సాక్షి, న్యూఢిల్లీ: జ్ఞాన్‌వాపి మసీదు వీడియోగ్రాఫి సర్వే అభ్యంతర పిటిషన్‌పై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ వాడివేడీగా సాగింది. ఈ తరుణంలో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో అనే సస్పెన్స్ వీడింది. జిల్లా కోర్టులోనే విచారణకు మొగ్గు చూపిన సుప్రీం త్రిసభ్య ధర్మాసనం.. ఇదొక సంక్లిష్టమైన, సున్నితమైన అంశమని పేర్కొంది.
జిల్లా కోర్టు నిర్ణయం, విచారణపై స్టే విధించాలంటూ పిటిషనర్(అంజుమాన్ ఇంతెజమీయా మసీద్ కమిటీ) తరపు న్యాయవాది బెంచ్‌ను కోరారు. అయితే ఈ కేసు పరిణామాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని, జోక్యం చేసుకోబోమని బెంచ్.. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ శివలింగాన్ని సంరక్షించడంతో పాటు నమాజ్ కొనసాగించుకోవచ్చన్న మధ్యంతర ఆదేశాలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. అంతేకాదు.. ట్రయల్ జడ్జి కంటే అనుభవం ఉన్న జిల్లా జడ్జి సమక్షంలోనే వాదనలు జరగడం మంచిదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు పిటిషన్‌ను వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది.
మరోవైపు అడ్వొకేట్ కమిషన్ రూపొందించిన రిపోర్ట్.. బయటకు పొక్కడంపై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ప్రత్యేకించి కొన్ని లీకులు మీడియాకు చేరుతున్నాయి. అది కోర్టుకు సమర్పించే అంశం. కోర్టులో జడ్జే కదా దానిని తెరవాల్సింది అని జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. కమ్యూనిటీల మధ్య సౌభ్రాతృత్వం కోసం, శాంతి అవసరం నెలకొల్పాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. దీంతో.. మే 23న వారణాసి కోర్టు మసీద్ సర్వే పిటిషన్‌పై వాదనలు వినేందుకు మార్గం సుగమమైంది.
ఇదిలా ఉంటే.. జ్ఞానవాపి మసీద్ సర్వేపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంజుమాన్ ఇంతెజమీయా మసీద్ కమిటీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అదే సమయంలో.. జ్ఞానవాపి– శ్రింగార్ గౌరీ కాంప్లెక్సులో వారణాసి కోర్టు నియమించిన అడ్వొకేట్ కమిషన్ సర్వే పూర్తి చేసి నివేదికను సీల్డ్ కవర్‌లో.. కోర్టుకే సమర్పించింది. అయితే ఈ వ్యవహారంలో తమ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఎలాంటి విచారణ చేపట్టొద్దని వారణాసి కోర్టును గురువారం ఆదేశించింది సుప్రీం కోర్టు.
దీంతో కమిటీ సమర్పించిన సీల్డ్ కవర్ తీసుకోవడం వరకు మాత్రమే పరిమితం అయ్యింది వారణాసి కోర్టు. ఆపై మే 23వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ తరుణంలో ఇప్పుడు సుప్రీం కోర్టు బెంచ్ ఆదేశాలు వారాణాసి కోర్టు ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కమిటీ రూపొందించిన రిపోర్ట్‌లోని వివరాలు బయటకు పొక్కడం కలకలం రేపుతోంది.
చదవండి: మసీదులన్నీ అంతకుముందు ఆలయాలే!
Comments
Please login to add a commentAdd a comment