
కదిలిన రాములోరి రథచక్రాలు
● అంగరంగ వైభవంగా పెద్ద తేరు మహోత్సవం
● జనసంద్రమైన సిర్సనగండ్ల
● మార్మోగిన శ్రీరామ నామం
చారకొండ: వేదపండితుల మంత్రోచ్ఛరణాలు.. భక్తుల జయజయ ధ్వానాల మధ్య అపరభద్రాద్రి సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి రథ చక్రాలు ముందుకు కదిలాయి. శ్రీరామ నవమిని పురస్కరించుకొని నిర్వహించిన బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనాసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం తెల్లవారుజామున నిర్వహించిన రథోత్సవం (పెద్ద తేరు) కనుల పండువగా సాగింది. రంగురంగుల పూలతో శోభాయమానంగా అలంకరించిన రథంపై సీతారామలక్ష్మణ ఉత్సవ విగ్రహాలను ఉంచి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ రామశర్మ, ఈఓ ఆంజనేయులు రథాన్ని లాగి ప్రారంభించారు. ప్రధాన ఆలయం నుంచి ముక్కిండి పోచమ్మ, దత్తాత్రేయ మందిరం వరకు లాగి తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు. పెద్ద తేరు వేడుక అర్ధరాత్రి 2 నుంచి ఉదయం 6 గంటల వరకు చూడముచ్చటగా సాగగా.. ఆలయ ప్రాంగణం శ్రీరామ నామంతో మార్మోగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి. రథోత్సవంలో కళాకారుల కోలాటాలు, ఆటపాటలు అలరించారు. రాత్రికి స్వామివారికి నాగబలి, పూర్ణాహుతి, గజవాహన సేవ, దీపోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తామని చైర్మన్, ఈఓ తెలిపారు.
స్వామివారి దర్శనం కోసం క్యూలైన్‌లో భక్తులు బారులుదీరారు. స్వామివారి దర్శనం అనంతరం అమ్మవారు, శివదత్తాత్రేయ ఆలయాలను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి జాతరలో ఉత్సాహంగా గడిపారు. రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్‌ఐ శంషొద్దీన్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజర్ నిరంజన్, అర్చకులు మురళీధర్‌శర్మ, లక్ష్మణ్, కోదండరా మ, వేణు, రఘు, ప్రవీణ్, సీతారామశర్మ, భక్తులు పాల్గొన్నారు.

కదిలిన రాములోరి రథచక్రాలు