
చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయం సాధించింది కోర్ట్ (Court: State vs a Nobody). హర్ష్ రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీకి రామ్ జగదీశ్ దర్శకత్వం వహించాడు. నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. తాజాగా ఈ సినిమాను చూసిన పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) రివ్యూ ఇచ్చాడు.
కోట్లు పెట్టి టెన్షన్ పడేకన్నా..
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. అద్భుతమైన రచయితలు, దర్శకులు చూపించే స్క్రీన్‌ప్లే విధానాన్ని, కథా నైపుణ్యాన్ని రామ్ జగదీష్ ఫాలో అయ్యాడు. ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్‌ను సైతం అభినందించాల్సిందే! దాదాపు ఐదారు కోట్లతో తీసిన ఈ మూవీకి రూ.66 కోట్ల పైనే కలెక్షన్స్ వచ్చాయి. కోట్లకు కోట్లు పెట్టి సినిమాలు తీసి టెన్షన్ పడేకంటే.. ఒక మంచి పాయింట్‌తో సినిమా తీస్తే ఇలా కోర్ట్‌లాగే విజయాలు వస్తాయని నిరూపితమవుతోంది.
ఆయనకు ఇంకొన్ని సీన్లు పడాల్సింది
సినిమాలోకి వెళ్తే.. హీరోకు చాలా భవిష్యత్తు ఉందని మొదలుపెట్టి.. అతడి బతుకును శూన్యం చేసే దిశగా స్క్రీన్‌ప్లే నడిచింది. సినిమాలో రెండురకాల న్యాయవాదులుంటారు. అందులో ఒకరు హీరోకు సపోర్ట్ చేయకుండా అవతలివారికి అమ్ముడుపోయారు. న్యాయవాదుల్లో ఇలాంటివాళ్లు కూడా ఉంటారా? అని చూపించారు. న్యాయం, ధర్మం అమ్ముడుపోతే ఈ సమాజం నిలబడదు. శుభలేఖ సుధాకర్ (Subhalekha Sudhakar) మంచి ఆర్టిస్ట్. ఆయనకు ఇంకొన్ని సీన్లు పడుంటే బాగుండనిపించింది.
పేరెంట్స్ మాట వినరు
సినిమాలో హీరోయిన్ మైనర్ అని మనకు ముందే చెప్పరు. దీనివల్లే కథనం ఆసక్తికరంగా సాగింది. లేదంటే కథ ముందే గెస్ చేసేవాళ్లు. కథ ఊహించేట్లుగా ఉంటే సినిమాలు ఆడవు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు చదువుకోమని చెప్తుంటే పిల్లలు పెడచెవిన పెడ్తున్నారు. వాళ్లందరికీ ఇదొక అద్భుతమైన మెసేజ్. పేరెంట్స్ మనసు తెలుసుకోండి. చదువును మించినదంటూ ఏదీ లేదు. ముందు జ్ఞానం సంపాదించుకోవడమే ముఖ్యం.
క్లైమాక్స్ ఊహించలేకపోయా
ఇక వయసులో ఉన్న పిల్లలు గదిలో 16 నిమిషాలు ఏం చేశారన్న ఉత్కంఠను పెంచారు. అక్కడ ఏం జరిగిందనేది నేను కూడా ఊహించలేకపోయాను. చివర్లో అందర్నీ బయటకు వెళ్లగొట్టి జాబిలి స్టేట్‌మెంట్ తీసుకుంటారు. గదిలో వాళ్లు పెళ్లిని ప్రాక్టీస్ చేసినట్లు చూపించారు. దీంతో అబ్బాయి నిర్దోషి అని తేలుతుంది. కోర్టును తప్పుదోవ పట్టించిన మంగపతి, లాయర్, పోలీసులపై చర్యలు తీసుకుంటారు.
చప్పట్లు కొట్టా
ఇదంతా జరిగాక అబ్బాయి మళ్లీ చదువుకోవడానికి వెళ్లాడు. అప్పుడు ఆ అమ్మాయి నాకు 18 ఏళ్లు నిండాయని అబ్బాయిని హత్తుకోగానే నేను కూడా చప్పట్లు కొట్టాను. ఇప్పుడిద్దరూ మేజర్లు కాబట్టి ఏ కేసులు గట్రా ఉండవు. వాళ్లిద్దరూ చదువుకుని, గొప్పవాళ్లయి పెళ్లి చేసుకున్నారని చూపించుంటే బాగుండేదనిపించింది. ఇదొక్కటే మిస్ అయ్యారేమో అనిపించింది. అయినప్పటికీ ఈ సినిమా చాలా బాగుంది అని పరుచూరి చెప్పుకొచ్చాడు.
చదవండి: ఓటీటీలో రొమాంటిక్ సినిమా.. రూ. 1900 కోట్ల కలెక్షన్స్‌తో రికార్డ్