
జంక్షన్‌లో నెల్లూరు ప్రేమజంట
హనుమాన్‌జంక్షన్ రూరల్: నెల్లూరుకు చెందిన ప్రేమజంట హనుమాన్‌జంక్షన్‌లో ఆదివారం హల్‌చల్ చేశారు. వివరాల్లోకి వెళ్లితే.. నెల్లూరుకు చెందిన సయ్యద్ ఆఫ్రిన్ కుబ్రా, షేక్ రసూల్ ఇద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఇంటి నుంచి పరారై హనుమాన్‌జంక్షన్ చేరుకున్నారు. ఇద్దరు మేజర్లు కావటంతో ఇక్కడి బంధువులు, స్నేహితుల సహకారంతో మత పెద్దల సమక్షంలో ముస్లిం సంప్రదాయం ప్రకారం ఆదివారం ఆఫ్రిన్, రసూల్ పెళ్లి చేసుకున్నారు. ఆఫ్రిన్ అదృశ్యమైనట్లుగా ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో నెల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రేమజంట హనుమాన్‌జంక్షన్‌లో ఉన్నట్లుగా సమాచారం అందుకున్న నెల్లూరు పోలీసులు నవ దంపతుల ఉంటున్న బంధువుల ఇంటికి చేరుకున్నారు. ఆఫ్రిన్‌ను తల్లిదండ్రులకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి నుంచి ప్రాణహాని ఉందంటూ నెల్లూరు పోలీసులతో వెళ్లేందుకు వధూవరులు అంగీకరించలేదు. దీంతో జంక్షన్ పీఎస్‌కు ప్రేమజంట చేరుకోవడంతో కొద్దిసేపు హైడ్రామా నడిచింది. తమ ఆధార్‌కార్డులు చూపించి, మేజర్లు కావడంతో ఇష్ట్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నామని, తమకు రక్షణ కల్పించాలంటూ నవదంపతులు వేడుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రేమజంటకు.. ఇద్దరి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి, ఇంటికి పంపుతామని చెప్పడంతో ఎట్టకేలకు నెల్లూరు పోలీసుల వెంట వెళ్లిపోయారు.