మే నెలాఖరుకు ఎడారిలా.. జూరాల ప్రాజెక్టు
●
అడుగంటిపోయిన జూరాల జలాశయం
ఎండలు ఎక్కువైతే ఇబ్బందులు..
ప్రస్తుతం జూరాలలో ఉన్ననీటి నిల్వలను పూర్తిగా తాగునీటి అవసరాలకే వినియోగిస్తాం. ఇప్పుడు జలాశయంలో అందుబాటులో ఉన్న నీరు మే నెలాఖరు వరకు సరిపోతాయి. అయితే ఎండలు ఎక్కువైతే ఇబ్బందులు రావొచ్చు. అప్పుడు పరిస్థితులను బట్టి అవసరమైన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటాం.
– రహీముద్దీన్ ఎస్‌ఈ జూరాల
మరో తడి ఇవ్వండి..
అమరచింత ఎత్తిపోతల ద్వారా రబీలో 6 ఎకరాల్లో వరి పంట సాగు చేశా. ప్రస్తుతం జూరాల ఎడమ కాల్వ ద్వారా సాగునీటిని నిలిపేస్తున్నామని అధికారులు చెప్పారు. ఈ కాల్వకు అనుసంధానంగానే అమరచింత లిఫ్ట్‌కు సాగునీరు అందుతుంది. మరో తడి సాగు నీరు ఇస్తేనే మా పంటలు చేతికి వస్తాయి.
– వెంకటేశ్వర్‌రెడ్డి, రైతు, అమరచింత
రైతులను ఆదుకోవాలి..
జూరాల ప్రధాన ఎడమ కాల్వ పరిధిలోని డీ–6లో పంటలు సాగు చేస్తున్న రైతులకు ఇంకా పక్షం రోజుల పాటు నీళ్లు ఇస్తేనే పంట చేతికి వస్తుంది. ఈ విషయమై ప్రజాప్రతినిధులు, అధికారులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం. మా పంటలు చేతికి వచ్చే విధంగా సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి.
– లక్ష్మణ్,
రైతు, ఆరేపల్లి, ఆత్మకూర్ మండలం
గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాకు పెద్దదిక్కుగా అయిన జూరాల జలాశయం గతంలో ఎన్నడూ లేనంతటి గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతోంది. వరుసగా రెండో ఏడాది కూడా జలాశయం అడుగంటిపోయింది. ఫలితంగా ఇప్పటికే సాగునీటి కష్టా లు తలెత్తగా.. రాబోయే రోజుల్లో తాగునీటికి సైతం ఇబ్బందులు ఎదురుకానున్నాయి. అధికారులు ఇప్పటికే జూరాల ఎడమ, కుడి ప్రధాన కాల్వల కింద రబీలో సాగుచేసిన ఆయకట్టుకు నీటి విడుదల పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం జూరాలలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు ఈ నెలాఖరు నాటికే సరిపోతాయని, మే, జూన్ నెలల్లో తాగునీటికి కూడా ఇబ్బందులు తలెత్తవచ్చని రూపొందించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ నేపథ్యంలో రాబోయే రెండు నెలల్లో తాగునీటి గండాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నా య చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జిల్లాకు రూ.కోటి చొప్పున రూ.5 కోట్లను ఆయా కలెక్టర్లకు విడుదల చేశారు.
అధిక సాగు నేపథ్యంలో..
జూరాల కింద.. జూరాల జలాశయం కింద ఎడమ, కుడి ప్రధాన కాల్వలు ఉండగా.. దీని ద మొత్తం ఆయకట్టు 1.09 లక్షల ఎకరాలు. కాగా ప్రతి ఏడాది ఖరీఫ్‌లో ఎడమ ప్రధాన కాల్వ పరిధిలో వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో 72 వేల ఎకరాలు, కుడి ప్రధాన కాల్వ కింద జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో 37 వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు. ఈ ఏడాది జూరాలలో నీటి నిల్వలను దృష్టిలో ఉంచుకుని ఆయా కాల్వల కింద కేవలం 35 వేల ఎకరాలకు వారబందీ విధానంలో ఏప్రిల్ 15 వరకు సాగునీటిని అందిస్తామని అధికారులు ప్రకటించారు. కానీ, రైతులు అధికంగా సుమారు 50 వేల ఎకరాల్లో వరిపంట సాగుచేయడంతో సాగునీటి కష్టాలు మొదలయ్యాయి.
మే నెలాఖరు నాటికే..
ఇదిలా ఉండగా ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, నాగరకర్నూల్ జిల్లాలు తాగునీటి అవసరాల కోసం జూరాల జలాశయం మీదనే ఆధారపడి ఉన్నాయి. ఇందుకోసం ప్రస్తుతం రోజుకు 0.1 టీఎంసీల నీటిని వదులుతున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన జలాశయంలో ఉన్న 0.208 టీఎంసీల నీరు మే నెలాఖరు నాటికే సరిపోతాయని అధికారులు అంచనా వేశారు.
తొమ్మిదేళ్లుగా మే మొదటి వారంలో జూరాలలో అందుబాటులో నీటినిల్వలు ఇలా...
ఏడాది అందుబాటులో నీటినిల్వ
2016 3.696 టీఎంసీలు
2017 4.829 టీఎంసీలు
2018 4.747 టీఎంసీలు
2019 2.689టీఎంసీలు
2020 7.627 టీఎంసీలు
2021 6.477 టీఎంసీలు
2022 7.836 టీఎంసీలు
2023 4.038 టీఎంసీలు
2024 4.004 టీఎంసీలు
2025 2.953 టీఎంసీలు
(ఏప్రిల్17)
అడుగంటిన జలాశయం..
ఆందోళనలో రైతన్నలు
ప్రస్తుతం అందుబాటులో ఉన్నది 2.871 టీఎంసీలు మాత్రమే
తాగునీటి కోసం ప్రతి రోజు
0.1 టీఎంసీలు వినియోగం
ఇప్పటికే ఆయకట్టు పరిధిలోని
పంటలకు సాగునీటి నిలిపివేత
రాబోయే రోజుల్లో
మరింత గడ్డు పరిస్థితులు
డెడ్ స్టోరేజీ
డెడ్ స్టోరేజీ
డెడ్ స్టోరేజీ