
వేసవి సెలవుల్లో జాగ్రత్తలు తప్పనిసరి
మాహబూబాబాద్ రూరల్: వేసవి సెలవులు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆది వారం తెలిపారు. పిల్లలు వేసవిలో చల్లదనం కోసం గ్రామాల్లోని చెరువులు, కుంటల వద్దకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, ఎటువంటి రక్షణ సదుపాయాలు లేనిచోట ఈతకు వెళ్లనీయొద్దని చెప్పా రు. వేసవి సెలవుల్లో ప్రజలు తమ సొంత ఊర్లు, విహారయాత్రలకు వెళ్లేటప్పుడు ఇంటి భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదును లాకర్‌లలో భద్రపరచాలి లేదా తమ వెంట తీసుకెళ్లాలన్నారు. ఇంటి తలుపులకు సెంట్రల్ లాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని, ఇంటి లోపల, బయట లైట్లు వెలిగేలా చూసుకోవాలన్నారు. ఇంటి బయట తాళం వేసే ప్రసక్తి లేకుండా లోపల నుంచి గొళ్లెం వేసుకోవాలని, ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మొబైల్ ద్వారా పర్యవేక్షించవచ్చని పేర్కొన్నారు. అపార్ట్‌మెంట్‌లలో సీసీ కెమెరాలు, వాచ్‌మెన్లను నియమించాలని, ఊర్లకు వెళ్లిన రోజుల్లో పేపర్, పాల డెలివరీలను నిలిపివేయడం మంచిదని, ఇంటి పరిసరాల్లో కొత్తవారు, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే డయల్ 100కు లేదా దగ్గరలోని పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు. ఇంటి పరిధిలోని పోలీస్‌స్టేషన్, ఏరియా కానిస్టేబుల్ సెల్ నంబర్లు దగ్గర ఉంచుకోవాలని తెలిపారు. మైనర్లకు వాహనాలను ఇవ్వడం చట్టపరంగా నిషిద్ధమని, అలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మత్తు పదార్థాల వినియోగం, బెట్టింగ్ లాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసులు యుద్ధ ప్రాతిపదికన రాత్రిపూట పెట్రోలింగ్ ముమ్మరం చేస్తున్నారని, ప్రజలు కూడా తమ భద్రత కోసం పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.
ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్