
బిగ్‌బాస్ షోతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న నటుడు అమర్‌దీప్ చౌదరి కొత్త సినిమా ‘సుమతీ శతకం’ ఘనంగా ప్రారంభమైంది. సన్నీ లియోన్ నటించిన ‘మందిర’ చిత్రంతో విజయం సాధించిన విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో, కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో ఎం.ఎం. నాయుడు దర్శకుడిగా తొలి అడుగు వేస్తున్నారు.
ఈ చిత్రంలో అమర్‌దీప్ చౌదరి, సైలీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా అమరావతిలోని వైకుంటపురం విలేజ్ టెంపుల్‌లో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తం కార్యక్రమంలో చిత్ర తారాగణం, సిబ్బందితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ముహూర్తం షాట్‌కు క్లాప్ కొట్టగా, వెన్నా సాంబశివారెడ్డి కెమెరా స్విచాన్ చేశారు.
‘సుమతీ శతకం’ కథను బండారు నాయుడు అందించగా, సుభాష్ ఆనంద్ సంగీతం సమకూరుస్తున్నారు. సినిమాటోగ్రఫీని హాల్‌స్వామి, ఎడిటింగ్‌ను సురేష్ విన్నకోట నిర్వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని నిర్మాతలు ప్రకటించారు.