యూపీ వారణాసి జ్ఞానవాసి మసీదు కాంప్లెక్స్‌లో శివలింగం వెలుగు చూసిందన్న వ్యవహారం.. ప్రస్తుతం కోర్టులో ఉంది. అప్పటి నుంచి వరుసపెట్టి మసీద్-మందిర్ కామెంట్లు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతీ మసీదులో శివలింగం గురించి వెతకడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు ఆయన.
గురువారం సాయంత్రం నాగ్‌పూర్(మహారాష్ట్ర)లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మోహన్ భగవత్ ప్రసంగిస్తూ.. వివాదాన్ని ఎందుకు పెంచాలి? సమిష్టి నిర్ణయంతో జ్ఞానవాపి వివాదానికి ముగింపు పలకవచ్చు కదా! ఆయన వ్యాఖ్యానించారు. ‘‘కొన్ని ప్రాంతాల పట్ల ప్రత్యేక భక్తిని కలిగి ఉంటాం. వాటి గురించి ప్రత్యేకంగా మాట్లాడతాం కూడా. కానీ, ప్రతిరోజూ కొత్త విషయంతో వివాదం రాజేయడం ఎందుకు?.. జ్ఞానవాపి విషయం మనకు భక్తి ఉండొచ్చు. అలాగని ప్రతీ మసీదుల్లో శివలింగం వెతకడం ఎంత వరకు సమంజసం? అని హిందూ సంఘాలను ప్రశ్నించారాయన.
జ్ఞానవాపి అంశం ఈనాటిది కాదు. ఇప్పుడున్న హిందువులో, ముస్లింలో దానిని సృష్టించింది కాదు. ఆ సమయానికి అది అలా జరిగిపోయింది. బయటి దేశాల నుంచి వచ్చిన కొందరు.. దేవస్థానాలను నాశనం చేశారు. అలాగని ముస్లింలు అందరినీ అలా చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న ముస్లింలలో కొందరి పూర్వీకులు కూడా హిందువులే!.సమిష్టిగా సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయాలి. అందుకు ఒక మార్గం కనిపెట్టాలి. కుదరనప్పుడు కోర్టులకు చేరాలి. అక్కడ ఎలాంటి నిర్ణయం ఇచ్చినా అంగీకరించి తీరాలి.
ఆరెస్సెస్.. ఏ మత ప్రార్థనా విధానాలకో వ్యతిరేకం కాదు. అందరినీ అంగీకరిస్తుంది. అందరినీ పవిత్రంగానే భావిస్తుంది. మతాలకతీతంగా మనమంతా మన పూర్వీకుల వారసులమే అని గుర్తించాలి అని తన ప్రసంగంలో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. కాశీ విశ్వనాథ్ ఆలయానికి ఆనుకుని ఉన్న జ్ఞానవాపి-శృంగేరీ కాంప్లెక్స్‌లో పూజలకు అనుమతించాలంటూ ఐదుగురు హిందూ మహిళలు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ఆధారంగానే ప్రత్యేక కోర్టు కమిటీతో వీడియో సర్వే చేయించింది వారణాసి న్యాయస్థానం. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మసీదు కమిటీ సుప్రీంను ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌నూ వారణాసి కోర్టుకే బదిలీ చేసింది అత్యున్నత న్యాయస్థానం. ఈ లోపు వీడియో సర్వే రిపోర్టు వారణాసి జిల్లా న్యాయస్థానాకి చేరింది. కోర్టు ‘జ్ఞానవాపి’ పిటిషన్‌పై వాదనలు జులై 4న విననుంది.
జ్ఞానవాపి వ్యవహారం కోర్టులో ఉండగానే.. తాజ్‌మహల్‌లో మూసిన గదుల్లో ఆలయానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయంటూ అలహాబాద్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. అయితే ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఆపై ఢిల్లీ కోర్టులో కుతుమ్ మినార్ కాంప్లెక్స్‌లో హిందూ, జైన్‌ల పూజలకు అనుమతించాలంటూ ఓ పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారంపై జూన్ 9న కోర్టు ఆదేశాలు ఇవ్వనుంది. అయితే ఆర్కియాలజీ విభాగం మాత్రం.. ప్రపంచ వారసత్వ సంపద అయిన కుతుబ్ మినార్ వద్ద ఏ మతం ప్రార్థనలు జరగడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కర్ణాటకలోనూ ఓ మసీదు పునర్నిర్మాణ పనుల్లో హిందూ ఆలయ ఆనవాలు కనిపించాయంటూ.. ఆ పనుల్ని నిలిపివేయించాయి హిందూ సంఘాలు.
Comments
Please login to add a commentAdd a comment