
శ్రీశైల క్షేత్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
గోస్పాడు: శ్రీశైల దివ్య క్షేత్రంతో పాటు చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలను ఆధ్యాత్మికంగా, పర్యాటకపరంగా, అహ్లాదకరంగా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని, ఇందుకు అవసరమయ్యే డాక్యుమెంట్లు ఇవ్వాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో శ్రీశైలం క్షేత్ర అభివృద్ధిపై శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. శ్రీశైలానికి వచ్చే భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనానంతరం మూడు రోజులపాటు అక్కడే ఉండి పరిసర ప్రాంతాలను దర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. భక్తుల సౌకర్యార్థం తొమ్మిది రకాల సదుపాయాలతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే సున్నిపెంట ప్రాంతంలో గుర్తించిన 178 ఎకరాల రెవెన్యూ భూముల్లో 50 ఎకరాలు పర్యాటక శాఖకు కేటాయించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. గతంలో ఇరిగేషన్‌కు సంబంధించిన 1,468.52 ఎకరాల ఇరిగేషన్ భూముల్లో 719 ఎకరాలు వివిధ శాఖలకు కేటాయించామన్నారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్‌ఓ రాము నాయక్, డీఎఫ్‌ఓ సాయిబాబా, శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు, ఆత్మకూరు ఆర్డీఓ అరుణజ్యోతి, ఇరిగేషన్ ఎస్‌ఈ శివప్రసాద్ రెడ్డి, జిల్లా పర్యాటక అధికారి సత్యనారాయణమూర్తి, ఏపీటీడీసీ డీవీఎం లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ రాజకుమారి