
నేనొక యోగిని మాత్రమే
పార్టీ ఆదేశాలనుసారమే సీఎంగా సేవలు
బుల్డోజర్ ఓ ‘అవసరం’
హిందువుల నుంచి క్రమశిక్షణ నేర్చుకోవాలి
ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్న యోగి
లక్నో: రాజకీయాలు అనేవి తనకు ఫుల్‌టైమ్ ఉద్యోగం కాదని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. మనస్ఫూర్తిగా చెప్పాలంటే తాను కేవలం యోగిని మాత్రమేనని ఆయన స్పష్టంచేశారు. ‘బుల్డోజర్ మోడల్‌ను మా ప్రభుత్వం సాధించిన ఘనతగా చూడటం లేదు. అదొక అవసరం. సమాజహితం కోసం దాన్ని మెరుగైన విధానంలో వాడొచ్చని మేం చూపించాం’’ అన్నారు. మంగళవారం పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై యోగి సుదీర్ఘంగా మాట్లాడారు.
అగ్రనేతలతో విభేదాల్లేవు
‘‘బీజేపీ అగ్రనేతలతో నిజంగా విభేదాలే ఉంటే ఇంకా సీఎంగా కొనసాగగలనా? అవన్నీ వదంతులే. నా రాజకీయ జీవితానికి పరిమితి ఉంది. ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు నాకుంది. నన్నే కాదు, దేశం కోసం పరిశ్రమించే ప్రతి ఒక్కరినీ ఆర్‌ఎస్‌ఎస్ ముందుండి ప్రోత్సహిస్తుంది. సరైన పథంలో లేని వాళ్లలోనూ స్ఫూర్తి నింపి సన్మార్గం వైపు నడిపిస్తుంది. బీజేపీ ఆదేశానుసారం యూపీ ప్రజలకు సేవ చేస్తున్నా’’ అని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో దిగిపోతారని, భావి ప్రధాని అవకాశాలు యోగికే ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ‘‘రాజకీయాలు నాకు ఫుల్‌టైమ్ జాబ్ కాదు. నేనొక యోగిని మాత్రమే. ఇతర రాష్ట్రాల్లోనూ నాకు పాపులారిటీ పెరగడానికి వేరే కారణం ఉందనుకుంటున్నా. యాత్రల్లో భాగంగా దేశవ్యాప్తంగా భక్తులు యూపీని సందర్శిస్తున్నారు. 2017 తర్వాత యూపీలో స్పష్టంగా కనిపిస్తున్న అభివృద్ధి వల్ల వారలా భావించి ఉంటారు’’ అన్నారు.
రాజకీయాలు, మతంపై...
‘‘ కొంతమంది మాత్రమే రాజకీయాలు చేయాలని, మతానికి సైతం పరిధులు ఉండాలని భావించినప్పుడే సమస్యలు తలెత్తుతాయి. స్వార్థం కోసం రాజకీయాలను వాడుకుంటే సమస్యలొస్తాయి. అందరి మంచి కోసం రాజకీయాలు చేస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. సమస్యకు, పరిష్కారానికి మధ్య ఎటువైపు నిల్చోవాలనేదే మతం మనకు బోధిస్తుంది’’ అని అన్నారు.
మీరు రాజకీయనేత అని చెప్పుకోవడానికి ఇష్టపడతారా లేదంటే మతానికి సంబంధించిన ప్రతినిధి అని చెప్పుకోవడానికి ఇష్టపడతారా? అని ప్రశ్నించగా.. ‘పౌరుడిగా పనిచేసేందుకు ఇష్టపడతా. పౌరునిగా రాజ్యాంగబద్ధ కర్తవ్యమే నాకు ముఖ్యం. నా వరకు దేశమే అత్యున్నతం. దేశం బాగుంటే నా మతం కూడా బాగుంటుంది. మతం సురక్షితంగా ఉంటే సంక్షేమ మార్గం దానంతట అదే తెరుచుకుంటుంది’’ అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ముస్లింలపై...
‘‘రాష్ట్ర అభివృద్ధిలో ముస్లింలకు తగు ప్రాతినిధ్యం లభిస్తుంది. మైనారిటీలు అయినంత మాత్రాన ముస్లింలకు ప్రత్యేక కేటాయింపులు అంటూ ఏమీ ఉండవు. పాదచారులు రోడ్ల పక్కన నడవాలి. అంతేగానీ రోడ్లపై నమాజ్ చేస్తామంటే కుదరదు. రహదారులపై ట్రాఫిక్ అంతరాయం కల్గించడం చట్టప్రకారం నేరం. అయినాసరే అలాగే చేస్తామంటే అందుకు తగ్గ పరిణామాలను ‘బుల్డోజర్ న్యాయం’ రూపంలో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి.
ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించేవాళ్లు హిందువులను చూసి నేర్చుకోండి. మహాకుంభమేళా వేళ ప్రయాగ్‌రాజ్‌కు 60 కోట్ల మంది హిందువులు వచ్చారు. దొంగతనం, విధ్వంసం, బెదిరింపులు, కిడ్నాప్ ఘటనలు ఒక్కటి కూడా జరగలేదు. దీనినే మత క్రమశిక్షణ అంటారు. దీన్ని హిందువుల నుంచి ఇతరులు కూడా నేర్చుకోవాలి’’ అని ముస్లింలనుద్దేశించి యోగి అన్నారు.
ఆలయాల దాతృత్వం, సేవా కార్యక్రమాలపై..
‘‘విద్య, ఆరోగ్యానికి సంబంధించిన అందరికీ సమానంగా ఆలయాలు, మఠాలు దాతృత్వ, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఆలయాలతో పోలిస్తే అత్యధిక ఆస్తులున్న వక్ఫ్ బోర్డులు ఏనాడైనా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాయా?. ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించడం తప్ప’’ అని యోగి అన్నారు. ‘‘ నూతన నిర్మాణాలు, పాత ఆక్రమణలను తొలగించడంతోపాటు బుల్డోజర్‌ను మా ప్రభుత్వం ‘మెరుగైన రీతి’లో వాడింది. మా సద్వినియోగాన్ని సుప్రీంకోర్టు సైతం గతంలో మెచ్చుకుంది’’ అని వ్యాఖ్యానించారు.