
తల్లులకు అవగాహన కల్పించాలి: ఎంపీ
పాలమూరు: దేశంలో ఫ్రీ మెచ్యూర్, బర్త్ వెయిట్ ద్వారా 40 శాతం పిల్లలు పుట్టడం జరుగుతుందని ఇలాంటి వారికి ఈ మిల్క్ బ్యాంక్ ఉపయోగకరంగా ఉంటుందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని ఎంసీహెచ్ భవనంలో సుషేనా ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన ధాత్రి సమగ్ర లాక్టేషన్ మేనేజ్‌మెంట్ సెంటర్–మదర్ మిల్క్ బ్యాంక్‌ను గురువారం ఎంపీతో పాటు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ విజయేందిర బోయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తల్లిపాల సేకరణ చేయడానికి అవసరమైన అంబులెన్స్‌ను ఎంపీ నిధుల కింద మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. పిల్లలకు తల్లి పాలను మించిన ఔషధం లేదని, తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన పెంచాలన్నారు. ఈ సెంటర్ ద్వారా ఏడాదికి 2,500 మంది పిల్లల ప్రాణాలు కాపాడవచ్చని పేర్కొన్నారు. ఈ సెంటర్ వినియోగంతో పాటు ఉపయోగాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వైద్యాధికారులపై ఉందన్నారు. తల్లులకు పోషకాహార లోపం, తల్లి పాల విషయంలో అవగాహన, సలహాలు అవసరమన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత మిల్క్ బ్యాంక్ సెంటర్ ఉన్న మొదటి ఆస్పత్రి మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రి అని తెలిపారు. ఈ కార్యక్రమం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వ్యాప్తి చేసి డోనర్స్ నుంచి పాలు సేకరించాలన్నారు. కలెక్టర్ విజయేందిర మాట్లాడుతూ ఇలాంటి మిల్క్ బ్యాంక్ జిల్లాకు రావడం సంతోషకరమని, ఎలాంటి నిర్వాహణ లోపం లేకుండా విజయవంతంగా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ కృష్ణ, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్‌కుమార్ సింగ్, డాక్టర్ జలాలం, ధరణికోట సుయోధన, శ్రీనివాస్, సంతోష్, శంకర్‌రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
జనరల్ ఆస్పత్రిలో మదర్ మిల్క్ బ్యాంక్ ప్రారంభం