వైజాగ్‌ ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ కాలేజీపై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వైజాగ్‌ ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ కాలేజీపై చర్యలు తీసుకోవాలి

Published Fri, Apr 25 2025 1:15 AM | Last Updated on Fri, Apr 25 2025 1:15 AM

వైజాగ్‌ ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ కాలేజీపై చర్యలు తీసుకోవాలి

వైజాగ్‌ ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ కాలేజీపై చర్యలు తీసుకోవాలి

● మా కుమారుడి ఆత్మహత్యకు ఆ కళాశాల డీన్‌, వైస్‌ ప్రిన్సిపాలే కారణం ● మూడేళ్ల కాలంలో కాలేజీ విద్యార్థులు ముగ్గురు చనిపోయారు ● కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు ఉమాదేవి, రాజేశ్వరరావు

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): విశాఖపట్నంలోని ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ కాలేజీ విద్యార్థి శిరం ప్రణీత్‌ ఆత్మహత్యకు ఆ కళాశాల యాజమాన్యమే కారణ మని విద్యార్థి తల్లిదండ్రులు శిరం ఉమాదేవి, రాజేశ్వరరావు ఆరోపించారు. ఆ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా విజయవాడలోని తమ ఇంటి వద్ద వారు గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ కుమారుడు శిరం దత్తప్రణీత్‌ విశాఖపట్నం తగరపువలసలోని ఎన్‌ఆర్‌ఐ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ నాలుగో సంవత్సరం చదువుతున్నాడని పేర్కొన్నారు. ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం ఆ కళాశాల ఏఓ తమకు ఫోన్‌ చేసి ‘మీ అబ్బాయి భవనం నాలుగో అంతస్తు నుంచి దూకేశాడు. ఆస్పత్రిలో ఉన్నాడు. వచ్చి చూసు కోండి’ అని చెప్పారని తెలిపారు. ఆ రోజు రాత్రికి తాము విశాఖపట్నం వెళ్లే సరికి తమ కుమారుడు మార్చురీలో ఉన్నాడని చెప్పారు. కళాశాల డీన్‌ పి.వి.సుధాకర్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ వేధింపుల కారణంగానే తమ కుమారుడు మరణించాడని వారు కన్నీటి పర్యంతమయ్యారు. తమ బిడ్డ భవనం నుంచి దూకిన తరువాత తక్షణం స్పందించలేదన్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లిన తరువాత ఏ చికిత్స అందించారనే అంశాలను సైతం తమకు చెప్పలేదని ఆరోపించారు. తమ కుమారుడి మృతి విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ఘటనా స్థలంలో ఆనవాళ్లు లేకుండా కాలేజీ యాజమాన్యం చెత్తాచెదారం వేసిందన్నారు. తమ కుమారుడిలాగే గడిచిన మూడు సంవత్సరాల్లో మరో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థులు తమకు చెప్పారని వివరించారు. కాలేజీ డీన్‌ పి.వి.సుధాకర్‌పై గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా వచ్చాయన్నారు. కాలేజీ యాజమాన్యానికి ప్రజా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తల అండదండలు ఉండడంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రమికవేత్త ఒత్తిడికి తలొగ్గిన పోలీసులు వారిపై ఏ విధమైన చర్యలూ తీసుకోలేదన్నారు. వరుస ఘటనలు జరుగుతున్నా పోలీసులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. తమ కుమారుడి మరణంపై తగిన దర్యాప్తు చేసి కారకులైన వారిని శిక్షించాలని కోరారు. విలేకరుల సమావేశంలో విద్యార్థి కుటుంబ సభ్యులు రవి ప్రసాద్‌, గంగాభవాని, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement