జడ్చర్ల టౌన్: డా.బీఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వాణిజ్యశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)పై జాతీయ సెమినార్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డా.సుకన్య తెలిపారు. మంగళవారం కళాశాలలో ఆమె మాట్లాడారు. ‘వాణిజ్య రంగంలో ఏఐ ప్రభావం’ అన్న అంశంపై ఒకరోజు సెమినార్ కొనసాగుతుందని దేశంలోని వివిధ డిగ్రీ కళాశాలల నుంచి సెమినార్ కోసం ఆన్ లైన్ ద్వారా ఇప్పటికే 130 జనరల్స్ వచ్చాయ న్నారు. త్వరలోనే విద్యార్థులకు పాఠ్యాంశంగా తేబోతున్న ఏఐతో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని అన్నారు. సరైన మార్గంలో వినియోగించుకుంటే ఎన్నో ప్రయోజనాలున్నాయని, దానివల్ల కలిగే అనర్థాలను అదే తరహా లో వివిధ కళాశాలల నుంచి ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారన్నారు. సెమినార్‌కు రాష్ట్ర ఉన్నత విద్య కౌన్సిల్ చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి, పీయూ వైస్ చాన్స్‌లర్ జీఎన్ శ్రీనివాస్, సీసీఈ జేడీ జి.యాదగిరి, రాజేందర్‌సింగ్, ఏజీఓ బాల భాస్కర్, ముఖ్యవక్త యలమంచిలి రామకృష్ణ, రీసోర్స్ పర్సన్ డా.కె.రాజ్‌కుమార్ హాజరుకానున్నారని తెలిపారు. వైస్‌ప్రిన్సిపాల్ డా.నర్మద, మీడియా కన్వీనర్ రాఘవేందర్, సభ్యులు సతీష్ పాల్గొన్నారు.
రేపు జాబ్‌మేళా
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లా ఎంప్లాయిమెంట్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన పద్మావతి కాలనీలోని నిర్మల్ ఆర్గనైజేషన్ నియర్ రెడ్ బక్కెట్, మన్నార్ ట్రైడర్స్ బిల్డింగ్‌లో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ అధికారి మైత్రిప్రియ మంగళశారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎనిమిది రకాల ప్రైవేట్ రంగ సంస్థల్లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీ కోసం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని సూచించారు. వివరాల కోసం 99485 68830 నంబర్‌కు సంప్రదించాలని కోరారు.
నగర పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగరంలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో స్వచ్ఛ ఆటో డ్రైవర్లు, పారిశుద్ధ్య సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికీ వెళ్లే స్వచ్ఛ ఆటోలు, ట్రాక్టర్లకు ప్రతి యజమాని వేరు చేసిన చెత్తను ఇవ్వాలని సూచించారు. ఎవరూ బహిరంగ ప్రదేశాల్లో, ఓపెన్ ప్లాట్లలో, కూడళ్లలో చెత్త పారవేయొద్దన్నారు. ఇప్పటికీ ఎక్కడైనా చెత్త ఇవ్వని వారు ఉంటే వెంటనే గుర్తించి తమకు సమాచారం అందజేయాలన్నారు. ఈ విషయంలో ఎవరితోనూ ఘర్షణ పడొద్దని, సామరస్యంగా వ్యవహరించాలని, అలాంటి వారిలో మార్పు వచ్చేందుకు యత్నించాలన్నారు. ఇక డంపింగ్ యార్డుకు సిల్ట్ తప్పా మిగతా చెత్తను వేరు చేసి డీఆర్‌సీసీకి అప్పగించాలన్నారు. అక్కడ గుట్టలు గుట్టలుగా చెత్త పోగు కాకుండా చూడాలన్నారు. అంతకుముందు డంపింగ్ యార్డులోని సెగ్రిగేషన్ షెడ్లు, బయో మైనింగ్, డీఆర్‌సీసీలను పరిశీలించారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్లు గురులింగం, రవీందర్‌రెడ్డి, వజ్రకుమార్‌రెడ్డి, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ చరణ్, ఎస్‌బీఎం కన్సల్టెంట్ సుమిత్‌రాజ్ పాల్గొన్నారు.
‘దాడులపై ప్రభుత్వంస్పందించాలి’
పాలమూరు: రాష్ట్రంలో దశలవారీగా న్యాయవాదులపై దాడులు, హత్యలు జరగడం అత్యంత బాధాకరమని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి అన్నారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో న్యాయవాది సయ్యద్ ముస్తాబా అలీపై జరిగిన దాడిని నిరసిస్తూ మంగళవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. న్యాయవాదులతో పాటు మహిళా జూనియర్ న్యాయవాదులు నల్లబ్యాడ్జీలు ధరించి కోర్టుకు నుంచి బయటకు ర్యాలీగా వెళ్లి ముఖద్వారం వద్ద నిరసన తెలిపారు. ఆ తర్వాత కోర్టు నుంచి ర్యాలీగా తెలంగాణ కూడలి వరకు నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. న్యాయవాదులపై దాడులు చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలన్నారు. బార్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీధర్‌రావు, ఉపాధ్యక్షుడు వెంకటయ్య, వెంకట్‌రావు, నాగోజీ, ఎన్‌పీ వెంకటేష్, ఉమామహేశ్వరి, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
నేడు ఏఐపై జాతీయ సెమినార్