‘ఓపెన్‌’ పరీక్షల్లో డబ్బులు వసూళ్లు! | - | Sakshi
Sakshi News home page

‘ఓపెన్‌’ పరీక్షల్లో డబ్బులు వసూళ్లు!

Published Thu, Apr 24 2025 12:31 AM | Last Updated on Thu, Apr 24 2025 12:31 AM

‘ఓపెన్‌’ పరీక్షల్లో  డబ్బులు వసూళ్లు!

‘ఓపెన్‌’ పరీక్షల్లో డబ్బులు వసూళ్లు!

బెల్లంపల్లి: ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల్లో జోరుగా మాస్‌ కాపీయింగ్‌ జరుగుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు జరుగుతుండగా బెల్లంపల్లిలో ఇంటర్‌ విద్యార్థుల కోసం బజారు ఏరియా జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్‌ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో, టెన్త్‌ విద్యార్థుల కోసం బెల్లంపల్లి బస్తీలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పదో తరగతి పరీక్ష కేంద్రంలో డ్యూటీ చేస్తున్న ఇన్విజిలేటర్లు కొందరు విద్యార్థుల నుంచి బలవంతంగా ఒక్కో పరీక్షకు రూ.500 చొప్పున వసూలు చేస్తున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. డబ్బులు ఇవ్వని విద్యార్థులను టార్గెట్‌ చేసి మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నట్లుగా చెబుతున్నారు. డబ్బులు ఇచ్చిన వారికి చిట్టీలు అందజేసి మాస్‌ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారులు వెంటనే స్పందించి డబ్బుల వసూలును నివారించి మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా కట్టడి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. కాగా ఈ విషయమై మంచిర్యాల ఏసీజీ దామోదర్‌రావును వివరణ కోరగా పరీక్ష రాస్తున్న విద్యార్థుల వద్ద నుంచి ఇన్విజిలేటర్లు డబ్బులు వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి రాలేదన్నారు. పరీక్ష కేంద్రాలకు స్క్వాడ్‌ను పంపించి కట్టడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా నివారిస్తామని పేర్కొన్నారు.

వడ్డీ వ్యాపారులపై ఎస్పీ కొరడా

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో గల వడ్డీ వ్యాపారులపై ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ బుధవారం కొరడా ఝులిపించారు. ఆరు మండలాల్లో 30 బృందాలతో తనిఖీలు చేపట్టారు. ఆదిలాబాద్‌ వన్‌టౌన్‌, టూటౌన్‌, మావల, ఇచ్చోడ, బోథ్‌, ఉట్నూర్‌ తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ప్రామిసరీ నోట్లు, స్టాంప్‌ పేపర్లు, చెక్కులు, స్థిరాస్తి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వడ్డీ వ్యాపారస్తుల వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. గురువారం వారి వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.

వడ్డీ వ్యాపారుల ఇళ్లలో సోదాలు

ఇచ్చోడ: నియోజకవర్గంలోని వడ్డీ వ్యాపారులతో పాటు ఇతర ప్రైవేట్‌ ఫైనాన్స్‌ వ్యాపారుల ఇళ్లలో పోలీసులు బుధవారం సోదాలు నిర్వహించారు. సోదాల్లో వ్యాపారుల నుంచి పలు రకాల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇచ్చోడ, బోథ్‌, నేరడిగొండ, గుడిహత్నూర్‌, బజార్‌హత్నూర్‌, గుడిహత్నూర్‌లలో విడివిడిగా పోలీసు బృందాలు తనిఖీలు చేపట్టాయి. తనిఖీలో స్వాధీనం చేసుకున్న పత్రాలను ఆయా పోలీస్‌స్టేషన్లలో అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

లక్సెట్టిపేట: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపల్‌ పరిధిలోని గోదావరి రోడ్‌కు చెందిన పందిరి అశ్విత(17) అనే ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక ఎస్సై సురేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఓ ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్‌ బైపీసీ చదివిన విద్యార్థిని ఇటీవల వార్షిక పరీక్షలకు హాజరైంది. ఇంగ్లీష్‌ ప్రాక్టికల్‌ పరీక్షకు గైర్హాజరు కావడంతో ఫెయిల్‌ అయింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురై బుధవారం ఉదయం ఇంటిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి భూమయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement