
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదాం
చెన్నూర్/రామకృష్ణాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, రానున్న రోజుల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదామని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చెన్నూర్, రామకృష్ణాపూర్‌లో ఆదివా రం పార్టీ జెండాలను ఆవిష్కరించారు. చెన్నూర్ నియోజకవర్గంలో 40 ఏళ్లు వివేక్ కుటుంబ సభ్యులే అధికారంలో ఉన్నా ఎందుకు అభివృద్ది చేయలేదని ప్రశ్నించారు. గత ఐదేళ్లలో చెన్నూర్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ది తప్ప 18 నెలల్లో వివేక్ ఒక్క రూపాయి తీసుకురాలేదని తెలిపారు. తన హయాంలో మంజూరైన నిధులకు పేరుమార్చి తాను తెచ్చినట్లు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే గడ్డం వివేక్ మంత్రి పదవిపై శ్రద్ధ చూపిస్తున్నారే తప్ప, నియోజకవర్గ అభివృద్ధిపై ఆసక్తి లేదని విమర్శించారు. కాంగ్రెస్ 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని, ఇక ప్రజలు ఆ పార్టీని నమ్మే స్థితిలో లేరని అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో చేపట్టిన మందమర్రి ఆర్‌వోబీ, క్యాతన్‌పల్లి ఫ్లైఓవర్ వంటి పనులను వివేక్ తమ ఘనతగా చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై దశలవారీ ఆందోళనలు, మెంబర్‌షిప్ డ్రైవ్, కమిటీల ఏర్పాటు చేపడతామని తెలిపారు. అనంతరం బీఆర్‌ఎస్ శ్రేణులు వరంగల్‌లోని రజతోత్సవ సభకు భారీగా తరలివెళ్లారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు డాక్టర్ రాజా రమేశ్, రాంలాల్‌గిల్డా, మంత్రి బాపు, మోతె తిరుపతి, నవాజ్, కృష్ణ, ఆరీఫ్, సుదర్శన్‌గౌడ్, బడికల సంపత్, జాడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదాం