సాక్షి ప్రతినిధి, వరంగల్: మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దులో మళ్లీ మావోయిస్టుల కదలికలు ఉన్నాయా? అంటే పోలీసు వర్గాల నుంచి ఔననే సమాధానం వస్తోంది. జూలై, ఆగస్టు మాసాల్లో గోదావరి పరీవాహక ప్రాం తంలో పలు ఘటనలకు పాల్పడిన మావోలు 4 నెలలుగా స్తబ్దతగా ఉన్నారు. వచ్చే ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర జరగనున్న నేపథ్యంలో మళ్లీ ఛత్తీస్‌గఢ్ నుంచి మావోయిస్టులు పూర్వ వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలు.. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోకి చేరినట్లు సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు.
2013 మే 25న సుకుమా జిల్లాలో సల్వాజుడుం అధినేత మహేంద్రకర్మతో పాటు పలువురిని చంపిన కేసులో ‘మోస్ట్ వాంటెడ్’గా మావోల జాబితాను విడుదల చేశారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన మావోల ఫొటోలు, పేర్లు, రివార్డులతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) 3 రాష్ట్రాల సరిహద్దు ల్లో వాల్‌పోస్టర్లు వేసింది. తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా గోదావరి పరీవాహక ప్రాంతాల పోలీసులను అప్రమత్తం చేశాయి. దీంతో 3 రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు 3 రోజుల కిందట సమావేశమైనట్లు సమాచారం.
మనోళ్ల డైరెక్షన్.. ఛత్తీస్‌గఢ్ కేడర్ యాక్షన్
ఛత్తీస్‌గఢ్, లాల్‌గఢ్ ప్రాంతాలలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన మావో యిస్టు పార్టీ నాయకులు, కేడర్‌తో పాటు.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 100 మంది వరకు సాయుధ నక్సల్స్ 3 గ్రూపులుగా తెలంగాణ సరిహద్దుల్లో ప్రవేశించి నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే విషయమై వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో గోదావరి పరీవాహక ప్రాంతాల పోలీసులను నిఘా వర్గాలు అప్రమత్తం చేసినట్లు తెలిసింది. మూడు రోజుల కిందట మావోల అణచివేత కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించిన ఓ సీనియర్ పోలీసు అధికారి ఈ ప్రాంతంలో పర్యటించి పలువురు పోలీసులతో మాట్లాడినట్లు సమాచారం.
ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన మావోల్లో అత్యధికంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వారే ఉన్నట్లు వెల్లడించినట్లు తెలిసింది. అందులో 22 మంది వరకు తెలంగాణ ప్రాంతం కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వారు ఉన్నట్లు చెబుతున్నారు. 2016లో జిల్లాల పునర్ విభజన తర్వాత కేకేడబ్ల్యూ(ఖమ్మం – కరీంనగర్ – వరంగల్) కమిటీని ఎత్తివేసి దాని స్థానంలో మూడు డివిజన్ కమిటీలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా యాప నారాయణ అలియాస్ లక్మా అలియాస్ హరిభూషణ్ వ్యవహరిస్తుండగా, బండి ప్రకాశ్ అలియాస్ క్రాంతి, బడే దామోదర్, మైలారపు భాస్కర్ సభ్యులుగా ఉన్నారు. మొత్తం సాయుధ బలగాలకు వీరే సారథ్యం వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయా నాయకుల సూచనల మేరకు దాడులు, కార్యక్రమాలకు పాల్పడుతారని గుర్తించిన ఇంటెలిజెన్స్ వర్గాలు... పోలీసులను అప్రమత్తం చేయడం చర్చనీయాంశమైంది.
మళ్లీ మావోయిస్టుల కదలికలు
Published Sun, Jan 12 2020 3:23 AM | Last Updated on Sun, Jan 12 2020 3:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment