
బైక్‌లో చెలరేగిన మంటలు
● కిందపడి ఒకరి దుర్మరణం..
మరొకరికి తీవ్రగాయాలు
వంగూరు: ఊహకు అందని విధంగా ఒక్కసారిగా బైక్‌లో మంటలు చెలరేగడంతో అదుపుతప్పి కిందపడింది. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన వంగూరు స్టేజీ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ మహేందర్ వివరాల మేరకు.. హైదరాబాద్ మెహదీపట్నానికి చెందిన జునాయత్ (27) ఇబ్రహీంలు బైక్‌పై శ్రీశైలం బయల్దేరారు. మార్గమధ్యంలోని వంగూరు స్టేజీ సమీపంలోకి చేరుకున్న బైక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బైక్ నడుపుతున్న జునాయత్ మంటల నుంచి తప్పించుకునే క్రమంలో అదుపుతప్పి కిందపడటంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఇబ్రహీంకు తీవ్రగాయాల కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బైక్ పూర్తిగా దగ్ధమైంది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి మృతి
చిన్నచింతకుంట: గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని ఉంద్యాల సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాంలాల్‌నాయక్ కథనం మేరకు.. మక్తల్ మండలం వనైకుంటకు చెందిన ఊట్కూర్ ఆశప్ప (55) ఆదివారం తన ద్విచక్ర వాహనంపై ఉంద్యాలలోని బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి హాజరయ్యాడు. కార్యక్రమం ముగించుకొని తిరిగి వెళ్తుండగా గ్రామ శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. గమనించిన గ్రామస్తులు వెంటనే బంధువులు, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి 108 వాహనంలో చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.
టిప్పర్‌ను ఢీకొట్టిన ఆటో..
డ్రైవర్ దుర్మరణం
మహమ్మదాబాద్: ఎదురెదురుగా టిప్పర్, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతిచెందిన ఘటన మహమ్మదాబాద్ మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. హన్వాడ మండలం షేక్‌పల్లి ఎల్లంబాయి తండాకు చెందిన సునీల్ (20) ఆటో తీసుకుని షేక్‌పల్లి నుంచి మహమ్మదాబాద్ వైపు వస్తుండగా.. నంచర్ల క్రాస్‌రోడ్డు వద్ద టైరు పగిలింది. ఈ క్రమంలో ఆటో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న టిప్పర్ వైపు దూసుకెళ్లి ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ సునీల్‌కు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి తెలిపారు.
మృతదేహం లభ్యం
వనపర్తి రూరల్: జిల్లా కేంద్రంలోని నల్లచెరువులో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్ వివరాల మేరకు.. నల్లచెరువులో వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని వెలికితీశారు. సదరు వ్యక్తి వయసు 40 ఏళ్లు ఉంటాయని, నాలుగు రోజుల క్రితం చెరువులో పడి ఉంటాడని ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని జిల్లా మార్చురీకి తరలించినట్లు పేర్కొన్నారు. ఆ వ్యక్తి గోదుమ కలర్ నలుపు గీతల షర్ట్, నీలం రంగు ఫ్యాంట్ ధరించి ఉన్నాడని.. ఎవరైనా గుర్తిస్తే 87126 70612 నంబర్‌ను సంప్రదించాలని ఎస్‌ఐ తెలిపారు.