shivling
-
శ్రీశైలంలో బయటపడ్డ పురాతన శివలింగం
-
ఈ నెల 29 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో కలిగిన హిందువుల పుణ్యక్షేత్రం అమర్నాథ్ యాత్ర ఈ నెల 29 నుంచి మొదలు కానుంది.. యాత్రకు ముందురోజు అంటే శుక్రవారం మొదటి బ్యాచ్ బేస్ క్యాంప్ భగవతినగర్ జమ్మూ నుంచి బల్తాల్, పహల్గామ్ బయలుదేరి వెళ్లనున్నాయి. ఈ క్రమంలో బుధవారం జమ్మూలోని సరస్వతి ధామ్‌లో ఇన్స్టంట్ రిజిస్ట్రేషన్ కోసం టోకెన్ల జారీ ప్రారంభమైంది.తొలిరోజు బల్తాల్, పహల్గాం నుంచి వెళ్లేందుకు సుమారు 1000 టోకెన్లు జారీ చేశారు. యాత్రికులు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు భారీగా తరలివచారు. సరస్వతి ధామ్‌కు తెల్లవారుజామున 4 గంటల నుంచి యాత్రికులు చేరుకొని.. క్యూలైన్లలో బారులు తీరారు. భద్రతలో ఎలాంటి లోపం లేకుండా చూసేందుకు భద్రతా బలగాలు మార్క్ డ్రిల్ నిర్వహించి, ఏర్పాట్లను పరిశీలించాయి.అమర్నాథ్ యాత్రకు వెళ్లే వారంతా సాయంత్రం 7గంటల్లోగా భగవతినగర్‌లోని బేస్ క్యాంప్‌లోకి ప్రవేశించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. యాత్ర కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారంతా ఇప్పటికే జమ్మూకు తరలివస్తున్నారు. యాత్రికుల కోసం తక్షణ రిజిస్ట్రేషన్ గురువారం ఉదయం వైష్ణవి ధామ్, పంచాయతీ భవన్, రైల్వే స్టేషన్ సమీపంలోని మహాజన్ హాల్.. అలాగే, పురాణి మండిలోని శ్రీరామ దేవాలయం, గీతా భవన్ (సాధుల కోసం) వద్ద మొదలు కానుంది.కాగా జమ్మూకశ్మీర్ ఉగ్రదాడులు పెరిగిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రయాణికుల వాహనంపై ఉగ్రదాడి జరిగింది. ఈ క్రమంలో భద్రతా బలగాలను భారీగా మోమరించారు. డ్రోన్లు, 365 డిగ్రీస్ యాంగిల్ సీసీ కెమెరాల సాయంతో వాహనాల రాకపోకలను పర్యవేక్షిస్తున్నారు. జమ్మూ-శ్రీనగర్ హైవేపై ప్రతి 500 మీటర్లు, కిలోమీటరుకు సెక్యూరిటీ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ 24 గంటలూ సాయుధ సైనికులను మోహరించి తనిఖీలు చేయనున్నారు. -
Archaeological Survey Of India: జ్ఞానవాపి మసీదులో దేవతా విగ్రహాలు
వారణాసి: ఉత్తరప్రదేశ్‌లో వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కింద పురాతన హిందూ ఆలయ అవశేషాలున్నాయంటూ కోర్టుకు భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) సమర్పించిన సర్వే నివేదికలో మరి కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. శివలింగం భాగాలు, హిందూ దేవతల ధ్వంసమైన విగ్రహాలు మసీదులో ఉన్నాయి. వాటి ఫొటోలు తాజాగా జాతీయ మీడియాకు లభించాయి. హనుమాన్, గణేష, నంది విగ్రహాల ఫొటోలు, కొన్ని పానవట్టాలు, కిందిభాగం లేని శివలింగం వాటిలో ఉన్నాయి. శతాబ్దాల నాటి నాణేలు, పర్షియన్ లిపి సున్నపురాయి శాసనం, రోలు ఉన్నాయి. మసీదు కింద భారీ ఆలయముండేదని నివేదిక నిరూపిస్తోందని హిందువుల తరఫు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ చెప్పారు. ఆలయ రాతిస్తంభాలనే కాస్త మార్చి మసీదు నిర్మాణంలో వాడారని నివేదికలో ఉందన్నారు. ‘‘17వ శతాబ్దంలో ఔరంగజేబు ఇక్కడి ఆదివిశ్వేశ్వర ఆలయాన్ని కూల్చేసినట్లు నివేదికలోని ఆధారాలు బలంగా చాటుతున్నాయి. దీన్ని బట్టి ఇక్కడ ఒక ఆలయం ఉండేదని స్పష్టమవుతోంది’’ అని ఆయన చెప్పారు. దీనితో అంజుమన్ అంజామియా మసీదు కమిటీ ప్రతినిధి అఖ్లాఖ్ అహ్మద్ విభేదించారు. ‘‘ఇందులో కొత్తేమీ లేదు. గతంలోనూ అవి ఉన్నాయని ఏఎస్ఐ తెలిపింది. తాజా నివేదికలో వాటి కొలతలను స్పష్టంగా పేర్కొంది. అవి పురాతనమైనవని చెప్పే ఆధారాలను ఏఎస్ఐ ప్రస్తావించలేదు. ఆ రాళ్ల వయసు ఎంత అనే అంశాలపై ఏఎస్ఐ ఇంకా ఎలాంటి నిర్ధారణకు రాలేదు. సర్వేలో ఉన్నవన్నీ ఏఎస్ఐ అభిప్రాయాలు మాత్రమే. అవి నిపుణుల అభిప్రాయాలు కాదు’’ అని ఆయన వాదించారు. గత ఏడాది జిల్లా కోర్టు ఆదేశాల మేరకు ఏఎస్ఐ మసీదు కాంప్లెక్స్‌లో శాస్త్రీయసర్వే చేపట్టి గత ఏడాది డిసెంబర్ 18వ తేదీన సీల్డ్ కవర్లో సర్వే నివేదికను సమర్పించింది. తాజాగా కోర్టు వాటిని కేసులో భాగమైన ఇరుపక్షాల ప్రతినిధులు, న్యాయవాదులకు అందజేశారు. దీంతో నివేదికలోని అంశాలు బహిర్గతమయ్యాయి. -
శివునికి జలాభిషేకం చేసిన జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ
-
Gyanvapi: వాయిదాతో కొనసాగనున్న ఉత్కంఠ!
వారణాసి: ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఉత్తర ప్రదేశ్ వారణాసి జ్ఞానవాపి కేసులో ఇవాళ(నవంబర్ 8, మంగళవారం) కీలక తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే ఈ పిటిషన్లపై తదుపురి విచారణను నవంబర్ 14 తేదీకి వాయిదా వేసింది వారణాసి కోర్టు. మసీదు ప్రాంగణంలో ఉన్న శివలింగాన్ని పూజించేలా అనుమతి ఇవ్వాలని, హిందువులకు ఆ ప్రాంగణం అప్పగించాలని, అలాగే ముస్లింల ప్రవేశాన్ని నిషేధించేలా ఆదేశాలు ఇవ్వాలని.. మొత్తం మూడు డిమాండ్లతో కూడిన హిందువుల పక్షాన దాఖలైన పిటిషన్‌పై తీర్పు వెలువడాల్సి ఉంది. ఈ మేరకు సివిల్ జడ్జి(సీనియర్ డివిజన్) మహేంద్ర పాండే తీర్పును అక్టోబర్ 27న రిజర్వ్ చేసి ఉంచారు. ముందుగా నవంబర్ 8వ తేదీన తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే జడ్జి అనివార్య కారణాల వల్ల అందుబాటులో లేకపోవడంతో నవంబర్ 14వ తేదీకి వాయిదా పడింది. ప్రస్తుతానికి ముస్లిం వర్గాలకు అక్కడ నమాజ్‌కు అనుమతి ఇస్తున్నారు. ఇక.. గత విచారణ సందర్భంగా వాజుఖానాలో ఉన్న శివలింగం అంశంపై సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్‌కు అనుమతించాలని, కార్బన్ డేటింగ్ చేయించాలనే అభ్యర్థనను వారణాసి కోర్టు తోసిపుచ్చింది. ఇక ఆ ఆకారం శివలింగం కాదని, ఫౌంటెన్ భాగమని ముస్లిం వర్గాలు వాదిస్తున్నాయి. మసీదు నిర్వహణను చూసుకుంటున్న ఏఐఎంసీ.. హిందు సంఘాల తరపున పిటిషన్ వేసిన వీవీఎస్ఎస్ వాదనను తోసిచ్చుతోంది. ఇదీ చదవండి: కర్మ అంటే ఇదేనేమో.. దెబ్బకు తిక్క కుదిరింది! -
జ్ఞానవాపీ మసీదు కేసులో శివలింగంపై కోర్టు కీలక తీర్పు
లక్నో: జ్ఞాన్వాపీ కేసులో హిందువుల పిటిషన్‌ను తిరస్కరించింది వారణాసి జిల్లా కోర్టు. మసీదు ప్రాంగణంలో లభించిన శివలింగానికి కార్బన్ డేటింగ్ నిర్వహించేందుకు అనుమతి నిరాకరించింది. అలా చేస్తే శివలింగం దెబ్బతింటుందని ఈమేరకు శుక్రవారం తీర్పు వెలువరించింది. శివలింగానికి కార్బన్ డేటింగ్ నిర్వహించి అది ఏ కాలం నాటిదో తేల్చాలని హిందువులు పిటిషన్ దాఖలు చేయగా.. ముస్లింలు దీన్ని వ్యతిరేకిస్తూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలను విన్న న్యాయస్థానం హిందువుల పిటిషన్‌ను తిరస్కరించింది. జ్ఞాన్వాపీ మసీదు ఆవరణలో శ్రీనగర్ గౌరి మాతను పూజించేందుకు అనుమతించాలని ఐదుగురు హిందూ మహిళలు 2021 ఆగస్టులో కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణలో భాగంగా మసీదు ప్రాంగణంలో వీడియో సర్వే నిర్వహించగా.. శివలింగం కూడా ఉన్నట్లు తేలింది. దీంతో దానికి కార్బన్ డేటింగ్ నిర్వహించాలని హిందువులు పిటషన్ దాఖలు చేయగా.. కోర్టు తిరస్కరించింది. చదవండి: ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట -
‘జ్ఞానవాపి’ కేసు విచారణ వాయిదా
వారణాసి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో బయటపడిన శివలింగ ఆకృతికి కార్బన్–డేటింగ్ పరీక్ష నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్‌పై తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై లిఖితపూర్వకంగా స్పందించాలని అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీకి సూచించింది. మసీదు కాంప్లెక్స్‌లోని వజూఖానాలో ఈ ఏడాది మే 16న నిర్వహించిన సర్వేలో శివలింగం బయటపడిందని, ఇది ఎప్పటిదో నిర్ధారించేందుకు పరీక్ష నిర్వహించాలని విన్నవిస్తూ హిందూ మహిళ ఒకరు వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. సివిల్ ప్రొసీజర్ కోడ్(సీపీసీ) ఆర్డర్ 26 రూల్ 10 కింద ఈ శివలింగంపై శాస్త్రీయ పరిశోధన చేయడానికి ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోర్టును కోరామని పిటిషనర్ తరపు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ చెప్పారు. చదవండి: థాక్రే వర్గానికి ఎన్నికల సంఘం డెడ్‌లైన్ -
జ్ఞానవాపి ‘శివలింగం’ వయసు నిర్ధారణకు ఓకే
వారణాసి: వారణాసిలో కాశీ విశ్వనాథ్ ప్రధానాలయం పక్కన ఉన్న జ్ఞానవాపి మసీదు ఆవరణలో లభించిన శివలింగాకృతి శిల వయసు నిర్ధారణకు వారణాసి జిల్లా కోర్టు అనుమతిని ఇచ్చింది. జ్ఞానవాపి మసీదు ప్రధాన కట్టడం వెనకవైపు గోడకు ఉన్న దేవతా విగ్రహాల నిత్య ఆరాధనకు అనుమతించాలంటూ మహిళా భక్తులు వేసిన పిటిషన్‌ను గురువారం వారణాసి జిల్లా కోర్టు విచారించింది. శిల కార్భన్–డేటింగ్ ప్రక్రియకు అనుమతించాలని భక్తుల తరఫున హాజరైన న్యాయవాది విష్ణు .. జడ్జి విశేష్ను కోరారు. అందుకు అంగీకరిస్తూ జడ్జి ఉత్తర్వులిచ్చారు. తదుపరి విచారణ తేదీ 29కల్లా అభ్యంతరాలు ఉంటే తెలపాలని మసీదు మేనేజ్మెంట్కు సూచించారు. కేసులో భాగస్వామ్య పక్షాలుగా చేరుతామంటూ 15 మంది కోర్టు ముందుకొచ్చారు. -
జ్ఞానవాపి వివాదం: ఆరెస్సెస్ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
యూపీ వారణాసి జ్ఞానవాసి మసీదు కాంప్లెక్స్‌లో శివలింగం వెలుగు చూసిందన్న వ్యవహారం.. ప్రస్తుతం కోర్టులో ఉంది. అప్పటి నుంచి వరుసపెట్టి మసీద్-మందిర్ కామెంట్లు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతీ మసీదులో శివలింగం గురించి వెతకడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు ఆయన. గురువారం సాయంత్రం నాగ్‌పూర్(మహారాష్ట్ర)లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మోహన్ భగవత్ ప్రసంగిస్తూ.. వివాదాన్ని ఎందుకు పెంచాలి? సమిష్టి నిర్ణయంతో జ్ఞానవాపి వివాదానికి ముగింపు పలకవచ్చు కదా! ఆయన వ్యాఖ్యానించారు. ‘‘కొన్ని ప్రాంతాల పట్ల ప్రత్యేక భక్తిని కలిగి ఉంటాం. వాటి గురించి ప్రత్యేకంగా మాట్లాడతాం కూడా. కానీ, ప్రతిరోజూ కొత్త విషయంతో వివాదం రాజేయడం ఎందుకు?.. జ్ఞానవాపి విషయం మనకు భక్తి ఉండొచ్చు. అలాగని ప్రతీ మసీదుల్లో శివలింగం వెతకడం ఎంత వరకు సమంజసం? అని హిందూ సంఘాలను ప్రశ్నించారాయన. జ్ఞానవాపి అంశం ఈనాటిది కాదు. ఇప్పుడున్న హిందువులో, ముస్లింలో దానిని సృష్టించింది కాదు. ఆ సమయానికి అది అలా జరిగిపోయింది. బయటి దేశాల నుంచి వచ్చిన కొందరు.. దేవస్థానాలను నాశనం చేశారు. అలాగని ముస్లింలు అందరినీ అలా చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న ముస్లింలలో కొందరి పూర్వీకులు కూడా హిందువులే!.సమిష్టిగా సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయాలి. అందుకు ఒక మార్గం కనిపెట్టాలి. కుదరనప్పుడు కోర్టులకు చేరాలి. అక్కడ ఎలాంటి నిర్ణయం ఇచ్చినా అంగీకరించి తీరాలి. ఆరెస్సెస్.. ఏ మత ప్రార్థనా విధానాలకో వ్యతిరేకం కాదు. అందరినీ అంగీకరిస్తుంది. అందరినీ పవిత్రంగానే భావిస్తుంది. మతాలకతీతంగా మనమంతా మన పూర్వీకుల వారసులమే అని గుర్తించాలి అని తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కాశీ విశ్వనాథ్ ఆలయానికి ఆనుకుని ఉన్న జ్ఞానవాపి-శృంగేరీ కాంప్లెక్స్‌లో పూజలకు అనుమతించాలంటూ ఐదుగురు హిందూ మహిళలు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ఆధారంగానే ప్రత్యేక కోర్టు కమిటీతో వీడియో సర్వే చేయించింది వారణాసి న్యాయస్థానం. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మసీదు కమిటీ సుప్రీంను ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌నూ వారణాసి కోర్టుకే బదిలీ చేసింది అత్యున్నత న్యాయస్థానం. ఈ లోపు వీడియో సర్వే రిపోర్టు వారణాసి జిల్లా న్యాయస్థానాకి చేరింది. కోర్టు ‘జ్ఞానవాపి’ పిటిషన్‌పై వాదనలు జులై 4న విననుంది. జ్ఞానవాపి వ్యవహారం కోర్టులో ఉండగానే.. తాజ్‌మహల్‌లో మూసిన గదుల్లో ఆలయానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయంటూ అలహాబాద్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. అయితే ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఆపై ఢిల్లీ కోర్టులో కుతుమ్ మినార్ కాంప్లెక్స్‌లో హిందూ, జైన్ల పూజలకు అనుమతించాలంటూ ఓ పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారంపై జూన్ 9న కోర్టు ఆదేశాలు ఇవ్వనుంది. అయితే ఆర్కియాలజీ విభాగం మాత్రం.. ప్రపంచ వారసత్వ సంపద అయిన కుతుబ్ మినార్ వద్ద ఏ మతం ప్రార్థనలు జరగడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కర్ణాటకలోనూ ఓ మసీదు పునర్నిర్మాణ పనుల్లో హిందూ ఆలయ ఆనవాలు కనిపించాయంటూ.. ఆ పనుల్ని నిలిపివేయించాయి హిందూ సంఘాలు. చదవండి: మసీదులు అంతకుముందు ఆలయాలే! తాఖీర్ రజా వ్యాఖ్యలు -
జ్ఞానవాపి మసీదు కేసు: సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: జ్ఞాన్వాపి మసీదు వీడియోగ్రాఫి సర్వే అభ్యంతర పిటిషన్‌పై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ వాడివేడీగా సాగింది. ఈ తరుణంలో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో అనే సస్పెన్స్ వీడింది. జిల్లా కోర్టులోనే విచారణకు మొగ్గు చూపిన సుప్రీం త్రిసభ్య ధర్మాసనం.. ఇదొక సంక్లిష్టమైన, సున్నితమైన అంశమని పేర్కొంది. జిల్లా కోర్టు నిర్ణయం, విచారణపై స్టే విధించాలంటూ పిటిషనర్(అంజుమాన్ ఇంతెజమీయా మసీద్ కమిటీ) తరపు న్యాయవాది బెంచ్‌ను కోరారు. అయితే ఈ కేసు పరిణామాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని, జోక్యం చేసుకోబోమని బెంచ్.. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ శివలింగాన్ని సంరక్షించడంతో పాటు నమాజ్ కొనసాగించుకోవచ్చన్న మధ్యంతర ఆదేశాలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. అంతేకాదు.. ట్రయల్ జడ్జి కంటే అనుభవం ఉన్న జిల్లా జడ్జి సమక్షంలోనే వాదనలు జరగడం మంచిదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు పిటిషన్‌ను వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు అడ్వొకేట్ కమిషన్ రూపొందించిన రిపోర్ట్.. బయటకు పొక్కడంపై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ప్రత్యేకించి కొన్ని లీకులు మీడియాకు చేరుతున్నాయి. అది కోర్టుకు సమర్పించే అంశం. కోర్టులో జడ్జే కదా దానిని తెరవాల్సింది అని జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. కమ్యూనిటీల మధ్య సౌభ్రాతృత్వం కోసం, శాంతి అవసరం నెలకొల్పాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. దీంతో.. మే 23న వారణాసి కోర్టు మసీద్ సర్వే పిటిషన్‌పై వాదనలు వినేందుకు మార్గం సుగమమైంది. ఇదిలా ఉంటే.. జ్ఞానవాపి మసీద్ సర్వేపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంజుమాన్ ఇంతెజమీయా మసీద్ కమిటీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అదే సమయంలో.. జ్ఞానవాపి– శ్రింగార్ గౌరీ కాంప్లెక్సులో వారణాసి కోర్టు నియమించిన అడ్వొకేట్ కమిషన్ సర్వే పూర్తి చేసి నివేదికను సీల్డ్ కవర్లో.. కోర్టుకే సమర్పించింది. అయితే ఈ వ్యవహారంలో తమ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఎలాంటి విచారణ చేపట్టొద్దని వారణాసి కోర్టును గురువారం ఆదేశించింది సుప్రీం కోర్టు. దీంతో కమిటీ సమర్పించిన సీల్డ్ కవర్ తీసుకోవడం వరకు మాత్రమే పరిమితం అయ్యింది వారణాసి కోర్టు. ఆపై మే 23వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ తరుణంలో ఇప్పుడు సుప్రీం కోర్టు బెంచ్ ఆదేశాలు వారాణాసి కోర్టు ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కమిటీ రూపొందించిన రిపోర్ట్‌లోని వివరాలు బయటకు పొక్కడం కలకలం రేపుతోంది. చదవండి: మసీదులన్నీ అంతకుముందు ఆలయాలే! -
Gyanvapi Masjid: జ్ఞానవాపి మసీదు సర్వే నివేదిక లీక్!!
లక్నో: దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చేస్తున్న జ్ఞానవాపి మసీదు సర్వే నివేదిక.. వారణాసి కోర్టుకి చేరింది. ఒకవైపు ఈ వ్యవహారంలో తమ దగ్గర వాదనలు పూర్తయ్యే వరకు ఎలాంటి చర్యలకు ఉపక్రమించొద్దంటూ సుప్రీం కోర్టు గురువారం వారణాసి కోర్టును ఆదేశించింది. అయినప్పటికీ ముందుగా విధించిన గడువు కావడంతో.. సర్వే చేపట్టిన అడ్వొకేట్ కమిటీ ఇవాళే నివేదికను వారణాసి కోర్టులో సమర్పించింది. ఇదిలా ఉంటే.. గురువారం అడ్వొకేట్ కమిషన్ జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో చేపట్టిన సర్వే నివేదికను వారణాసి కోర్టులో సమర్పించింది. అయితే సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించిన నివేదిక కాపీ సమాచారం.. బయటకు పొక్కిందనే ప్రచారం కలకలం రేపుతోంది. కోర్టుకు సమర్పించిన గంటల వ్యవధిలోనే పిటిషనర్ల(ఐదుగురు హిందూ మహిళలు) తరపు న్యాయవాదుల చేతుల్లోకి కాపీ వెళ్లిందని, అక్కడి నుంచి లీకుల పర్వం మొదలైందని ప్రచారం నడుస్తోంది. ఈ మేరకు పలు జాతీయ మీడియా చానెల్స్‌లో కథనాలు వస్తుండడం గమనార్హం. బహిర్గతం అయిన ఆ నివేదికలో.. హిందూ విగ్రహాలు, చిహ్నాలు ఉన్నాయని... పిటిషనర్లు వాళ్ల వాదనలను సమర్థిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే.. సర్వే పూర్తయ్యే తరుణంలోనే.. శివలింగం బయటపడిందంటూ కొన్ని ఫొటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై సీరియస్ అయిన కోర్టు.. అడ్వొకేట్ కమిషనర్ అయిన అజయ్ మిశ్రాను తప్పించింది. బయటకు పొక్కిన నివేదిక వివరాలు.. మసీదు పిల్లర్ల బేస్మెంట్లో.. కలశం, పువ్వుల నగిషీలు, ప్రాచీన హిందీ భాషలో చెక్కిన అక్షరాలు బేస్మెంట్ గోడలో త్రిశూల ఆకారం మసీదు పశ్చిమం వైపు గోడ మీద కమాను, రెండు పెద్ద పిల్లర్లు ఆలయానికి సంబంధించిన గుర్తులేనని పిటిషనర్ల వాదన. మసీదు మధ్య డోమ్ కింద.. శంఖాకార నిర్మాణం మూడో డోమ్ కింద.. తామర పువ్వులను పోలిన నగిషీలు మసీదు వాజుఖానాలో బయటపడ్డ రెండున్నర అడుగుల ఎత్తున్న ఆకారం(శివలింగం) అని పిటిషనర్లు.. కాదు ఫౌంటెన్ నిర్మాణమని మసీదు నిర్వాహకుల వాదన. మసీదు ప్రాంగణాన్ని ఆనుకుని ఉన్న గోడ కోర్టుకు మాత్రమే పరిమితం కావాల్సిన నివేదిక.. సున్నితమైన అంశానికి సంబంధించిన చాలా గోప్యమైన నివేదిక బయటకు పొక్కడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. లీక్ అయిన ఈ నివేదికపై మసీదు కమిటీ కూడా ఇప్పటిదాకా స్పందించలేదు. ఒకవేళ ప్రచారంలో ఉన్న నివేదికే నిజమైతే మాత్రం.. కోర్టు ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి. ► వారణాసి కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో ఉన్న.. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో మూడు రోజులపాటు.. భారీ భద్రత నడుమ అడ్వొకేట్ కమిటీ సమక్షంలో వీడియోగ్రఫీ సర్వే జరిగింది. 14 నుంచి 16వ తేదీల మధ్య ఈ సర్వే పూర్తైంది. ఈ సర్వే సమయంలోనే అడ్వొకేట్ కమిషనర్ అజయ్ మిశ్రా లీకుల ద్వారా మసీదు వజుఖానాలో ‘శివలింగం’ బయటపడిందనే కథనాలు బయటకు వచ్చాయి. దీంతో శివలింగాన్ని సంరక్షిస్తూనే.. నమాజ్‌లకు ఆటంకాలకు కలిగించవద్దంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు ఉద్రిక్తలు చోటు చేసుకోకుండా ఆ ప్రాంతంలో భద్రతను ఏర్పాటు చేశారు. ► మరోవైపు సర్వే పూర్తి నివేదికను అడ్వొకేట్ కమిషనర్ విశాల్ సింగ్(లీక్ నేపథ్యంలో అజయ్ మిశ్రాను తొలగించి..) ఆధ్వర్యంలో వారణాసికి కోర్టుకు సమర్పించారు. మూడు సీల్డ్ బాక్సుల్లో, వందలాది ఫొటోలు, వీడియోలతో కూడిన ఒక చిప్‌ను సమర్పించారు. ఈ లోపే లీక్ కథనాలు కలకలం సృష్టిస్తున్నాయి. సుప్రీం కోర్టులో దాఖలైన వీడియోగ్రఫీ సర్వే అభ్యంతర పిటిషన్‌పై శుక్రవారం వాదనలు జరగనున్నాయి. అటుపై పరిస్థితిని బట్టి.. సోమవారం ఈ కేసులో తదుపరి వాదనలు వారణాసి కోర్టులో జరగనున్నాయి. చదవండి: మసీదులు అంతకుముందు ఆలయాలే! తాఖీర్ రజా వ్యాఖ్యల దుమారం -
శివలింగాన్ని రక్షించండి.. నమాజ్‌కు అనుమతించండి
న్యూఢిల్లీ/వారణాసి: కాశీలోని జ్ఞానవాపి– శ్రింగార్ గౌరీ కాంప్లెక్స్‌లో సర్వే సమయంలో కనుగొన్నట్లు చెబుతున్న శివలింగం ఉన్న ప్రాంతానికి రక్షణ కల్పించాలని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌ను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. అందులో ముస్లింలు నమాజ్ కొనసాగించుకునేందుకు అనుమతినిచ్చింది. న్యాయ సమతుల్యతలో భాగంగా ఈ ఆదేశాలిస్తున్నామని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నరసింహతో కూడిన బెంచ్ తెలిపింది. 20 మందిని మాత్రమే నమాజుకు అనుమతించాలన్న కింద కోర్టు ఉత్తర్వులను తోసిపుచ్చింది. మసీదు కమిటీ కోరినట్లు సర్వే తదితర ప్రక్రియలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. శివలింగం బయటపడిన ప్రాంతంలో ముస్లింలు వజు చేసుకుంటారని యూపీ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. అక్కడ ఎలాంటి విధ్వంసం జరిగినా శాంతిభద్రతల సమస్య వస్తుందని చెప్పారు. కావాలంటే ముస్లింలు వజు వేరే చోట చేసుకోవచ్చన్నారు. కానీ వజూ లేకుండా నమాజ్‌కు అర్థం లేదని మసీదు కమిటీ తరఫు న్యాయవాది హుజెఫా అహ్మదీ వాదించారు. హృద్రోగంతో ఆస్పత్రిలో చేరిన దిగువ కోర్టులో వాది తరఫు న్యాయవాది కోలుకొనే దాకా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది. రాజ్యాంగ విరుద్ధం వారణాసి కోర్టు ఆదేశాలన్నీ రాజ్యాంగ విరుద్ధమని అంతకుముందు అహ్మదీ వాదించారు. జైన్ దరఖాస్తుకు స్పందించి శివలింగం దొరికిన ప్రాంతానికి సీలు వేయాలన్న తాజా ఆదేశం సరికాదన్నారు. ఇంతవరకు సర్వే పూర్తయి నివేదిక రాకముందే ఇలాంటి ఆదేశం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ‘‘మసీదులో ప్రార్ధనలకు అనుమతించాలన్న అభ్యర్థనే అసంబద్ధం. ఇవన్నీ పట్టించుకోకుండా కింద కోర్టు సర్వే జరిపిస్తోంది. మేం హైకోర్టును ఆశ్రయించినప్పుడు కమిషనర్ నియామకానికే అనుమతిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. కానీ సర్వేకు కూడా కింద కోర్టు ఆదేశించింది. సర్వే జరుగుతుండగా అకస్మాత్తుగా శివలింగం కనిపించిందని దరఖాస్తు పెట్టుకోగానే, అది ఫౌంటెన్ అని మసీదు కమిటీ చెబుతున్నా పట్టించుకోకుండా ఆ ప్రాంత రక్షణకు హడావుడిగా ఆదేశాలిచ్చింది’’ అని వాదించారు. కేసు సుప్రీంలో ఉన్నందున స్థానిక కోర్టు విచారణపై స్టే విధించాలని కోరారు. అందుకు ధర్మాసనం తిరస్కరించింది. హిందూ భక్తుల పార్టీలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను మే 19కి వాయిదా వేసింది. సర్వే పూర్తి కాలేదు జ్ఞానవాపి మసీదులో సర్వేకు నియమించిన కమిషన్ తమ పని ఇంకా పూర్తి కాలేదని పేర్కొంది. మరికొంత గడువు కావాలని అసిస్టెంట్ అడ్వకేట్ కమిషనర్ అజయ్ ప్రతాప్‌సింగ్ కోర్టును కోరారు. నివేదికలో 50 శాతం పూర్తయిందన్నారు. సర్వేలో భూగర్భ గదులను పరిశీలించామని, కొన్నింటి తాళం చెవులు లభించకపోతే జిల్లా యంత్రాంగం తాళాలు పగలగొట్టడంతో వాటిని కూడా వీడియో తీశామని చెప్పారు. ‘‘వజూ ఖానాలో శివలింగం అంశంపై నేను మాట్లాడను. అక్కడ ఏదో దొరకడం మాత్రం నిజం. దాని ఆధారంగానే కోర్టు ఆదేశాలిచ్చింది’’ అని తెలిపారు. సింగ్ అభ్యర్థన విన్న వారణాసి సివిల్ కోర్టు సర్వే పూర్తి చేయడానికి మరో రెండు రోజుల గడువిచ్చింది. సర్వే కమిషనర్ అజయ్ మిశ్రాను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. సర్వే సమయంలో మిశ్రా సొంతంగా ప్రైవేట్ ఫొటోగ్రాఫర్‌ను తెచ్చుకున్నారని మరో కమిషనర్ విశాల్ సింగ్ కోర్టుకు తెలిపారు. సదరు ఫొటోగ్రాఫర్ మీడియాకు తప్పుడు సమాచారమిస్తున్నారన్నారు. అయితే ఆ ఫొటోగ్రాఫర్ తనను మోసం చేశారని మిశ్రా వాపోయారు. ఆ గోడను తొలగించండి! కాశీ విశ్వనాథ ఆలయంలో నంది విగ్రహానికి ఎదురుగా ఉన్న తాత్కాలిక గోడను తొలగించాలని ఐదుగురు హిందూ మహిళలు వారణాసి కోర్టులో మరో పిటీషన్ వేశారు. గోడను తొలగిస్తే బయటపడిన శివలింగం వద్దకు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుందని వీరు పేర్కొన్నారు. మసీదు తూర్పు ప్రాంతంలో నంది విగ్రహం వైపు కూడా సర్వే జరపాలని కోరారు. ఈ విషయంపై బుధవారం వాదనలు వింటామని కోర్టు తెలిపింది. అలాగే మసీదు బావిలో చేపల సంరక్షణ గురించి కూడా బుధవారం కోర్టు విచారిస్తుందని అసిస్టెంట్ అడ్వకేట్ కమిషనర్ అజయ్ చెప్పారు. మథుర మసీదులో నమాజ్ నిలిపివేతకు పిటిషన్ మథుర: నగరంలోని షాహీ ఈద్గా మసీదులో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించకుండా నిరోధించాలని కోరుతూ కొందరు న్యాయవాదులు, న్యాయవిద్యార్థులు స్థానిక కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ ప్రాంతం శ్రీకృష్ణ జన్మస్థలి అని అందువల్ల ఇక్కడ నమాజ్‌ను నిషేధించాలని వీరు కోరారు. ఇప్పటికే ఈ అంశంపై పది పిటీషన్లు మథుర కోర్టులో ఉన్నాయి. 13.37 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కత్రాకేశవ్ దేవ్ మందిరంలో ఈ మసీదు ఉంది. మసీదు ఉన్న చోటే కృష్ణుడు జన్మించాడని మెజార్టీ హిందువుల భావన అని తాజా పిటీషన్లో పేర్కొన్నారు. మసీదును హిందూ దేవాలయ శిథిలాలపై నిర్మించినందున దీనికి మసీదు హోదా రాదన్నారు. అందువల్ల ఇక్కడ నమాజు చేయకుండా శాశ్వత నిరోధ ఉత్తర్వులివ్వాలని కోరారు. ఇతర మత చిహ్నాలు లేని, వివాదంలో లేని ప్రాంతంలోనే మసీదు నిర్మించాలని ఖురాన్ చెబుతోందన్నారు. దీనిపై విచారణ మే 25న జరుగుతుందని జిల్లాప్రభుత్వ న్యాయవాది చెప్పారు. -
జ్ఞానవాపి మసీదు కేసులో సుప్రీం కోర్టులో విచారణ
-
శివలింగంపై అసభ్యకర పదాలు రాసి..
లుధియానా : హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే శివలింగంపై అసభ్యకర పదాలు రాసి కించపరిచారు కొందరు దుండగులు. ఈ సంఘటన పంజాబ్‌లోని లుధియానాలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జగరాన్లోని శివాలా చౌక్, శ్రీ సీతా రామ్ మందిర్‌లోని శివలింగంపై అసభ్యకర పదాలు రాసి కించపరిచారు గుర్తుతెలియని వ్యక్తులు. సాయంత్రం దేవుడ్ని దర్శించుకోవటానికి అక్కడికి వచ్చిన ఓ భక్తుడు శివలింగంపై రాసి ఉన్న అసభ్యకర పదాలను చదివి వెంటనే ఆలయ పూజారి బాబా మహేశ్ గిరికి సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న పూజారి శివలింగాన్ని శుభ్రం చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ( అన్న ఇంటికే కన్నం వేసిన సోదరి ) సీసీటీవీ ఫొటేజీల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫొటేజీల ఆధారంగా ఓ వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై ఆలయ పూజారి బాబా గిరి మాట్లాడుతూ.. ‘‘కొన్ని అసాంఘీక శక్తులు శివలింగంపై అసభ్యకర పదాలు రాసి, మతాల మధ్య చిచ్చుపెట్టడానికి చూస్తున్నాయి. వారిని కఠినంగా శిక్షించాలి’’ అని అన్నారు. ( చైనాలో దారుణ సంఘటన ) -
అయోధ్యలో బయటపడ్డ దేవతా విగ్రహాలు
లక్నో : అయోధ్యలో పురాతన దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. రామజన్మభూమిలో స్థలాన్ని చదును చేస్తున్న క్రమంలో విరిగిన దేవతా విగ్రహాలతో పాటు ఐదు అడుగుల ఎత్తైన శివలింగం, ఏడు నల్లరాతి స్థంభాలు, ఆరు ఎర్ర రాతి స్థంభాలు, కలశంతో పాటు పలు పురాతన వస్తువులు లభించాయి. ఈ విషయం గురించి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాజ్ మాట్లాడుతూ.. 'రామ జన్మభూమిలో గత పది రోజులుగా భూమిని చదును చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ శిథిలాలను తొలగిస్తున్నారు. (వీహెచ్‌పీ మోడల్లోనే మందిర్..) ఈ తవ్వకాల్లో పిల్లర్లతోపాటు శిల్పాలు వెలుగు చూశాయ'న్నారు. దీని గురించి విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) స్పందించింది. ఈ మేరకు వీహెచ్‌పీ నేత వినోద్ భన్సాల్ మాట్లాడుతూ.. మే 11న రామాయలం పనులు ప్రారంభమైనప్పటి నుంచి తవ్వకాల్లో పూర్ణ కుంభం వంటి ఎన్నో అవశేషాలు లభించాయన్నారు. కాగా యేళ్ల తరబడి వివాదాల్లో నానుతున్న అయోధ్య సమస్యను సుప్రీంకోర్టు గతేడాది పరిష్కరించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా రామజన్మభూమి స్థలాన్ని హిందువులకు అప్పగిస్తూ తీర్పు వెల్లడించింది. మరోవైపు మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డుకు వేరే ప్రదేశంలో ఐదు ఎకరాలను కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. (తాత్కాలిక ఆలయంలోకి రాముని విగ్రహం) -
ఐస్ శివలింగ ఆకర్షణ
చిగురుపాడు (అచ్చంపేట) : అచ్చంపేట మండలంలోని చిగురుపాడులో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద 2 క్వింటాళ్ల ఐస్ గడ్డతో రూపొందించిన శివలింగం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడ గణపతి నవరాత్రి ముగింపు ఉత్సవాలు గురువారం రాత్రి గణేష్ యూత్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. స్వామివారికి రెండున్నర క్వింటాళ్ల బంతి పూలతో గజమాల వేశారు. ఈ అందమైన దశ్యాలను తిలకించేందుకు పలు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. యూత్ సభ్యులు కందుకూరి ఏడుకొండలు, పోలిశెట్టి చెంచయ్య, నాగేశ్వరరావు, నరసింహారావు, ఆంజనేయులు, కిలారి బజారు తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. -
ఐస్ శివలింగ ఆకర్షణ
చిగురుపాడు (అచ్చంపేట) : అచ్చంపేట మండలంలోని చిగురుపాడులో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద 2 క్వింటాళ్ల ఐస్ గడ్డతో రూపొందించిన శివలింగం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడ గణపతి నవరాత్రి ముగింపు ఉత్సవాలు గురువారం రాత్రి గణేష్ యూత్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. స్వామివారికి రెండున్నర క్వింటాళ్ల బంతి పూలతో గజమాల వేశారు. ఈ అందమైన దశ్యాలను తిలకించేందుకు పలు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. యూత్ సభ్యులు కందుకూరి ఏడుకొండలు, పోలిశెట్టి చెంచయ్య, నాగేశ్వరరావు, నరసింహారావు, ఆంజనేయులు, కిలారి బజారు తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.