
కోలీవుడ్ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ (Kamal Haasan) సుమారు 5 నెలల తరువాత చైన్నెకి చేరుకున్నారు. ఈయన ఏఐ సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ పొందడానికి అమెరికా వెళ్లారు. ఈయన నిర్మించిన అమరన్ చిత్రం ప్రమోషన్‌లోగానీ, చిత్ర విడుదల సమయంలోగానీ పాల్గొనలేదు. ఆ సమయంలో అమెరికాలోనే ఉన్నారు. కాగా మక్కల్ నీది మయ్యం పార్టీలోనూ అనిశ్చితి వాతావరణం నెలకొందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో కమలహాసన్ ఎట్టకేలకు 5 నెలల తరువాత అమెరికా నుంచి చైన్నెకి చేరుకున్నారు.
ఈ సందర్భంగా చైన్నె విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. తాను మణిరత్నం దర్శకత్వంలో నటించిన థగ్ లైఫ్ చిత్రం జూన్ 6వ తేదీన విడుదల కానుందని చెప్పారు. అదేవిధంగా విక్రమ్ 2 చిత్రం చేస్తున్నారా అన్న ప్రశ్నకు అలాంటిది ఏమీ లేదని, వేరే చిత్రానికి కథను సిద్ధం చేసినట్లు కమలహాసన్ చెప్పారు. కాగా ఈయన త్వరలో ఫైట్ మాస్టర్ల ద్వయం అన్బరివ్ దర్శకత్వంలో చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి సంబంధించిన కథా చర్చలను కూడా అమెరికాలోనే జరిపారన్నది గమనార్హం.