
ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేయాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు కోరారు. జనగణనతోపాటు ఓబీసీ కులగణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యాన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే విగ్రహాలకు ఆదివారం వినతిపత్రం సమర్పించారు. అనంతరం శంకరరావు మాట్లాడుతూ.. నేటి రాజకీయ నాయకులు విగ్రహమూర్తులుగా ఉన్నారని ఎద్దేవా చేశారు. అందుకే అంబేడ్కర్, పూలే విగ్రహాలకు సమర్పించాల్సి వచ్చిందన్నారు. ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఓబీసీ మహిళలకు సబ్ కోటా ఇస్తూ మహిళా రిజర్వేషన్ చట్టాన్ని సవరించాలని దశాబ్దాలుగా కోరుతున్నామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాల మాదిరిగానే బీసీల రక్షణకు చట్టం తీసుకురావాలని, క్రిమిలేయర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
బీసీలే పార్టీకి వెన్నెముకలని
అరెస్ట్ చేస్తారా?
శాంతియుతంగా ర్యాలీ చేసే తాము సంఘ విద్రోహులమైనట్లు పోలీసులు వేధించి అరెస్ట్ చేస్తారా అన్ని శంకరరావు ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు బీసీలు పార్టీకి వెన్నెముకలని చెప్పుకొస్తుంటే మరో వైపు పోలీసులు అరెస్ట్‌లు చేయటం ఎంత వరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో నేతలు కుమ్మరి క్రాంతికుమార్, అన్నవరపు నాగమల్లేశ్వరరావు, ఎం.ఎస్.ఎన్.మూర్తి, రాష్ట్ర ఉద్యోగ సంఘం అధ్యక్షులు గుంటుపల్లి ఉమామహేశ్వరరావు, కార్యనిర్వాహక అధ్యక్షుడు మేకా వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా ఇన్‌చార్జి ప్రధాన కార్యదర్శి చందు తదితరులు పాల్గొన్నారు.
ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు