
ఇక్బాల్ దర్శకత్వం వహించి, హీరోగా నటించిన తాజా చిత్రం ‘మన ఇద్దరి ప్రేమ కథ’. ప్రేమ కథలకు టాలీవుడ్‌లో మంచి ఆదరణ ఉంటుంది. హీరోహీరోయిన్లతో సంబంధం లేకుండా..మంచి లవ్‌స్టోరీ అయితే చాలు ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు. అందుకే యంగ్ డైరెక్టర్స్ ఎక్కువగా ప్రేమ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. వాటిలో చాలా వరకు సక్సెస్ సాధించాయి. అలా ఈ వారం వచ్చిన తాజా ప్రేమ కథ చిత్రమే ‘మన ఇద్దరి ప్రేమ కథ’. ఇక్బాల్ హీరోగా నటించి, దర్శకత్వం వహించి నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం
కథేంటంటే..
నాని(ఇక్బాల్), శృతి(మోనికా) అనాథలు. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు. ఇద్దరు కలిసి బీచ్‌కి వెళ్తారు. అక్కడ అను(ప్రియా జస్పర్)తో నానికి పరిచయం ఏర్పడుతుంది. ఆమె రాకతో ఇద్దరి మధ్య బంధం బలహీనపడుతుంది. అదే సమయంలో నాని, అను ఇద్దరి సన్నిహిత వీడియో వైరల్ అవుతుంది. దీంతో సమీప గ్రామస్తులు వారిద్దరికీ వివాహం జరిపిస్తారు. అయితే శృతిని ప్రేమించిన నాని.. అనుకోకుండా పెళ్లి చేసుకున్న అనుతో కాపురం చేశాడా? ఈలోగా నాని ఎలాంటి పోరాటాలను ఎదుర్కొంటాడు? క్లైమాక్స్ సన్నివేశాల్లో షాకింగ్ డెవలప్మెంట్ ఏమిటి? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. అది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
‘మన ఇద్దరి ప్రేమకథ’ అనేది మెసేజ్ ఓరియెంటెడ్ లవ్ స్టోరీ. క్లైమాక్స్ షాకింగ్‌గా ఉండడంతో ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందిస్తుంది. డైరెక్టర్, హీరో అయిన ఇక్బాల్ కథ రాసుకున్న విధానం బాగుంది. దానికితోడు కథను నడిపించిన విధానం కూడా బాగుంది. ఎన్నో ముఖ్యమైన అంశాలతో కథను విజయవంతంగా నడిపించిన ఇక్బాల్‌ను అభినందించాలి.ఇక ఈ సినిమాలో లోపాలు , హైలెట్స్ విషయానికి వస్తే రియలిస్టిక్ కథ తో చేసిన ప్రయత్నం బాగుంది కానీ కథనం కాస్త సాగదీత అనిపిస్తుంది. ఫస్టాఫ్ రొటీన్‌గా సాగుతుంది. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్‌లో ఇచ్చిన సందేశం అందరిని ఆలోచింపజేస్తుంది.
ఎవరెలా చేశారంటే..
పక్కింటి అబ్బాయి పాత్రలో ఇక్బాల్ నటన బాగుంది. అతని ముఖ కవళికలు, హావభావాలు చాలా సహజంగా ఉంటాయి. ఇక్బాల్ తన నటనతో సినిమాను ప్రేక్షకుల గుండెల్లో నిలిచేలా చేశాడు. హీరోయిన్ ప్రియా జస్పర్ తెరపై ముద్దుగా ఉంది. తన నటనకు ప్రాధాన్యతనిచ్చే పాత్రను ఆకట్టుకునే విధంగా చేసింది. మరో హీరోయిన్ మోనికా కూడా అంతే బాగుంది. మాజీ ప్రేమికుల పాత్రలో బాగానే నటించింది.
సాంకేతిక విషయాలకొస్తే.. సంగీత దర్శకుడు రాయన్ సినిమా కు పెద్ద ఏసెట్ అనుకోవచ్చు... ఇక సినిమాటోగ్రఫీ పనితనం బాగుంది. సినిమాలో సహజమైన లొకేషన్లను చక్కగా చిత్రీకరించారు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పదునుపెట్టాల్సింది. పరిమిత బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నిర్మాణ విలువలు కొంతవరకు బాగున్నాయి.