
ఆధార్‌లా ప్రతి రైతుకు భూధార్ కార్డులు
జడ్చర్ల: ప్రతి ఒక్కరికి భూమితో అనుబంధం ఉందని, ఆయా భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం ధరణి స్థానంలో కొత్తగా భూభారతి చట్టం అమలులోకి తీసుకొచ్చిందని కలెక్టర్ విజయేందిర బోయి పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి చట్టంపై జడ్చర్లలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి చట్టంలో భూ సమస్యలను సకాలంలో పరిష్కరించలేని స్థితి ఉండేదని, ప్రజావాణిలో తమకు అనేక సమస్యలపై ఫిర్యాదు లు వచ్చాయన్నారు. తాజాగా అమలులోకి వచ్చిన భూభారతి చట్టంలో ఆయా సమస్యల పరిష్కారం లభించే అవకాశం ఏర్పడిందన్నారు. గతంలో తాము పరిష్కరించలేని సమస్యలకు సంబంధించి సివిల్ కోర్టులను ఆశ్రయించే పరిస్థితి ఉండేదన్నా రు. ఇక నుంచి భూభారతి చట్టంతో ఆ పరిస్థితి ఉండదన్నారు. తహసీల్దార్‌పై ఆర్డీఓకు, ఆర్డీఓ నుంచి కలెక్టర్‌కు, కలెక్టర్ నుంచి భూపరిపాలన కమిషనర్‌కు, అక్కడి నుంచి ట్రిబ్యునల్‌కు అప్పీల్‌కు వెళ్లి సమస్యలు పరిష్కరించుకునే వెసులుబాటు ఉందన్నారు. ఆధార్‌కార్డుల మాదిరిగా భూధార్ కార్డులు జారీ చేయడంతో పాటు పాసు పుస్తకంలో భూమికి సంబంధించి మ్యాపును పొందుపరుస్తామన్నారు. సమస్య సత్వర పరిష్కారానికి క్షేత్రస్థాయిలో గ్రామ పరిపాలన అధికారులు ఉంటారని, లైసెన్స్డ్ సర్వేయర్లను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందన్నారు. ఇక భూ తగాదాలు, వివాదాలు, భయాలు లేకుండా భూ క్రయవిక్రయాలు పారదర్శకంగా ఉంటాయన్నారు. భూ హక్కులు భూ యజమానికే ఉంటూ సంపూర్ణంగా అనుభవించే హక్కులు కొత్తచట్టంలో ఉంటాయని పేర్కొన్నారు.
● భూ భారతి చట్టం ఓ విప్లవాత్మకమైన మార్పు అని చట్టం రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించిన భూమి సునీల్ పేర్కొన్నారు. ఇందులో కీలకమైన 4,5,7,8 సెక్షన్లను గుర్తుంచుకుంటే మంచిందన్నారు. 25 లక్షల మంది రైతులకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసమే భూ భారతి చట్టాన్ని అధ్యయనం చేసి రూపొందించినట్లు చెప్పారు. జూన్ 2 నుంచి ఆగస్టు 15 వరకు జరిగే రెవెన్యూ సదస్సులలో దరఖాస్తును స్వీకరించనున్నట్లు చెప్పారు. దాదాపు 6వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లను ప్రభుత్వం గుర్తించనుందన్నారు. సెక్షన్ 6 ప్రకారం సాదాబైనామాలను క్రమబద్ధీకరించనుందని తెలిపారు. అవగాహన సదస్సు అనంతరం రైతులతో కలిసి వారు సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్‌రావు, ఆర్డీఓ నవీన్, తహసీల్దార్ నర్సింగరావు, మార్కెట్ యార్డు చైర్పర్సన్ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
నేనూ ధరణి బాధితుడినే: ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి
తాను రాజకీయాల్లోకి రావడానికి భూ సమస్యలే కారణమని, తానూ ధరణి బాధితుడినేనని ఎమ్మెల్యే అనిరుధ్డ్డి తెలిపారు. రంగారెడ్డిగూడెంలో తమ తాతలు దేవాదాయశాఖకు ఇచ్చిన భూమిని కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో తాము కొట్లాడి కోర్టుకు వెళ్లి దేవాదాయ శాఖ భూమిని కాపాడుకున్నామన్నారు. తాను రాజకీయాలలోకి రావడానికి ఇదే కారణమన్నారు. ప్రజాపాలనలో భాగంగానే భూ సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్‌రెడ్డి కొత్త చట్టాన్ని అమలులోకి తెచ్చారని తెలిపారు.
భూసమస్యల పరిష్కారం
కోసమే భూభారతి
పాసు పుస్తకంలో భూమికి సంబంధించి మ్యాపు: కలెక్టర్ విజయేందిర
జడ్చర్లలో అవగాహన సదస్సు