
టాలీవుడ్ దర్శకుడు హరీశ్ శంకర్ వేదికలపై ఎలాంటి వ్యాఖ్యలు చేసినా వైరల్ అవుతూనే ఉంటాయి. ఇప్పటికే ఆయన పలుమార్లు తన కామెంట్ల వల్ల నెట్టింట నెగటివిటీని తెచ్చుకున్నారు. తాజాగా ‘ప్రేమలు’ మూవీ ఫేమ్ నస్లేన్ కె.గఫూర్ (Naslen K.Gafoor) నటించిన ‘జింఖానా’ (Gymkhana) ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఏప్రిల్ 25న విడుదల కానున్న ఈ మూవీని దర్శకుడు ఖలీద్ రెహమాన్ తెరకెక్కించారు.
దర్శకుడు హరీశ్ శంకర్ సినిమాలు బాగుంటాయని ఆయనకు గుర్తింపు ఉంది. అందుకే అతని నుంచి వచ్చే ప్రతి ప్రాజెక్ట్‌కు క్రేజ్ ఉంటుంది. అయితే, ఒక్కోసారి ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం సోషల్‌మీడియాలో వివాదస్పదంగానే వైరల్ అవుతుంటాయి. తాజాగా ‘జింఖానా’ మూవీ ప్రీ రిలీజ్ కోసం ముఖ్య అతిథిగా వెళ్లిన హరీశ్ ఏమన్నారంటే.. నేను గతంలో డ్రాగన్ సినిమాను ప్రమోట్ చేశాను. ఆ సమయంలో ఒకమాట అన్నాను.. మన సినిమాలకంటే పక్క భాషల సినిమాలే తెలుగువారు ఎక్కువగా చూస్తారన్నా.. అప్పుడు నన్ను అందరూ విమర్శించారు.
ఆ సమయంలో ఆ మాట ఎందుకనాల్సి వచ్చిందంటే.. నా లాస్ట్ సినిమా (మిస్టర్ బచ్చన్)ను ఎవరూ చూడలేదు. కానీ, అదే టైమ్‌లో వచ్చిన మరో భాష సినిమా (తంగలాన్)ను చూశారు. అందుకే నేను అలాంటి వ్యాఖ్యలు చేశాను. ఇప్పడు కూడా అదే చెబుతున్నా.. ఇతర భాషల సినిమాలను చూసేందుకు ఎగేసుకుని వెళ్తాం కదా.. ఇదే విధంగా ఈ సినిమాను (జింఖానా) కూడా చూడండి. దయచేసి తెలుగు ప్రేక్షకులు అందరూ ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేయండి. ఎవరెలా అనుకున్నా నాకు ఇబ్బంది లేదు. నా అభిప్రాయం చెప్పాను.' అని అన్నారు.
హరీశ్ శంకర్ కామెంట్లకు నెటిజన్లు కూడా తమదైన స్టైల్లో రియాక్ట్ అవుతున్నారు. పక్క భాషల సినిమాలను రీమేక్ చేసే నువ్వు కూడా ఇలాంటి కామెంట్లు చేస్తే ఎలా అంటూ విమర్శిస్తున్నారు. సినిమా బాగుంటే తమకు భాషతో ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. గతంలో మీ సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులే హిట్ చేశారనే విషయం మరచిపోతే ఎలా హరీశ్ అంటూ గట్టిగానే సమాధానం ఇస్తున్నారు. తాము ఎలాంటి సినిమాలు చూస్తామో, చూడాలో చెప్పడానికి మీరు ఎవరు..? అంటూ హరీశ్‌పై ఫైర్ అవుతున్నారు.