ కింద పనిచేసిన వారు ప్రస్తుతం మెడికల్ కళాశాలలోనే పనిచేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీరిని సంబంధిత ఏరియా ఆస్పత్రి లేదా.. జిల్లా జనరల్ ఆస్పత్రి, పీహెచ్‌సీ ఇతర ఏ ఆస్పత్రుల్లోనైనా వీరి సేవలు కొనసాగించవచ్చు. మెడికల్ కళాశాలలో స్థాయికి మించి సిబ్బంది ఉన్నప్పటికీ వీరిని అందులోనే కొనసాగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని పలు ఆస్పత్రుల్లో అనేకమంది వైద్యులు తక్కువగా ఉన్నారు. ముఖ్యంగా పిడియాట్రిక్స్‌గానీ, అనస్థిషియా, గైనకాలజిస్ట్‌లు తక్కువగా ఉన్నారు. వీరిని అందులో కేటాయిస్తే ప్రజలకు మరింత వైద్యం అందే అవకాశం ఉంటుంది. ఒక మెడికల్ కళాశాల అనే కాకుండా ఎన్‌హెచ్‌ఎం కింద నియమించిన సిబ్బంది బ్లడ్‌బ్యాంక్, ల్యాబ్, పాథాలజీ, ఇతర డిపార్ట్‌మెంట్లలో సైతం అనేకమంది కొనసాగుతున్నారు. వీరందరినీ అవసరమున్న చోట నియమిస్తే మరింత వైద్యం అందే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెడికల్ కళాశాలలో తక్కువగా ఉన్న సమయంలో వారిని నియమించినప్పటి నుంచి అలాగే కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు పట్టించుకోవడం లేదు. వాస్తవానికి వీరు జిల్లా వైద్య శాఖ పరిధిలోకి వస్తారు. ఉన్నతాధికారులు స్పందించి వీరి సేవలను ఇతర ఆస్పత్రుల్లో అందించేలా నియమించాలని ప్రజలు కోరుతున్నారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద నియమితులైన ఈ డాక్టర్లతోపాటు, ఇతర సిబ్బంది వేరేచోట్ల పనిచేస్తున్నారని, వీరిని ఆస్పత్రుల్లో పనిచేసేలా చూడాల్సిన అవసరం ఉంది. జిల్లాలో జనరల్ ఆస్పత్రి, 17 పీహెచ్‌సీలు, ఒక వైద్య విధాన పరిషత్, రెండు సీహెచ్‌సీలు, ఐదు పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఇందులో వైద్య సిబ్బంది చాలా తక్కువగా ఉన్నారు. మెడికల్ కళాశాలలో ఉన్న వీరిని ఇతర ఆస్పత్రుల్లో నియమించేలా చూస్తే పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుంది. మెడికల్ కళాశాల ఏర్పడి దాదాపు నాలుగేళ్లు అవుతోంది. అందులో అత్యధిక సిబ్బంది ఉన్నా అందులోనే కొనసాగించడం, కలెక్టర్, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి వారిని ఇతర ఆస్పత్రులకు కేటాయించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.