
టీనేజీ అమ్మాయిల డిప్రెషన్‌కు స్క్రీన్‌టైమ్‌కు మధ్య సంబంధం
పరిశోధనలో వెల్లడి
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్, ట్యాబ్, టెలివిజన్, డెస్క్ టాప్, ల్యాప్‌టాప్... స్క్రీన్ ఏదైనా సరే ఎక్కువ సమయం చూడటం పిల్లల్లో సమస్యలను పెంచుతోంది. ప్రత్యేకంగా టీనేజీ అమ్మాయిలు ఎక్కువగా దీని దుష్ప్రరిణామాలను ఎదుర్కొనే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో తేలింది. అతిగా స్క్రీన్ చూసే టీనేజీ అమ్మాయిలు కుంగుబాటు బారిన పడే అవకాశాలు ఎక్కువ అవుతాయని తాజా పరిశోధన తేల్చిచెప్పింది.
టీనేజ్ అమ్మాయిల్లో మానసిక అనారోగ్యానికి, అధిక స్క్రీన్‌టైమ్‌కు మధ్య సంబంధం ఉందని అధ్యయనం చెబుతోంది. ఎక్కువసేపు స్క్రీన్ చూస్తే ఆ మేరకు నిద్ర తగ్గిపోతుంది. నిద్రలేమి సమస్య పెరుగుతుంది. తక్కువ నిద్ర కారణంగా వారిలో ఉద్రేకం ఎక్కువ అవుతుందని, తర్వాత నిరాశ, నిస్పృహలు ఆవహిస్తున్నాయని స్వీడన్‌కు చెందిన కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. 12 నుంచి 16 ఏళ్ల వయసు ఉన్న 4,810 మంది టీనేజీ అమ్మాయిలపై ఈ పరిశోధనా బృందం ఒక అధ్యయనం చేసింది.
ఈ పరిశోధన తాలూకు వివరాలు ‘పీఎల్‌ఓఎస్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనలో భాగంగా సంబంధిత విద్యార్థులు రోజూ ఎంత సమయం డిజిటల్ ఉపకరణాల స్కీన్‌లను చూస్తున్నారు? వారు ఎంత సమయం నిద్రపోతున్నారు?. ఎంత గాఢమైన నిద్రలోకి జారుకుంటున్నారు?. వారిలో ఈకాలంలో ఏమేరకు నిస్పృహకు లోనయ్యారు? నిస్పృహ లక్షణాలు తదితరాలను సేకరించారు. స్క్రీన్ టైమ్ పెరిగిన కాలంలో మూడు నెలల్లోనే నిద్ర నాణ్యత బాగా తగ్గిపోయింది. నిద్రపోయే సమయం తగ్గిపోయింది.
నిద్రను కొన్ని నిమిషాలపాటు వాయిదా వేయడం మొత్తం జీవగడియారం పనితీరుపైనా ప్రభావం చూపుతోంది. అధిక స్క్రీన్ టైమ్ అబ్బాయిలను 12 నెలల తర్వాత ప్రభావితం చేస్తోంది. అమ్మాయిల్లో స్క్రీన్‌టైమ్‌కు, నిద్రాభంగానికి, డిప్రెషన్‌కు అవినాభావ సంబంధం ఉందని తేలింది. టీనేజీ అమ్మాయిల్లో స్క్రీన్‌టైమ్‌కు, డిప్రెషన్‌కు మధ్య అవినాభావ సంంధంలో నిద్ర దాదాపు 38 నుంచి 57 శాతం ప్రముఖ పాత్ర పోషిస్తోందని వెల్లడైంది. స్క్రీన్ చూసిన అబ్బాయిల్లో నిద్రాభంగం అధికంగా ఉంది. కానీ ఈ నిద్రాభంగం వారి మానసిక ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపడం లేదని పరిశోధకులు చెప్పారు. 2024 సెప్టెంబర్‌లోనే స్వీడిష్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ టీనేజర్ల స్క్రీన్‌టైమ్‌పై ఆంక్షలు విధించడం తెల్సిందే.