
ఢిల్లీ: భారత్‌లో దాదాపు 120 ఏళ్ల తర్వాత విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. నవంబర్ నెల వచ్చేసింది. అయినా చలి జాడ లేకుండా పోయింది. దీంతో ఈ నెల కూడా సూర్యతాపం తప్పదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
భారత్‌లో నెలకొన్ని ఈ అసాధారణ వాతావరణ పరిస్థితులపై ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో భారత వాతావరణ శాఖ(IMD) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర వివరించారు. బంగాళాఖాతంలో అల్పపీడనలు తరచూ ఏర్పడడం, తూర్పు గాలుల ప్రభావం, పశ్చిమ దిశ నుంచి ఎలాంటి అవాంతరాలు లేకపోవడం.. తదితర కారణాల వల్ల దేశవ్యాప్తంగా వాతావరణం వెచ్చగా ఉంటోందని వెల్లడించారు. అలాగే
వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం.. 1901 తర్వాత ఈ ఏడాది అక్టోబర్ అత్యంత వెచ్చని నెలగా రికార్డయ్యింది. సాధారణం కంటే.. 1.23 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అధికంగా నమోదైంది. అలాగే దేశవ్యాప్తంగా సరాసరి ఉష్ణోగ్రత చూసినా.. 1.84 డిగ్రీల సెల్సియస్(20.01 డిగ్రీల సెల్సియస్ బదులు 21.85 డిగ్రీల సెల్సియస్ నమోదైంది) అధికంగానే రికార్డు అయ్యింది. ఈ గణాంకాలను బట్టి నవంబర్ నెల కూడా ఉష్ణోగ్రతల్లో తగ్గుముఖం ఉండకపోవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. అలాగే.. రాబోయే రెండు వారాలు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగవచ్చని చెబుతోంది.
అంటే.. ఈసారి నవంబర్ చలితో వణికించదని ఐఎండీ డైరెక్టర్ మహాపాత్ర చెబుతున్నారు. అలాగే.. డిసెంబర్ నుంచి మొదలయ్యే చలి జనవరి, ఫిబ్రవరి నెలలపాటు కొనసాగుతుందని వెల్లడించారు. అంతేకాదు.. దక్షిణ భారతంలో నవంబర్ నెలలో రుతుపవనాల తిరోగమనం సమయంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని కూడా తెలిపారాయన.