సర్కార్‌ బడిలో ప్రీ ప్రైమరీ | - | Sakshi
Sakshi News home page

సర్కార్‌ బడిలో ప్రీ ప్రైమరీ

Published Sat, Apr 19 2025 9:38 AM | Last Updated on Sat, Apr 19 2025 9:38 AM

సర్కార్‌ బడిలో ప్రీ ప్రైమరీ

సర్కార్‌ బడిలో ప్రీ ప్రైమరీ

పాఠశాల బలోపేతంపై ప్రభుత్వం దృష్టి

ఇప్పటికే 26 పాఠశాలల్లో అమలు

మరో 30 పాఠశాలల్లో నిర్వహణకు కసరత్తు

నిధుల కేటాయింపు..

ప్రీ–ప్రైమరీ తరగతుల నిర్వహణ కోసం సమగ్ర శిక్ష తెలంగాణ నుంచి రూ. 11,95,500 మంజూరయ్యాయి. జిల్లాలోని ఏడు పాఠశాలలకు ఈ బడ్జెట్‌ కేటాయించారు, ఇందులో..

బోధకుల గౌరవ వేతనం: నెలకు రూ.8 వేల చొప్పున రూ.5.44 లక్షలు

ఆయాల గౌరవ వేతనం: నెలకు రూ.6,000 చొప్పున రూ.4,08 లక్షలు

ఇండోర్‌ మెటీరియల్‌: రూ.1.40లక్షలు

హెల్త్‌ అండ్‌ సానిటేషన్‌: రూ.70వేలు

టీచింగ్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌(టీఎల్‌ఎం): రూ.33,500

పీఎంశ్రీ పాఠశాలలకు బోధకులు, ఆయాలతోపాటు ప్లే మెటీరియల్‌, ఇతర సామగ్రి అందుతుండగా, నాన్‌–పీఎంశ్రీ పాఠశాలల్లో ఈ సౌకర్యాలు పరిమితంగా ఉన్నాయి. మిగిలిన 16 పాఠశాలలకు బడ్జెట్‌ కేటాయింపు కోసం ప్రతిపాదనలు పంపించారు.

మంచిర్యాలఅర్బన్‌: ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్‌ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పూర్వ ప్రాథమిక విద్య(ప్రీ ప్రైమరీ) విధానాన్ని ప్రవేశపెట్టి, ఐదేళ్లలోపు చిన్నారులకు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. తద్వారా మూడేళ్లు నిండిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుకుని నాణ్యమైన విద్య అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధానం ఇప్పటికే జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో విజయవంతంగా అమలవుతోంది. మరిన్ని పాఠశాలలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

కొత్త ఒరవడి

ఇప్పటివరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఐ దేళ్లు నిండిన విద్యార్థులకు మాత్రమే ప్రవేశాలు క ల్పించేవారు. కొత్త విధానం ప్రకారం మూడేళ్లు నిండిన చిన్నారులను నర్సరీ తరగతుల్లో చేర్చుకోనున్నారు. గతేడాది నుంచి జిల్లాలో 26 పాఠశాలల్లో ప్రీ–ప్రైమరీ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ కార్యక్రమం విజయానికి నిదర్శనం. అదనంగా జిల్లాలో మరో 30 పాఠశాలల్లో ఈ విధానం అ మలుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సర్కారు బడుల్లో నూతన శకం ప్రారంభం కానుంది.

ఆర్థిక భారం తగ్గింపు

ప్రస్తుతం జిల్లాలో 511 ప్రాథమిక పాఠశాలల్లో 13,678 మంది, 97 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 4,234 మంది, 108 ఉన్నత పాఠశాలల్లో 23,442 మంది చదువుతున్నారు. ప్రీ–ప్రైమరీ విధానం అమలుతో మూడేళ్ల చిన్నారులూ చేరితే సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రైవేట్‌ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యకు వేలాది రూపాయల ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. సర్కారు బడుల్లో ఉచితంగా విద్య అందడంతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గనుంది. అంగన్‌వాడీ కేంద్రాలతో సమన్వ యం చేస్తూ ఈ కేంద్రాలు ఉన్న పాఠశాలలను ప్రీ– ప్రైమరీ కోసం ఎంపిక చేయనున్నట్లు సమాచారం. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఈ పాఠశాలలను గుర్తించి విద్యాశాఖకు నివేదిక సమర్పించనుంది.

జిల్లాలో అమలు విధానం

గతేడాది నుంచి జిల్లాలోని బెల్లంపల్లి, భీమారం, చెన్నూర్‌, దండేపల్లి, జన్నారం, కన్నెపల్లి, కాసిపేట, కోటపల్లి, లక్సెట్టిపేట, మందమర్రి, నెన్నెల, వేమనపల్లి మండలాల్లో ఉన్న 26 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ–ప్రైమరీ తరగతులు(పీపీ–1: నర్సరీ, పీపీ–2: యూకేజీ, పీపీ–3: ఎల్‌కేజీ) నిర్వహిస్తున్నారు. ఆయా పాఠశాలల్లో 241మంది చిన్నారులు ఉన్నారు. ఈ పాఠశాలలు ప్రైవేట్‌ స్కూళ్లతో పోటీపడి విద్యార్థుల సంఖ్యను పెంచుకుంటున్నాయి. జనకాపూర్‌, జెండా వెంకటపూర్‌, సుద్దాలలోని పీఎంశ్రీ పాఠశాలలు ఈ కార్యక్రమంలో ముందంజలో ఉన్నాయి. కొన్ని నాన్‌–పీఎంశ్రీ పాఠశాలల్లో బోధకులకు రూ.8 వేలు, ఆయాలకు రూ.6 వేల చొప్పున 10 నెలలపాటు గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో డీఈడీ, టెట్‌ అర్హత ఉన్న స్థానిక అభ్యర్థులను బోధకులుగా నియమిస్తున్నారు. కిష్టాపూర్‌, చంద్రవెళ్లి, ఎంపీపీఎస్‌ బీసీ హజిం కాలనీ, ధర్మారం, తుర్కపల్లి, పోన్కల్‌, నంబాల వంటి పాఠశాలలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాయి.

భవిష్యత్‌ ప్రణాళికలు..

ప్రభుత్వం మరో 30 పాఠశాలల్లో ప్రీ–ప్రైమరీ విధానాన్ని అమలు చేయడానికి ఆమోదం తెలిపింది. దీంతో నిరుద్యోగ యువతలో ఉపాధి అవకాశాలపై ఆశలు చిగురిస్తున్నాయి. ప్రీ–ప్రైమరీలో చేరే చిన్నారులకు ముఖ్యమంత్రి పేరిట ప్రత్యేక కిట్‌లు అందించే ఆలోచన ఉన్నట్లు సమాచారం. అయితే, కొత్తగా ఏర్పాటయ్యే పాఠశాలలకు సంబంధించి విధివిధానాలపై స్పష్టత రావాల్సి ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement