
‘భారత్ సమ్మిట్–2025’ నిర్వహణపై మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించిసదస్సులో ప్రత్యేకంగా వివరిస్తామని వెల్లడి
మంత్రి ఉత్తమ్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ తదితరులతో కలిసి ఏర్పాట్లపై సమీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను ప్రపంచానికి ఒక మోడల్‌గా చూపేందుకు రెండు రోజుల భారత్ సమ్మిట్–2025 అంతర్జాతీయ సదస్సును రాష్ట్ర ప్రభుత్వం ఓ గొప్ప కార్యక్రమంగా నిర్వహించనుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా శుక్ర, శనివారాల్లో సదస్సును నిర్వహించనున్న నేపథ్యంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి భట్టి గురువారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతాలైన అహింస, సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై చర్చించేందుకు సుమారు 100 దేశాలకు చెందిన ప్రభుత్వాధినేతలు, ఎంపీలు, జాతీయ పార్టీల నాయకులు, కార్పొరేట్ దిగ్గజాలు, థింక్ ట్యాంకర్స్ మొత్తంగా 450 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.
అమెరికా, రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న వేళ భారత్ ఎటువైపు మొగ్గు చూపకుండా అలీన విధానాన్ని ఎంచుకొని ముందుకెళ్లిందని భట్టి గుర్తుచేశారు. దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య రాజకీయ పార్టీగా కాంగ్రెస్ నిలబడిందని.. అలీన విధానాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ముందుకు తీసుకువెళ్లాయని చెప్పారు. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ దేశాల ప్రతినిధులను వివిధ అంశాలపై చర్చించేందుకు ఆహ్వానించిందని వివరించారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధి, వనరులు, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించేందుకు ప్రత్యేక స్లాట్ కేటాయించామని తెలిపారు.
ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను నిలిపేందుకు ఈ సదస్సు ఉపయోగపడుతుందన్నారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు రానుండటం తెలంగాణకు గర్వకారణమన్నారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణ అభివృద్ధిని, ప్రజలకు అందుతున్న సంక్షేమాన్ని ప్రపంచానికి తెలియజేస్తామన్నారు. అనంతరం భారత్ సమ్మిట్ ఏర్పాట్లను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్, డిప్యూటి సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్ తదితరులు సమీక్షించారు.
డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్ ఇతివృత్తంతో..
భారత జాతీయ కాంగ్రెస్ 140వ వార్షికోత్సవం, అలీనోద్యమానికి ఆధారమైన 1955 నాటి బండుంగ్ సదస్సు జరిగి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్ ఇతివృత్తంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సదస్సు నిర్వహిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘న్యాయ్’ఆలోచన ఆధారంగా ఇది రూపొందింది. భారతీయ విలువలతో కూడిన న్యాయమైన, ఉదారవాద ప్రపంచ వ్యవస్థను నిర్మించే లక్ష్యంతో సదస్సు నిర్వహిస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు తొలిరోజు సదస్సులో స్వాగతోపన్యాసం చేయనుండగా రాహుల్ గాం«దీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక ప్రసంగాలు చేయనున్నారు. అనంతరం ‘హైదరాబాద్ డిక్లరేషన్’ను ప్రకటిస్తారు. సదస్సు ముగింపు సమావేశంలో ప్రియాంక గాంధీ, కె.సి.వేణుగోపాల్ ప్రసంగించనున్నారు.