
‘‘నాలుగైదేళ్ల క్రితం భక్తి భావంలేని నేను ‘ఓదెల 2’( Odela 2 Movie) కథ రాశానంటే ఆ పరమశివుడే నాతో రాయించాడు. స్క్రీన్‌పై నంది, శివుడు విజువల్స్ కనిపించినప్పుడు ప్రేక్షకులు ఫీలైన విషయాన్ని నాకు ఫోన్ చేసి, చెప్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. మా ఊరివాళ్లు ఫోన్ చేసి, ‘ప్రైడ్ ఆఫ్ ఓదెల’ అని చెబుతుంటే అద్భుతంగా భావిస్తున్నాను. ఈ సినిమా ఎప్పటికీ నా మనసులో ఉండిపోతుంది’’ అన్నారు దర్శకుడు సంపత్ నంది.
తమన్నా ప్రధాన పాత్రలో, వశిష్ఠ, హెబ్బా పటేల్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓదెల 2’. సంపత్ నంది సూపర్ విజన్‌లో అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి. మధు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదలైంది.
ఈ సందర్భంగా జరిగిన సక్సెస్‌మీట్‌లో సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘రిలీజ్‌కు ముందే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఆల్రెడీ ‘ఓదెల 2’ సక్సెస్‌బాటలో వెళ్తోంది. ఈ సినిమా అనుకున్నప్పుడే తమన్నాగారిని అనుకున్నాం. ఆమె అద్భుతంగా నటించారు. ‘ఓదెల 2’లోని సమాధి శిక్ష, సైకిల్ ఎపిసోడ్, క్లైమాక్స్... వీటి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.
సినిమాలో ఉన్న మంచిని మాత్రమే స్ప్రెడ్ చేయండి’’ అన్నారు. ‘‘సినిమా చూసిన ప్రేక్షకులు బాగుందని అంటున్నారు. కానీ కొంతమంది క్రిటిక్స్ మాత్రం నెగటివ్‌గా రాశారు. వారికంటే మాకు ప్రేక్షకుల ఫీలింగే ముఖ్యం’’ అని తెలిపారు నిర్మాత డి. మధు. ‘‘మా ‘ఓదెల 2’కు మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. కలెక్షన్స్ పెరుగుతున్నాయి’’ అని అన్నారు అశోక్ తేజ.