
‘28°C’ సినిమా 2019లోనే పూర్తయింది. 2020లో మేలో విడుల చేయాలనుకున్నాం. కానీ కరోనా కారణంగా అది సాధ్యం కాలేదు. కొన్ని రోజుల్లో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని అనుకుంటే, అది నెలల తరబడి సాగింది. దీంతో మా సినిమా విడుదల ఆలస్యమై ఇప్పుడు (ఏప్రిల్ 4) రిలీజ్ అవుతుంది. ఈ మూవీ చేసే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. మూవీ వైజాగ్ లో ప్రారంభించినప్పుడే నా కాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఆ తర్వాత జార్జియాలో షూటింగ్ కు వెళ్లినప్పుడు అక్కడి అధికారులు అనుమతి ఇవ్వక ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం. ఎన్ని సమస్యలు వచ్చినా కంటెంట్ మీద నమ్మకంతో ఇప్పటిదాకా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ప్రేక్షకులు థియేటర్స్ లో మా సినిమాకు మంచి రెస్పాన్స్ ఇస్తారనే ఆశిస్తున్నాం’ అన్నారు యువ నిర్మాత సాయి అభిషేక్. ఆయన నిర్మించిన తొలి సినిమా 28°C( 28 డిగ్రీల సెల్సియస్). నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. పొలిమేర" ఫేమ్ డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్ తన మొదటి సినిమాగా "28°C" రూపొందించారు. ఈ సినిమా ఈ నెల 4వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత సాయి అభిషేక్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
నేను, డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్ సన్నిహిత స్నేహితులం. మాకిద్దరికీ సినిమాలంటే అమితమైన ఇష్టం ఉండేది. అనిల్ "క్షణం" సినిమా కోసం డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చేరాడు. నేను కూడా దర్శకత్వం వైపు కొన్ని ప్రయత్నాలు చేశాను. కొన్ని రోజుల తర్వాత, మేమిద్దరం కలిసి ఒక సినిమా తీద్దామని నిర్ణయించుకున్నాం. అనిల్ విశ్వనాథ్ "28°C" అనే టెంపరేచర్ ఆధారంగా చెప్పిన కథ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కథ ప్రేక్షకులకు కూడా ఒక కొత్త అనుభవాన్ని అందిస్తుందనే నమ్మకంతో సినిమాను ప్రారంభించాం.
మొదట్లో ఈ సినిమా కోసం వేరే హీరోలను అనుకున్నప్పటికీ, చివరికి నవీన్ చంద్ర ఈ పాత్రకు సరిగ్గా సరిపోతాడని భావించాం. హీరోయిన్‌గా మొదట అంజలిని ఎంచుకున్నాం, కానీ కొంత ఆధునికత కోసం కొత్త ముఖం ఉంటే బాగుంటుందని షాలినీని ఎంపిక చేశాం. షూటింగ్‌ను వైజాగ్‌లో మొదలుపెట్టాం, ఆ తర్వాత గోవా, జార్జియాలకు వెళ్లాం. నిర్మాణంలో ఎక్కడా రాజీపడకుండా అత్యున్నత నాణ్యతతో సినిమాను రూపొందించాం. సినిమా కథాంశంపై మా బృందం అందరికీ గట్టి విశ్వాసం ఉండేది.
హీరో నవీన్ చంద్ర మాకు చాలా సహకరించాడు. సినిమాపై మాతో పాటు అతనికి కూడా గట్టి నమ్మకం ఉంది. షూటింగ్ సమయంలోనే కాకుండా, ఇప్పుడు ప్రచార కార్యక్రమాల్లో కూడా మద్దతుగా నిలుస్తున్నాడు. అతని పాత్ర ప్రేక్షకులను ఆకర్షిస్తుందని భావిస్తున్నాం. అలాగే, హీరోయిన్ షాలినీ కూడా అద్భుతంగా నటించింది. "28°C" టెంపరేచర్ వద్ద హీరోయిన్ ఆరోగ్య పరిస్థితి ఒక విధంగా ఉంటుంది, ఆ ఉష్ణోగ్రత దాటితే ఆమె ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. ఈ జంట ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొందనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా ఒకే జానర్‌లో సాగదు, విభిన్న జానర్‌లను కలుపుతూ ఒక తీవ్రమైన ప్రేమకథగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దర్శకుడు అనిల్ విశ్వనాథ్ సినిమాను మొదటి నుంచి చివరి వరకు ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దాడు.
సినిమా తీసే సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. వైజాగ్‌లో షూటింగ్ ప్రారంభించినప్పుడే నా కాలు విరిగింది. ఆ తర్వాత జార్జియాలో షూటింగ్ కోసం వెళ్లినప్పుడు అక్కడి అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో సమస్యలు ఎదుర్కొన్నాం. మేము షూటింగ్ కోసం భారీగా ఖర్చు చేశామని స్థానిక మీడియా ద్వారా తెలుసుకున్న జార్జియా అధికారులు చివరికి చిత్రీకరణకు అనుమతి ఇచ్చారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, కథాంశంపై నమ్మకంతో ఇప్పటివరకు ధీమాగా ఉన్నాం. ప్రేక్షకులు థియేటర్లలో మా సినిమాకు సానుకూల స్పందన ఇస్తారని ఆశిస్తున్నాం.
ప్రస్తుతం కొన్ని కథలు విన్నా, అయితే ఏదీ ఇంకా ఫైనలైజ్ చేయలేదు. "28°C" సినిమా రిలీజ్ తర్వాత మా సంస్థ నుంచి కొత్త మూవీని అనౌన్స్ చేస్తాం.