
భూ భారతితో శాశ్వత పరిష్కారం
మన్ననూర్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భారతి చట్టంను రైతులు సద్వినియోగం చేసుకొని శాశ్వత పరిష్కారం పొందాలని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. సోమవారం పదర, అమ్రాబాద్ మండల కేంద్రాల్లోని అధికారులు, రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో అమలులో ఉన్న ధరణిలో జరిగిన లోపాలను సవరిస్తూ భూ భారతి ద్వారా సరిచేసుకునే వెసులుబాటు ప్రభుత్వం రైతులకు కల్పించిందన్నారు. సాదాబైనామాలు, వారసత్వ, అసైన్డ్, వక్ఫ్, పోరంబోకు భూములలో ఉన్న లోపాలు సరిచేసుకోవచ్చని చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్కారం కాని సమస్యలు తహసీల్దార్, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్, కలెక్టర్ వరకు, ఆ తర్వాత సీసీఎల్ ద్వారా కూడా నిర్భయంగా వెళ్లి దరఖాస్తు చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవచ్చని వివరించారు. ఇకపై బ్యాంకు రుణాల కోసం వెళ్లినప్పుడు భూమికి సంబంధించిన ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని, భూ భారతి పోర్టల్‌లో పొందుపరిచిన రికార్డుల ఆధారంగానే బ్యాంకు రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆర్డీఓ మాధవి మాట్లాడుతూ ప్రత్యేకించి ఏజెన్సీ పరిధిలో ప్రభుత్వ భూములు ఎవరైనా అమ్మితే కొనకూడదని, ఇప్పటి వరకు సాగులో ఉన్న భూములు కాకుండా కొత్తగా భూములు సాగు చేయకూడదని సూచించారు. రైతులు తమ పొలాలపై హక్కులు కలిగి ఉండటంతోపాటు బ్యాంకులో పంట రుణాలు, 1978కి ముందు కొనుగోలు చేసుకున్న భూములకు మాత్రమే పట్టాలు అవుతాయనేది గమనించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్‌బాబు, ఎంపీడీఓలు శైలేంద్రకుమార్, వెంకటయ్య, ఏఓ సురేష్, నాయకులు హరినారాయణగౌడ్, రహీం, సంబు శోభ, ప్రణీత, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.