
కోలీవుడ్ నటుడు విజయ్‌సేతుపతి ఇటీవల నటించిన చిత్రం మహారాజా. ఈయన నటించిన 50వ చిత్రం ఇది. ఆ మధ్య తెరపైకి వచ్చిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. కాగా ప్రస్తుతం విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలలో పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఒకటి విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో జాతీయ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ నిత్యామీనన్ ఆయనకు జోడీగా నటిస్తున్నారు.
(సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ 10th ఎడిషన్: మీ అభిమాన తారలను నామినేట్ చేయండి)
సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటుడు యోగిబాబు, సెంబన్ వినోద్ జోస్, దీపా శంకర్, శరవణన్, రోషిణి హరిప్రియన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కేక్ కట్ చేసిన ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. ఇకపోతే ఇందులో నటుడు విజయ్‌సేతుపతి పరోటా మాస్టర్‌గా నటిస్తున్నట్లు తెలిసింది. అందుకోసం ఆయన కొంత శిక్షణ పొందినట్లు సమాచారం.

కాగా ఇంతకు ముందు నటుడు సూర్య హీరోగా ఎదర్కుమ్ తుణిందవన్ (తెలుగులో ఈటీ ) చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు పాండిరాజా చిన్న గ్యాప్ తరువాత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఇకపోతే నటుడు విజయ్‌సేతుపతి ఈ చిత్రంతో పాటూ ఎస్, గాంధీ టాకీస్, మిష్కిన్ దర్శకత్వంలో ట్రైన్ మొదలగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.