
ఆహార పదార్థాల భద్రతపై అవగాహన
నంద్యాల(వ్యవసాయం): వ్యాపారులకు శనివారం ఆహార పదార్థాల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. నంద్యాలలోని రిటైల్ మర్చెంట్ వ్యాపారుల కార్యాలయంలో పో స్ట్రాక్ ట్రైనర్ రాజ్‌కుమార్, జిల్లా ఫుడ్‌సేఫ్టీ అధికారులు వెంకట రమణ, కాశీం వలి మాట్లాడారు. ఆహార పదార్థాల్లో కల్తీని అరికట్టాలని, వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలన్నారు. వ్యాపారులు ఫుడ్ లైసెన్స్‌తో పాటు పోస్ట్రాక్ శిక్షణ సర్టిఫికెట్ తప్పని సరిగా కలిగి ఉండాలన్నారు. ఏపీ ఫుడ్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ది రిటైల్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్డగాళ్ల మల్లికార్జున, కేవీజీవీఎం సభ్యులు సింధు, మోహన్‌బాబు, సాయిరాం, రాములు, ఖాజాహుసేన్, మాధవి, చిరు, కిరాణ వ్యాపారులు పాల్గొన్నారు.
రేపు బీచ్ కబడ్డీ జట్ల
ఎంపిక పోటీలు
నంద్యాల(న్యూటౌన్): ఉమ్మడి కర్నూలు జిల్లా సీనియర్ బీచ్ కబడ్డీ పురుషుల, మహిళల జట్ల ఎంపిక పోటీలు ఈనెల 28వ తేదీన నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ ఏపీరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నంద్యాలలోని నందమూరినగర్ నాగులకట్ట వద్ద పోటీలు ఉంటాయని ఆయన తెలిపారు. పురుషులు 85 కేజీల్లోపు, మహిళలు 75 కేజీల్లోపు ఉండాలని, పోటీలకు వచ్చే సమయంలో ఆధార్‌కార్డు, పదో తరగతి మార్కులిస్టు తీసుకుని రావాలన్నారు. జట్లకు ఎంపికై న వారు మే 2 నుంచి 4వ తేదీ వరకు కాకినాడ బీచ్‌లో జరిగే రాష్ట్రస్థాయి బీచ్ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
మంచి సినిమాలకు
ఎప్పుడూ ఆదరణ
మహానంది: మంచి సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ ఆదరణ ఉంటుందని ప్రముఖ సినీ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అన్నారు. శనివారం రాత్రి ఆయన మహానందికి వచ్చారు. శ్రీ కామేశ్వరీదేవి, శ్రీ మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు. దర్శనం అనంతరం వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, పండితులు, అర్చకులు ఆయనకు స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించి వేదాశీర్వచనం చేశారు. కొత్త బంగారులోకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, నారప్ప, బ్రహ్మోత్సవం వంటి సినిమాలకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు.
శివపురంలో అతిసారం!
● ఎనిమిది మందికి అస్వస్థత
కొత్తపల్లి: మండలంలోని శివపురం గ్రామ ఎస్సీ కాలనీలో అతిసార వ్యాధి ప్రబలినట్లు తెలిసింది. ప్రజలు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. శనివారం పేరుమాళ్ల సామేలు, సుబ్బన్న, మాణిక్యమ్మ, స్రవంతి, మేరిమాత, అనుసూయమ్మ, 15 ఏళ్ల విక్రాంత్ అనే బాలుడు, 7 ఏళ్ల బాలిక మహిమ భాగ్యమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొంతమంది గోకవరం ప్రభుత్వం అసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. విషయం తెలుసుకున్న వైద్యులు శివపురం గ్రామం వెళ్లి పరిశీలించారు. ఎంపీడీఓ మేరి, గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్.. బాధితుల ఇంటి వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పేరుమాళ్ల సామేలును ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
ఉపాధ్యాయులకు
ముగిసిన వైద్యపరీక్షలు
కర్నూలు(హాస్పిటల్): బదిలీల నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న వైద్యపరీక్షలు శనివారం ముగిశాయి. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మెడికల్ బోర్డు ఆధ్వర్యంలో మొదటి రోజు 70 మందికి, రెండోరోజు 102 మందికి, చివరి రోజు 264 మందికి వైద్యపరీక్షలు చేశారు. ఇందులో ఆర్థోపెడిక్, న్యూరోసర్జరీ, న్యూరాలజీ, మానసిక వైకల్యం, కార్డియాలజీ తదితర వ్యాధులున్న ఉపాధ్యాయులు, వారి కుటుంబసభ్యులు వైద్య పరీక్షలు చేయించుకుని నివేదికలు అందుకున్నారు.

ఆహార పదార్థాల భద్రతపై అవగాహన