
గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
నంద్యాల(అర్బన్): గ్రామాలను యూనిట్‌గా తీసుకొని అధికారులు జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. నంద్యాల సెంట్రల్ వేర్‌హౌస్ గోడౌన్‌లో ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రం వద్ద శనివారం ఆందోళన నిర్వహించారు. అన్నదాతలకు ఏపీ రైతు సంఘం నాయకులు మద్దతు పలికారు. క్వింటా రూ.3,371 మద్దతు ధరతో జొన్న దిగుబడులను కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందు కోసం నంద్యాల సెంట్రల్ వేర్‌హౌస్ గోడౌన్‌లో జొన్న కొనుగోళ్లను ప్రారంభించారు. అయితే హమాలీలు, గోడౌన్లు, గన్నీ బ్యాగ్‌ల కొరతతో రైతులు తెచ్చిన జొన్నను సకాలంలో కొనుగోలు చేయలేక పోయారు. నాలుగు రోజులుగా రైతులు రైల్వే స్టేషన్ నుంచి చామకాల్వ వరకు ట్రాక్టర్లు, లారీల్లో తీసుకొచ్చిన దిగుబడులతో రోడ్లపై నిలుపుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో శనివారం రైతులు ఆందోళనకు దిగారు. సివిల్ సప్లయ్ డీఎం రాజునాయక్ అక్కడి వచ్చి రైతులతో మాట్లాడారు. దిగుబడులన్నింటిని కొనుగోలు చేస్తామని, కొంత సమయం కావాలని కోరారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, సహాయ కార్యదర్శి రామచంద్రుడు , రైతులు హుసేన్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, శేషాద్రిరెడ్డి, మల్లయ్య, బాలవెంకటరెడ్డి, అబ్దుల్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
జొన్న రైతుల ఆందోళన