వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ స్థానంలో భారీ హిందూ ఆలయ నిర్మాణం ఉండేదని భారత పురావస్తు శాఖ(ఏఎస్‌ఐ) నివేదిక పేర్కొంది. హిందూ పక్షం న్యాయవాది విష్ణు శంకర్ జైన్ గురువారం ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో నివేదికలోని అంశాలను చదివి వినిపించారు. గ్రౌండ్ పెన్‌ట్రేటింగ్ రాడార్(జీపీఆర్) సర్వేలో వెల్లడైన అంశాలు కూడా ఈ నివేదికలో ఉన్నాయి.
ప్రస్తుత నిర్మాణం అంతకుముందున్న నిర్మాణంపైన కట్టిందేనని కూడా సర్వేలో తేలింది. ‘మసీదులో చేసిన మార్పులను ఈ సర్వే గుర్తించింది. పూర్వమున్న స్లంభాలను, ప్లాస్టర్‌ను చిన్నచిన్న మార్పులతో తిరిగి ఉపయోగించినట్లు కనిపిస్తున్నాయి. హిందూ ఆలయం నుంచి తీసుకున్న కొన్ని స్తంభాలను కొద్దిగా మార్చివేసి కొత్త నిర్మాణంలో ఉపయోగించారు. స్తంభాలపై ఉన్న చెక్కడాలను తొలగించే ప్రయత్నం చేశారు’అని ఏఎస్‌ఐ నివేదిక పేర్కొన్నట్లు జైన్ వివరించారు.
దేవనాగరి, తెలుగు, కన్నడ, ఇతర లిపిలలో రాయబడిన పురాతన హిందూ దేవాలయానికి చెందిన మొత్తం 34 శాసనాలు ప్రస్తుత, పూర్వపు నిర్మాణాలపై ఉన్నాయని జైన్ పేర్కొన్నారు. ‘ఇవి వాస్తవానికి పూర్వం ఉన్న హిందూ దేవాలయంలో ఉన్న శాసనాలు. ఇవి ప్రస్తుతం ఉన్న నిర్మాణంలోనూ మరమ్మత్తు సమయంలో ఇవి ఉపయోగించబడ్డాయి. దీనిని బట్టి పూర్వం అక్కడ ఉన్న హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసి, దానికి సంబంధించిన భాగాలను తిరిగి వాడినట్లుగా రుజువవుతోంది.
ఈ శాసనాల్లో జనార్థన, రుద్ర, ఉమేశ్వర వంటి దేవతల పేర్లు కూడా ఉన్నాయి’అని నివేదికలో ఉన్నట్లు జైన్ చెప్పారు. కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకుని ఉన్న జ్ఞానవాసి మసీదు సముదాయాన్ని హిందూ, ముస్లిం పక్షాలకు ఇవ్వాలంటూ వారణాసి కోర్టు బుధవారం తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఈ నివేదిక వెలుగులోకి రావ డం గమనార్హం. జ్ఞానవాపి మసీదు అంతకుముందున్న హిందూ ఆలయ నిర్మాణంపైనే నిర్మితమయిందా అన్న విషయం తేల్చేందుకు గత ఏడాది వారణాసి కోర్టు అక్కడ ఏఎస్‌ఐ సర్వే జరపాలంటూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment