హమాలీలపై సమ్మె పోటు | - | Sakshi
Sakshi News home page

హమాలీలపై సమ్మె పోటు

Published Sun, Apr 27 2025 12:14 AM | Last Updated on Sun, Apr 27 2025 12:14 AM

హమాలీ

హమాలీలపై సమ్మె పోటు

● నిలిచిన లారీల రవాణా ● ఉపాధి లేక అల్లాడుతున్న కాంటా కార్మికులు

తిండికి తిప్పలైతంది..

పని చేస్తేనే వచ్చిన పైసలతో బతుకుడు. బండ్లు నడవక డబ్బులు లేక తిండికి తిప్పలైతంది. 15రోజులుగా బండ్లు నడుస్తలేవు. పని లేక ఇంటికాడ ఖాళీగా

ఉంటున్నాం. కుటుంబం గడువడం కష్టంగా మారింది.

– జనగామ నాగరాజు, రామారావుపేట

జైపూర్‌: కాంటా హమాలీపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఊరి కార్మికులకు ఉపాధి కరువైంది. లారీ యజమానుల సమ్మె కారణంగా ఉపాధి దొరక్క పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడున్నర దశాబ్దాలుగా హమాలీ పనిపైనే ఆధారపడి జీవిస్తున్న వారంతా మరో పనికి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. గత పదిహేను రోజులుగా మంచిర్యాల లారీ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్‌, శ్రీరాంపూర్‌ కోల్‌బెల్ట్‌ అసోసియేషన్‌ లారీ యజమానులు సమ్మె చేస్తున్నారు. ఫలితంగా లారీల్లో బొగ్గు రవాణా నిలిచిపోయింది. లారీలపై బొగ్గు లెవలింగ్‌ చేసే హమాలీ కార్మికులకు ఉపాధి కరువైంది. మండలంలోని రామారావుపేట గ్రామం నుంచి 300మంది కాంటా హమాలీ కార్మికులుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. 1990లో శ్రీరాంపూర్‌ ఏరియాలో లారీ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్‌ ద్వారా కాంటా హమాలీ పని చేయడానికి ఒప్పందం కుదుర్చుకుని అప్పటి నుంచి హమాలీ పని చేస్తున్నారు. 300 మంది హమాలీ కార్మికులు మూడు షిఫ్టులుగా సింగరేణి గనులు, కాంటాల వద్ద లోడింగ్‌కు వచ్చిన లైన్‌ లారీల్లో బొగ్గు నింపిన తర్వాత కాంటా వేశాక బొగ్గు ఎక్కువగా ఉంటే తీసేయడం, తక్కువగా ఉంటే మళ్లీ లారీలో వేయడం, సమానంగా చేసి టార్పాలిన్‌ కవర్‌ కప్పడం వీరి పని. ఇందుకు ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్‌ ద్వారా పది టైర్ల లారీకి రూ.410, ఆరు టైర్ల లారీకి రూ.360 చొప్పున చెల్లిస్తారు. మూడు షిఫ్టుల్లో బొగ్గు రవాణా డిమాండ్‌కు అనుగుణంగా లారీలు వస్తాయి. ఆ రోజు వచ్చిన హమాలీ కార్మికులు వేర్వేరు గనులపైకి వెళ్లి అక్కడ పని చేస్తారు. వచ్చిన డబ్బులను రోజువారీగా మస్టర్‌ లెక్కగట్టి నెలనెలా జీతంగా తీసుకుంటారు. ఇలా గ్రామానికి చెందిన వారిలో అధిక శాతం ఇదే పనిపై ఆధారపడి జీవిస్తున్నారు. మరో పని చేయలేక.. ఉన్న పనిలో ఏడాదిలో వేర్వేరుగా ఉన్న ట్రాన్స్‌పోర్టు యూనియన్లు సమ్మె చేయడం ఆరు నెలలకోసారి ఇలా 20 రోజులు సమ్మె చేయడంతో పని కరువై తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. 300 కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి దాపురించిందని హమాలీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భద్రత లేని బతుకులు

సుమారు 35ఏళ్లుగా హమాలీ పని చేస్తున్న కార్మికులకు కనీస భద్రత లేదు. నెలంతా చేసినా రూ.10వేలు దాటవు. అందులో లారీ యూనియన్లు సమ్మె చేయడంతో కనీసం తిందామంటే తిండి దొరకని స్థితిలో అల్లాడుతున్నారు. ఊరు ఊరంతా వారి తండ్రులు చేస్తూ వచ్చిన పనిని కొడుకులకు అప్పగించడంతో వారు కూడా అదే పనికి అలవాటు పడి మరో పని చేయలేక కొట్టుమిట్టాడుతున్నారు. అనేక మార్లు గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టు కార్మికులుగా గుర్తించి భద్రత కల్పించాలని పోరాటాలు చేసినా ఫలితం లేకుండాపోయింది.

కార్మికులుగా గుర్తించాలె..

బొగ్గు లోడింగ్‌, ఆన్‌లోడింగ్‌, లెవలింగ్‌ హమాలీలను

కార్మికులుగా గుర్తించాలి. ఏళ్లుగా హమాలీ పనిచేస్తూ జీవనం

గడుపుతున్నాం. కనీసం కాంట్రాక్టు కార్మికులుగా గుర్తించడం లేదు. కార్మికులుగా గుర్తించి భద్రత కల్పించాలి.

– బొద్దున రాజేశం, యూనియన్‌ లీడర్‌

హమాలీలపై సమ్మె పోటు1
1/1

హమాలీలపై సమ్మె పోటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement