Gyanvapi Mosque Case: Supreme Court Orders Shivling Location To Be Protected - Sakshi
Sakshi News home page

Gyanvapi Mosque Case: శివలింగాన్ని రక్షించండి.. నమాజ్‌కు అనుమతించండి: సుప్రీం కోర్టు

Published Tue, May 17 2022 5:58 PM | Last Updated on Wed, May 18 2022 7:59 AM

Supreme Court Key Orders Gyanvapi Mosque Case - Sakshi

న్యూఢిల్లీ/వారణాసి: కాశీలోని జ్ఞానవాపి– శ్రింగార్‌ గౌరీ కాంప్లెక్స్‌లో సర్వే సమయంలో కనుగొన్నట్లు చెబుతున్న శివలింగం ఉన్న ప్రాంతానికి రక్షణ కల్పించాలని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌ను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. అందులో ముస్లింలు నమాజ్‌ కొనసాగించుకునేందుకు అనుమతినిచ్చింది. న్యాయ సమతుల్యతలో భాగంగా ఈ ఆదేశాలిస్తున్నామని జస్టిస్‌ చంద్రచూడ్, జస్టిస్‌ నరసింహతో కూడిన బెంచ్‌ తెలిపింది. 20 మందిని మాత్రమే నమాజుకు అనుమతించాలన్న కింద కోర్టు ఉత్తర్వులను తోసిపుచ్చింది. మసీదు కమిటీ కోరినట్లు సర్వే తదితర ప్రక్రియలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

శివలింగం బయటపడిన ప్రాంతంలో ముస్లింలు వజు చేసుకుంటారని యూపీ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అన్నారు. అక్కడ ఎలాంటి విధ్వంసం జరిగినా శాంతిభద్రతల సమస్య వస్తుందని చెప్పారు. కావాలంటే ముస్లింలు వజు వేరే చోట చేసుకోవచ్చన్నారు. కానీ వజూ లేకుండా నమాజ్‌కు అర్థం లేదని మసీదు కమిటీ తరఫు న్యాయవాది హుజెఫా అహ్మదీ వాదించారు. హృద్రోగంతో ఆస్పత్రిలో చేరిన దిగువ కోర్టులో వాది తరఫు న్యాయవాది కోలుకొనే దాకా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నట్లు కోర్టు తెలిపింది.  

రాజ్యాంగ విరుద్ధం 
వారణాసి కోర్టు ఆదేశాలన్నీ రాజ్యాంగ విరుద్ధమని అంతకుముందు అహ్మదీ వాదించారు. జైన్‌ దరఖాస్తుకు స్పందించి శివలింగం దొరికిన ప్రాంతానికి సీలు వేయాలన్న తాజా ఆదేశం సరికాదన్నారు. ఇంతవరకు సర్వే పూర్తయి నివేదిక రాకముందే ఇలాంటి ఆదేశం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ‘‘మసీదులో ప్రార్ధనలకు అనుమతించాలన్న అభ్యర్థనే అసంబద్ధం. ఇవన్నీ పట్టించుకోకుండా కింద కోర్టు సర్వే జరిపిస్తోంది. మేం హైకోర్టును ఆశ్రయించినప్పుడు కమిషనర్‌ నియామకానికే అనుమతిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. కానీ సర్వేకు కూడా కింద కోర్టు ఆదేశించింది. సర్వే జరుగుతుండగా అకస్మాత్తుగా శివలింగం కనిపించిందని దరఖాస్తు పెట్టుకోగానే, అది ఫౌంటెన్‌ అని మసీదు కమిటీ చెబుతున్నా పట్టించుకోకుండా ఆ ప్రాంత రక్షణకు హడావుడిగా ఆదేశాలిచ్చింది’’ అని వాదించారు. కేసు సుప్రీంలో ఉన్నందున స్థానిక కోర్టు విచారణపై స్టే విధించాలని కోరారు. అందుకు ధర్మాసనం తిరస్కరించింది. హిందూ భక్తుల పార్టీలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను మే 19కి వాయిదా వేసింది.  

సర్వే పూర్తి కాలేదు 
జ్ఞానవాపి మసీదులో సర్వేకు నియమించిన కమిషన్‌ తమ పని ఇంకా పూర్తి కాలేదని పేర్కొంది. మరికొంత గడువు కావాలని అసిస్టెంట్‌ అడ్వకేట్‌ కమిషనర్‌ అజయ్‌ ప్రతాప్‌సింగ్‌ కోర్టును కోరారు. నివేదికలో 50 శాతం పూర్తయిందన్నారు. సర్వేలో భూగర్భ గదులను పరిశీలించామని,  కొన్నింటి తాళం చెవులు లభించకపోతే జిల్లా యంత్రాంగం తాళాలు పగలగొట్టడంతో వాటిని కూడా వీడియో తీశామని చెప్పారు. ‘‘వజూ ఖానాలో శివలింగం అంశంపై నేను మాట్లాడను. అక్కడ ఏదో దొరకడం మాత్రం నిజం. దాని ఆధారంగానే కోర్టు ఆదేశాలిచ్చింది’’ అని తెలిపారు. సింగ్‌ అభ్యర్థన విన్న వారణాసి సివిల్‌ కోర్టు సర్వే పూర్తి చేయడానికి మరో రెండు రోజుల గడువిచ్చింది. సర్వే కమిషనర్‌ అజయ్‌ మిశ్రాను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. సర్వే సమయంలో మిశ్రా సొంతంగా ప్రైవేట్‌ ఫొటోగ్రాఫర్‌ను తెచ్చుకున్నారని మరో కమిషనర్‌ విశాల్‌ సింగ్‌ కోర్టుకు తెలిపారు. సదరు ఫొటోగ్రాఫర్‌ మీడియాకు తప్పుడు సమాచారమిస్తున్నారన్నారు. అయితే ఆ ఫొటోగ్రాఫర్‌ తనను మోసం చేశారని మిశ్రా వాపోయారు.

ఆ గోడను తొలగించండి! 
కాశీ విశ్వనాథ ఆలయంలో నంది విగ్రహానికి ఎదురుగా ఉన్న తాత్కాలిక గోడను తొలగించాలని ఐదుగురు హిందూ మహిళలు వారణాసి కోర్టులో మరో పిటీషన్‌ వేశారు. గోడను తొలగిస్తే బయటపడిన శివలింగం వద్దకు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుందని వీరు పేర్కొన్నారు. మసీదు తూర్పు ప్రాంతంలో నంది విగ్రహం వైపు కూడా సర్వే జరపాలని కోరారు. ఈ విషయంపై బుధవారం వాదనలు వింటామని కోర్టు తెలిపింది. అలాగే మసీదు బావిలో చేపల సంరక్షణ గురించి కూడా బుధవారం కోర్టు విచారిస్తుందని అసిస్టెంట్‌ అడ్వకేట్‌ కమిషనర్‌ అజయ్‌ చెప్పారు.

మథుర మసీదులో నమాజ్‌ నిలిపివేతకు పిటిషన్‌ 
మథుర: నగరంలోని షాహీ ఈద్గా మసీదులో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించకుండా నిరోధించాలని కోరుతూ కొందరు న్యాయవాదులు, న్యాయవిద్యార్థులు స్థానిక కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. ఈ ప్రాంతం శ్రీకృష్ణ జన్మస్థలి అని అందువల్ల ఇక్కడ నమాజ్‌ను నిషేధించాలని వీరు కోరారు. ఇప్పటికే ఈ అంశంపై పది పిటీషన్లు మథుర కోర్టులో ఉన్నాయి. 13.37 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కత్రాకేశవ్‌ దేవ్‌ మందిరంలో ఈ మసీదు ఉంది. మసీదు ఉన్న చోటే కృష్ణుడు జన్మించాడని మెజార్టీ హిందువుల భావన అని తాజా పిటీషన్‌లో పేర్కొన్నారు. మసీదును హిందూ దేవాలయ శిథిలాలపై నిర్మించినందున దీనికి మసీదు హోదా రాదన్నారు. అందువల్ల ఇక్కడ నమాజు చేయకుండా శాశ్వత నిరోధ ఉత్తర్వులివ్వాలని కోరారు. ఇతర మత చిహ్నాలు లేని, వివాదంలో లేని ప్రాంతంలోనే మసీదు నిర్మించాలని ఖురాన్‌ చెబుతోందన్నారు. దీనిపై విచారణ మే 25న జరుగుతుందని జిల్లాప్రభుత్వ న్యాయవాది చెప్పారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement