
కుటుంబం వీధిన పడింది
పది నెలల్లో 67 మంది రైతుల బలవన్మరణం ●
● కలసిరాని వ్యవసాయంతో
అప్పులపాలు
● అన్నదాత సుఖీభవకు నీళ్లొదిలిన
కూటమి ప్రభుత్వం
● ఆత్మహత్యల సంఖ్య తగ్గించి చూపే
ప్రయత్నాల్లో త్రీమెన్ కమిటీ
● ఉచిత పంటల బీమాకు చెల్లుచీటి
● 2023 ఖరీఫ్, 2023–24 రబీ, 2024 ఖరీఫ్ పంటల బీమా అందనట్లే..
అప్పుల ఊబిలో బలవన్మరణం
తుగ్గలి మండలం రాంపల్లి గ్రామానికి చెందిన వెంకట్రాములుకు వ్యవసాయమే జీవనాధారం. 2024–25లో గతంలో ఎప్పుడూ లేని విధంగా వ్యవసాయంలో దెబ్బతిన్నాడు. 5 ఎకరాల స్వంతభూమి ఉండగా.. మరో ఐదారు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. సహకార సంఘంలో రూ.10 లక్షలకు పైగా అప్పు చేశాడు. ప్రయివేటు అప్పులు ఐదారు లక్షలు ఉన్నాయి. అధిక వర్షాలు, వర్షాభావంతో పాటు అరకొర పంటలకు గిట్టుబాటు ధర లేక నష్టాలను మూటకట్టుకున్నాడు. అప్పులు తీర్చాలనే ఒత్తిళ్లు అధికమవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య లక్ష్మి అనాథగా మారింది.
వెల్దుర్తి మండలం రామళ్లకోటకు చెందిన కలుగొట్ల బోయ హనుమంతు కౌలుదారు. ఈయన 6.65 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని సాగు చేశాడు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వ్యవసాయం కోసం రూ.6 లక్షలు అప్పు చేశాడు. ప్రభుత్వం నుంచి ఎలాంటి తోడ్పాటు లభించక, వ్యవసాయం కలిసిరాక అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. విధిలేని పరిస్థితుల్లో గత ఏడాది పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈయనకు భార్య బోయ రామేశ్వరి. శివ(12), లత(10) సంతానం. ఇంటికి ఆధారమైన వ్యక్తి మరణించంతో వీళ్లంతా దిక్కులేని వాళ్లయ్యారు. త్రీమెన్ కమిటీ కౌలుదారు ఆత్మహత్యగా నిర్ధారించిందే కానీ, ప్రభుత్వం ఇప్పటికీ ఆదుకోని పరిస్థితి.
కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడం.. వ్యవసాయం కలసి రాకపోవడం.. ప్రకృతి కరుణించకపోవడం.. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడం.. వెరసి రైతుల జీవనం దుర్భరం అవుతోంది. వ్యవసాయం కోసం బ్యాంకులు, పీఏసీఎస్‌ల్లో తీసుకున్న అప్పులు, ప్రయివేటు వ్యక్తుల దగ్గర అధిక వడ్డీలతో పొందిన రుణాలు బక్కచిక్కిన రైతులను బలవన్మరణాలకు ఉసిగొల్పుతున్నాయి. 2014–15 నుంచి 2018–19 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 321 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. తిరిగి మళ్లీ ఆయన ప్రభుత్వంలోనే రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. నాడు వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ఇప్పటికి ఆ మాటలకే కట్టుబడి ఉన్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు, కరువు కవలలనే పేరుంది. 2014–15 నుంచి 2018–19 వరకు ఐదేళ్లు పాలిస్తే వరుసగా నాలుగేళ్లు కరువొచ్చింది. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ప్రతి ఏటా వర్షాభావం ఏర్పడుతుండటంతో ఉమ్మడి కర్నూలు జిల్లా ఎడారిగా మారింది. వర్షాలు లేక, అంతంతమాత్రం పండిన పంటలకు గిట్టుబాటు ధర లేక పెట్టిన పెట్టుబడిలో 10 శాతం కూడా దక్కక రైతులు చితికిపోయారు. నాటి దారుణ పరిస్థితులే మళ్లీ పునరావృతం అవుతున్నాయి. రైతులు బలవన్మరణాలకు పాల్పడుతుంటే.. బ్యాంకులు రుణాలు రికవరీకి ఆస్తులను జప్తులు చేస్తుండటం గమనార్హం.
అన్నదాత సుఖీభవ అమలులో నిర్లక్ష్యం
2024 ఎన్నికల సమయంలో సూపర్–6లో భాగంగా రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20 వేలు చెల్లించి ఆదుకుంటామని ఊరూవాడ చంద్రబాబు ప్రకటించారు. ఆయన మాటలు నమ్మి రైతులు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. రైతుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ మొదటి ఏడాది అన్నదాత సుఖీభవకు నీళ్లొదిలారు. ఈ నేపథ్యంలో పంట పెట్టుబడులకు రైతులు అప్పులు చేయాల్సి వస్తోంది. ఈ అప్పులు తీర్చలేక పురుగుల మందు తాగడం, ఉరేసుకోవడం ద్వారా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2025–26 సంవత్సరానికి అన్నదాత సుఖీభవ అమలు చేస్తామని ప్రకటించారు. అయితే పీఎం కిసాన్‌తో కలిపి రూ.20వేలు ఇస్తామని నాలుక మడతేశారు.
రైతు సంక్షేమాన్ని పట్టించుకుంటే ఒట్టు
2023 ఖరీఫ్ కరువు మండలాలకు సంబంధించి గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం 2024 జనవరిలోనే ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేసింది. 41,857 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో తప్పులు ఉన్నందున రూ.60.59 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల కాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖాతాలను సరి చేసి పంపారు. ఇంతవరకు ఈ రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేయని పరిస్థితి. 2023–24 రబీలో ఉమ్మడి జిల్లాలో 31 కరువు మండలాలను గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం గుర్తించింది. కరువు ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో 92,208 రైతులు నష్టాలను మూటకట్టుకున్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ కోసం కర్నూలు జిల్లాకు రూ.58.28 కోట్లు, నంద్యాల జిల్లాకు రూ.37.76 కోట్లు విడుదల కావాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతనే కేంద్ర బృందం జిల్లాలో పర్యటించింది. అయితే ఇప్పటికీ ఇన్‌పుట్ సబ్సిడీ అతీగతీ లేకుండాపోయింది.
బీమా మర్చిపోవాల్సిందే..
● గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లూ ఉచిత పంటల బీమాను అమలు చేసింది.
● 2024, 2024–25 రబీ సీజన్‌కు సంబంధించి రైతుల వాటా ప్రీమియం చెల్లించాల్సిన సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో బ్రేక్ పడింది.
● కూటమి ప్రభుత్వం రైతుల వాటా సొమ్మును చెల్లిస్తే రైతులకు బీమా పరిహారం అందుతుంది.
● 2024 ఖరీఫ్ సీజన్‌లో కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీమాను అమలు చేస్తామని చెప్పినా, రైతుల వాటా విడుదల చేయని పరిస్థితి.
● దీంతో మూడు సీజన్‌లకు సంబంధించి రైతులు పంటల బీమా పరిహారానికి దూరమయ్యారు.
● కేవలం 2024–25 రబీ పంటల బీమాను మా త్రమే ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోంది.
● అది కూడా ఉచిత పంటల బీమాను పక్కనపెట్టి రైతులే ప్రీమియం చెల్లించే విధానాన్ని తీసుకురావడం గమనార్హం.
10.3.25
27.9.24
18.7.24
డోన్ మండలం గోసానిపల్లి గ్రామానికి చెందిన వై.రామాంజనేయులు(35) కౌలు రైతు. 3.95 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని గత ఏడాది ఉల్లి సాగు చేశాడు. పెట్టుబడుల కోసం రూ.9 లక్షలు అప్పు తీసుకున్నాడు. అయితే అధిక వర్షాలు, అనావృష్టి కారణంగా పంట దెబ్బతినింది. గత ఏడాది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈయనకు భార్య అనిత, కూతురు మైతిలి(8), కుమారులు రామ్‌కుషల్(6), రామ్ చరణ్(4) ఉన్నారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మరణించడంతో భార్యా పిల్లలు దీనావస్థలో ఉన్నారు.
ఉమ్మడి జిల్లాలో
67
మంది రైతులు
ఆత్మహత్య
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన మొదటి ఏడాదిలోనే మరణమృదంగం మోగింది. ప్రభుత్వం నుంచి చేయూత లేకపోవడం, వ్యవసాయం కలసిరాక అప్పులు మీద పడటంతో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో రికార్డు స్థాయిలో 67 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం గమనార్హం. కర్నూలు జిల్లాలో 42 మంది, నంద్యాల జిల్లాలో 25 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్యను తగ్గించి చూపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్రీమెన్ కమిటీ విచారణలో అనర్హులుగా తేల్చేందుకు రంగం సిద్ధమవుతోంది. మండల వ్యవసాయ అధికారి, తహసీల్దారు రైతుల ఆత్మహత్యలేనని నిర్ధారించినప్పటికీ త్రీమెన్ కమిటీ విచారణలో రైతులు కాదని, ఇతర కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్యాయం చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది.

కుటుంబం వీధిన పడింది

కుటుంబం వీధిన పడింది