
వారణాసి: ఉత్తరప్రదేశ్‌లో వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కింద పురాతన హిందూ ఆలయ అవశేషాలున్నాయంటూ కోర్టుకు భారత పురావస్తు శాఖ(ఏఎస్‌ఐ) సమర్పించిన సర్వే నివేదికలో మరి కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. శివలింగం భాగాలు, హిందూ దేవతల ధ్వంసమైన విగ్రహాలు మసీదులో ఉన్నాయి. వాటి ఫొటోలు తాజాగా జాతీయ మీడియాకు లభించాయి.
హనుమాన్, గణేష, నంది విగ్రహాల ఫొటోలు, కొన్ని పానవట్టాలు, కిందిభాగం లేని శివలింగం వాటిలో ఉన్నాయి. శతాబ్దాల నాటి నాణేలు, పర్షియన్ లిపి సున్నపురాయి శాసనం, రోలు ఉన్నాయి. మసీదు కింద భారీ ఆలయముండేదని నివేదిక నిరూపిస్తోందని హిందువుల తరఫు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ చెప్పారు. ఆలయ రాతిస్తంభాలనే కాస్త మార్చి మసీదు నిర్మాణంలో వాడారని నివేదికలో ఉందన్నారు.
‘‘17వ శతాబ్దంలో ఔరంగజేబు ఇక్కడి ఆదివిశ్వేశ్వర ఆలయాన్ని కూల్చేసినట్లు నివేదికలోని ఆధారాలు బలంగా చాటుతున్నాయి. దీన్ని బట్టి ఇక్కడ ఒక ఆలయం ఉండేదని స్పష్టమవుతోంది’’ అని ఆయన చెప్పారు. దీనితో అంజుమన్ అంజామియా మసీదు కమిటీ ప్రతినిధి అఖ్‌లాఖ్ అహ్మద్ విభేదించారు. ‘‘ఇందులో కొత్తేమీ లేదు. గతంలోనూ అవి ఉన్నాయని ఏఎస్‌ఐ తెలిపింది. తాజా నివేదికలో వాటి కొలతలను స్పష్టంగా పేర్కొంది. అవి పురాతనమైనవని చెప్పే ఆధారాలను ఏఎస్‌ఐ ప్రస్తావించలేదు.
ఆ రాళ్ల వయసు ఎంత అనే అంశాలపై ఏఎస్‌ఐ ఇంకా ఎలాంటి నిర్ధారణకు రాలేదు. సర్వేలో ఉన్నవన్నీ ఏఎస్‌ఐ అభిప్రాయాలు మాత్రమే. అవి నిపుణుల అభిప్రాయాలు కాదు’’ అని ఆయన వాదించారు. గత ఏడాది జిల్లా కోర్టు ఆదేశాల మేరకు ఏఎస్‌ఐ మసీదు కాంప్లెక్స్‌లో శాస్త్రీయసర్వే చేపట్టి గత ఏడాది డిసెంబర్ 18వ తేదీన సీల్డ్ కవర్‌లో సర్వే నివేదికను సమర్పించింది. తాజాగా కోర్టు వాటిని కేసులో భాగమైన ఇరుపక్షాల ప్రతినిధులు, న్యాయవాదులకు అందజేశారు. దీంతో నివేదికలోని అంశాలు బహిర్గతమయ్యాయి.