'పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు' : రేవంత్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

'పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు' : రేవంత్‌రెడ్డి

Published Tue, Nov 21 2023 4:40 AM | Last Updated on Tue, Nov 21 2023 9:04 AM

- - Sakshi

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

సాక్షి, మెదక్‌: తమ ప్రభుత్వం రాగానే పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు, గిరిజన తండాల అభివృద్ధికి వంద కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం నర్సాపూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయభేరి సభలో ఆయన ముఖ్య అథితిగా పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గం గిరిజనుల అడ్డా, గడ్డ అని అభివర్ణించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో గిరిజన తండాలలో అభివృద్ధి జరగలేదని, అనేక సమస్యలతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తమ ప్రభుత్వం రాగానే గిరిజనుల పోడు భూములకు పట్టాలు ఇచ్చి, ఇతర పథకాలు అందించి గిరిజనుల అభివృద్ధికి కృషిచేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీకి మోసంచేసి పలువురు నాయకులు పార్టీని వీడి పదవులకు అమ్ముడు పోవడంతో సభ ఎలా ఉంటుందోనని అనుమానంతో వచ్చానని, కాని సభాస్థలిని చూడగానే జనం చీమల మాదిరిగా హాజరవడం చూసి ఆనందించానని చెప్పారు. కార్యకర్తలు కార్యాచరణతో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డిని గెలిపించేందుకు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

బీఆర్‌ఎస్‌ను మర్చి పోయేలా చేద్దాం!
ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ నాయకులు భూదందాలకు, అవినీతికి పాల్పడడంతో పేదలు చాలా ఇబ్బందుల పాలయ్యారని ఆరోపించారు. నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ను మర్చి పోయేలా చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. దళితులు, గిరిజనుల పోడు భూములకు పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని, కాళేశ్వరం, త్రిబుల్‌ ఆర్‌ రోడ్డు విషయంలో భూములు కోల్పోయిన వారికి ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని ఆయన రేవంత్‌రెడ్డిని కోరారు.

నిరుద్యోగులకు బీఆర్‌ఎస్‌ ధోకా..
మెదక్‌ జిల్లాను రాజన్నసిరిసిల్ల జోన్‌లో కలిపి జిల్లాలోని నిరుద్యోగులను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసం చేసిందని ఆవుల రాజిరెడ్డి ఆరోపించారు. జిల్లాను రాజన్న సిరిసిల్లజోన్‌ నుంచి మార్పుచేసి చార్‌మినార్‌ జోన్‌లో కలపాలని ఆయన కోరారు.

పేదల గుండె చప్పుడు విఠల్‌రెడ్డి
నర్సాపూర్‌ నియోజకవర్గం నుంచి సీపీఐ ఎమ్మెల్యేగా దివంగత చిలుముల విఠల్‌రెడ్డి ఐదుసార్లు గెలిచి పేద ప్రజల గుండె చప్పుడై అసెంబ్లీలో గళం వినిపించి నర్సాపూర్‌ గౌరవాన్ని పెంచారని గుర్తు చేశారు. ప్రస్తుత ఎన్నికలలో సీపీఐతో తమ పార్టీకి పొత్తు ఉందని చెప్పారు. కాంగ్రెస్‌లో పదవులు అనుభవించి ఎన్నికలలో ఓడిపోగానే పార్టీ కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచి శత్రువు పంచన చేరడం తగునా అని సునీతారెడ్డిని ప్రశ్నించారు. అలాంటి వారిని ఎలా గెలిపిస్తారని ప్రజలను ప్రశ్నించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు బాధితులకు న్యాయం చేస్తాం!
తమ పార్టీ అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు, త్రిబుల్‌ ఆర్‌ రోడ్డు కోసం భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాకుండా బాధితులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రేవంత్‌రెడ్డిని గజమాల, శాలువాలతో ఘనంగా సన్మానించారు.

రామంతాపూర్‌ సర్పంచ్‌ గోపి, కొల్చారం మాజీ సర్పంచ్‌ శేఖర్‌ తదితరులు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. సభలో పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి టీఎం కాలేక్‌, కాంగ్రెస్‌ నాయకులు ఆంజనేయులుగౌడ్‌, శేషసాయిరెడ్డి, సుహాసినీరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, సుజాత, లక్ష్మీకాంతారావు, రవీందర్‌రెడ్డి, మల్లేశ్‌, సుధీర్‌రెడ్డి, శ్రీనివాస్‌గుప్తా, చిన్న అంజిగౌడ్‌, హకీం, రిజ్వాన్‌, కమల, నరేందర్‌రెడ్డి, పల్లె జయశ్రీ, మణిదీప్‌, ఉదయ్‌, రషీద్‌ పాల్గొన్నారు.

తడబడిన నాయకులు..
సభలో పలువురు పార్టీ నాయకులు తమ ప్రసంగాలలో తడబడ్డారు. ఆ పార్టీ నాయకురాలు చిలు ముల సుహాసినీరెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పార్టీని విమర్శించి కాంగ్రెస్‌కు ఓటెయ్యాలని ప్రజలను కోరేక్రమంలో ‘కారు’ గుర్తు అని పొరపాటుగా మాట్లాడి హస్తం గుర్తుకు ఓటెయ్యాలని తిరిగి సరిదిద్దుకున్నారు. అలాగే మరో నాయకుడు సుధీర్‌రెడ్డి కూడా తన ప్రసంగంలో ‘‘18 సంవత్సరాలు అధికారంలో ఉన్న ఈ కాంగ్రెస్‌ పార్టీకి బుద్ధి చెప్పేందుకు నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారు’’ అని తడబడడం గమనార్హం.

కేసీఆర్‌ మిత్ర ద్రోహి
నర్సాపూర్‌ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ల మధ్య సుమారు 50 ఏళ్ల స్నేహం ఉందన్నారు. కలిసి తిరిగినం, కలిసి తాగినం, కలిసి తిన్నమని వారిద్దరి స్నేహం గురించి కేసీఆర్‌ చెప్పే వారని, అలాంటి మంచి మిత్రుడు మదన్‌రెడ్డికి పార్టీ టికెట్‌ ఇవ్వకుండా కేసీఆర్‌ మోసం చేయడంతో పాటు మిత్ర ద్రోహానికి పాల్పడ్డాడని మండిపడ్డారు.
ఇవి చదవండి: 'నేతలు మారినా.. ఓటరు మారేనా?' ఇంత‌కీ.. జంప్‌జిలానీల బలమెంత?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement