
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులకి (Gaddar Film Awards) వేదిక ఖరారు అయింది. రాష్ట్ర ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్‌రాజు (Dil Raju) ఏర్పాట్లకు ప్రణాళికను రెడీ చేస్తున్నారు. సుమారు 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఇస్తున్న ఈ పురస్కారాల ఎంపిక కోసం జ్యూరీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జ్యూరీ ఛైర్మన్‌గా ప్రముఖ నటి జయసుధ (Jayasudha)తో పాటుగా 15మంది సభ్యులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈమేరకు తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దిల్‌రాజు, జయసుధ మీడియాతో మాట్లాడారు. జూన్ 14న హెచ్‌ఐసీసీ వేదికగా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం ఉంటుందని వారు ప్రకటించారు.
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గద్దర్ అవార్డ్స్ కార్యక్రమం గురించి ఇలా చెప్పుకొచ్చారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ఈ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. దశాబ్దకాలంగా పరిశ్రమకు చెందిన వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రొత్సహకాలతో పాటు అవార్డులు ఇవ్వలేదని గుర్తుచేశారు. ఇలా నిర్లక్ష్యంగా చేయడం మంచి సంప్రదాయం కాదని సీఎం రేవంత్‌రెడ్డి భావించారని భట్టి విక్రమార్క అన్నారు. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు ప్రవేశపెట్టడానికి చాలా కారణాలున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. తన గళంతో తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేశారని తెలిపారు. గద్దర్ పుట్టడం తెలంగాణ రాష్ట్ర అదృష్టమని ఆయన అన్నారు. తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారన్నారు.
అలాంటి వ్యక్తి పేరు మీద అవార్డులు ఇవ్వడం సముచిత నిర్ణయంగా భావించామన్నారు. కళలకు పుట్టినిల్లు హైదరాబాద్ అని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఈ అవార్డుల గురించి మాట్లాడుకునేలా వేడుకలు నిర్వహిస్తామన్నారు. అవార్డుల కోసం వచ్చిన ఎంట్రీల జాబితాను జ్యూరీ ఛైర్మన్ జయసుధకు భట్టివిక్రమార్క, దిల్‌రాజు అందించారు. ఎంపిక అయిన 35 చిత్రాలను జ్యూరీ సభ్యులతో కలిసి డిప్యూటీ సీఎం వీక్షించనున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. గద్దర్ పేరుతో ఇచ్చే అవార్డులపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఆయన పేరుతోనే అవార్డులు ఇస్తామని స్పష్టం చేశారు.
పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల భట్టి విక్రమార్క శ్రద్దాంజలి ప్రకటించారు. పోప్ ఫ్రాన్సిస్ మరణం వల్ల నేడు విడుదల చేయాల్సిన గద్దర్ అవార్డుల లోగో ఆవిష్కరణను వాయిదా వేశారు. త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల లోగో ఆవిష్కరణ జరిపిస్తామని వారు తెలిపారు.