
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)కు మరోసారి బెదిరింపులు ఎదురయ్యాయి. ముంబై రవాణాశాఖ విభాగానికి వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది. దీనిపై అధికారులు అప్రమత్తమయ్యారు. వర్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
ఎందుకీ బెదిరింపులు?
1998లో కృష్ణ జింకలను వేటాడిన కేసులో దోషిగా తేలిన సల్మాన్ ఖాన్‌పై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi gang) ఆగ్రహం వ్యక్తం చేసింది. హీరోను చంపుతామని పలుమార్లు హెచ్చరికలు చేసింది. ఈ క్రమంలోనే 2024లో.. కృష్ణజింకను వేటాడి తప్పు చేసినందుకుగానూ గుడికి వెళ్లొచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. లేదంటే తమకు రూ.5 కోట్లు ఇవ్వాలంది. తర్వాత అదే ఏడాది ఓ గుర్తు తెలియని వ్యక్తి తనకు రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
పన్వేల్‌లో ఉన్న సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్‌లో కొందరు ఫేక్ ఐడీలతో చొరబడేందుకు ప్రయత్నించారు. గత డిసెంబ్‌లోనూ సల్మాన్ సినిమా సెట్‌లోకి ఓ వ్యక్తి ప్రవేశించి.. లారెన్స్ బిష్ణోయ్ పేరు ప్రస్తావిస్తూ బెదిరింపు ధోరణిలో మాట్లాడాడు. గతేడాది సల్మాన్ ఇంటి ముందు పలుమార్లు కాల్పులు జరగడంతో అతడు ఇంటి బాల్కనీకి బుల్లెట్ ప్రూఫ్ అద్దాలను పెట్టించుకున్నాడు.
వరుస బెదిరింపులపై ఇటీవల సల్మాన్ మాట్లాడుతూ.. నేను భగవంతుడిని నమ్ముతాను. దేవుడు నాకు ఆయుష్షు ఎంతవరకు ఇస్తే అంతవరకు మాత్రమే బతుకుతాను. నా జీవితం దేవుడి చేతుల్లోనే ఉంది. పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నప్పటికీ మన చేతిలో ఏమీ ఉండదు అన్నాడు.
చదవండి: స్టైలు మారింది.. గంగవ్వ కొత్త లుక్ చూశారా?