
రాయ్‌పూర్: మావోయిస్టులతో చర్చలకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం విజయ్ శర్మ. ఈ క్రమంలో షరతులు లేకుండా చర్చలు తమ ప్రభుత్వ్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. స్పష్టమైన ప్రతిపాదనలతో మావోయిస్టులు ముందుకు రావాలని సూచించారు.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో విడుదల చేసిన శాంతి చర్చల లేఖపై డిప్యూటీ సీఎం, హోం మంత్రి విజయ్ శర్మ స్పందించారు. ఈ సందర్బంగా విజయ్ శర్మ మాట్లాడుతూ.. మావోయిస్టులతో చర్చలకు ద్వారాలు తెరిచే ఉన్నాయి. వారితో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. రాష్ట్రంలో మావోయిస్టుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. షరతులు లేకుండా అర్థవంతమైన చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం.
మావోయిస్టులు నిజంగా తిరిగి రావాలనుకుంటే వారు తమ ప్రతినిధులను, చర్చల నిబంధనలను స్పష్టం చేయాలి. ఎవరైనా చర్చించాలనుకుంటే భారత రాజ్యాంగం ప్రకారం నిర్ణయాలను అంగీకరించాలి. గతంలో మావోయిస్టుల కంచుకోటలుగా పేరొందిన 40 గ్రామాల్లో ఏడాదిన్నర కాలంలో తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాం. మావోయిస్టులు చర్చల పట్ల సీరియస్‌గా ఉంటే చర్చల కోసం వారే స్వయంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నాను. స్పష్టమైన ప్రతిపాదనలతో ముందుకు రావాలి’ అని తెలిపారు.