
సింగరేణి ప్రైవేటీకరణను రద్దుచేయాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బడితెల సమ్మయ్య డిమాండ్ చేశారు. ఏరియాలోని జీఎం కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టి జీఎం కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం సింగరేణి గనులను వేలం వేయడం వలన స్థానికులకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయన్నారు. రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్‌పరం కాకుండా సింగరేణికి కేటాయించాలని కోరారు. కార్మిక వాడల్లో మెరుగైన తాగునీటిని అందించాలని, సింగరేణిలోనే కార్పొరేట్ వైద్యం అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సదానందం, అవినాష్, మధు, కుమారస్వామి, వెంకట్రాజం, సుంకరి గోవర్దన్, మొగిలి, శ్రీనాథ్ పాల్గొన్నారు.