
ఏ మనిషికైనా కష్టం వస్తే సాయం చేసే వాళ్లని మానవత్వం ఉన్నవాళ్లుగా పరిగణిస్తాం. పక్కోడికి ఏమైతే మనకేంటి.. అనుకుంటే వారిని స్వార్ధపరులే అనుకుంటాం. మరి మానవత్వంలో ధీరత్వం అంటే ఏమిటి? మనిషి చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు వారి ప్రాణాలను కూడా తన ప్రాణాలుగానే భావించి తెగువ చూపించి కాపాడితే అది మానవత్వంలో ధీరత్వమే అవుతుంది. ఇక్కడ తనకెందులే అనుకోకుండా ధీరత్వంతో కొంతమంది ప్రాణాల్ని కాపాడాడు ఓ వ్యక్తి. పహల్గామ్ ఉగ్రదాడి నుంచి కొంతమందిని కాపాడి హీరో అయ్యాడు. ఓ వైపు టెర్రరిస్టులు దాడులకు తెగబడిన తరుణంలో ఆ యువకుడు తన ప్రాణాలు తెగించి మరీ వారిని కాపాడాడు.
విషయంలోకి వెళితే.. మంగళవారం( ఏప్రిల్ 22వ తేదీ) కశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడితో రక్తసిక్తమైంది. కొంతమంది ఉగ్రవాదులు ఆర్మీ డ్రెస్సులు ధరించి వచ్చి అమాయక టూరిస్టుల ప్రాణాలు తీశారు. ఈ ఘటనలో 26 మంది అసువులు బాసారు. అయితే ఈ క్రమంలోనే కొంతమంది తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని బయటపడ్డారు. ఇలా సాయం చేయడంలో స్థానికంగా ఉన్న కొందరు సహకరించారు.
తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ టూరిస్టులను కాపాడారు. ఇలా టూరిస్టులను కాపాడిన వారిలో పహల్గాగ్ కు చెందిన రాయిస్ అహ్మద్ భట్ ఒకరు. పహల్గామ్ లో పోనీ ఓనర్స్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా ఉన్న అహ్మద్ భట్.. ఆ క్షణాలను మళ్లీ తలుచుకుంటేనే భయమేస్తుందన్నాడు. ఈ రోజు దాడి జరిగిన ప్రాంతానికి వెళ్లిన రాయీస్ అహ్మద్ భట్.. ఏఎన్ఐ పలకరించగా అక్కడ జరిగిన దాడి ఉదంతాన్ని చెప్పుకొచ్చాడు.
ఆఫీస్ నుంచి అనుకోకుండా బయటకొచ్చి..
ఈ టెర్రర్ అటాక్ అనేది మధ్యాహ్నం గం. 2.45ని. ప్రాంతంలో జరిగిందన్నాడు అహ్మద్ భట్. తనకు ఒక ఫోన్ వస్తే కవరేజ్ లేదని బయటకొచ్చిన క్రమంలో కొంతమంది టూరిస్టుల ఆర్తనాదాలు వినిపించాయన్నాడు. తమను రక్షించాలంటూ వారు చేస్తున్న రోదనతో తాను అప్రమత్తమైనట్లు పేర్కొన్నాడు.
‘ నేను ఆఫీస్ లో ఉన్నా. నాకు ఒక మెస్సేజ్ వచ్చింది. అది మా జనరల్ ప్రెసిడెంట్ నుంచి వచ్చిన మెస్సేజ్. ఆ మెస్సేజ్ చూసిన తర్వాత నేను తిరిగా కాల్ చేశాను. కానీ మొబైల్ కవరేజ్ సరిగా లేకపోవడంతో నేను ఫోన్ మాట్లాడుకుంటూ బయటకొచ్చా. అప్పుడు ఉగ్రదాడి జరుగుతుందనే విషయం పసిగట్టా. నేను ఆరుగుర్ని నాతో తీసుకుని అక్కడ నుంచి రెండు కిలోమీటర్ల వరకూ ఎత్తుపైకి వెళ్లాం.
అక్కడ నుంచి చూస్తుంటే కింద భయానక వాతావరణం కనిపించింది. భయభ్రాంతులతో పరుగెడుతున్న పలువురు కనిపించారు. కేవలం వారి నుంచి రక్షించండి అనే ఆర్తనాదమే వస్తుంది. నీరు.. నీరు అంటూ కేకలు వేస్తూ ప్రాణం కోసం పరుగుపెట్టారు. నేను వారికి సాయం చేయడానికి మేము యత్నించాం. అడవిలో ఉన్న ఒక వాటర్ పైప్ వారికి వాటర్ అందించాం. ఆ తర్వాత వారికి ఒకటే చెప్పా. మీకు సురక్షితమైన జోన్ లో ఉన్నారనే విషయం చెప్పా. వారిని మా టీమ్ సభ్యులకు అప్పగించా. భయపడిన వారిని సురక్షితంగా తీసుకురావడమే మా మొదటి ప్రయత్నంగా భావించాం’ అని చెప్పుకొచ్చాడు.
ఆ తర్వాత కూడా పది నుంచి పదిహేనుమంది వరకూ తాను కాపాడినట్లు రాయీస్ భట్ తెలిపాడు. తమ టీమ్ సభ్యులంతా కలిసి చాలా మందిని ప్రాణాలతో కాపాడమన్నాడు. నేను బురదలో చిక్కుకుపోయిన కొంతమందిని తనతో పాటు తీసుకొచ్చానన్నాడు. ఆ తర్వాత వారిని గుర్రాలు ఎక్కించి వెనక్కి పంపించినట్లు పేర్కొన్నాడు.
ఎక్కడ చూసినా ఆర్తనాదాలే..
తాను తొలిసారి చూసినప్పుడు టూరిస్టులు ఎంట్రన్స్ గేట్ దగ్గర ఒక మృతదేహాన్ని చూశా. ఆ తర్వాత నాలుగైదు మృతదేహాలు కనిపించాయి. అక్కడ ఉన్న కొంతమంది గాయపడ్డ మహిళలు.. తమ భర్తలను రక్షించాలని వేడుకున్నారు. ఏదైతే అది అయ్యిందని మా టీమ్ సభ్యులమంతా గేట్ లోపలికి వెళ్లి ఆపరేషన్ స్టార్ట్ చేశామన్నాడు. ఇలా కొంతమందిని రక్షించామని రాయీస్ అహ్మద్ మీడియాకు తెలిపాడు.