
భారతదేశం 2025, జనవరి 26న 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ కవాతు ప్రత్యేక ఆకర్షణలకు కేంద్రంగా మారనుంది.
గణతంత్ర దినోత్సవ కవాతు జనవరి 26న ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కవాతు ఢిల్లీలోని విజయ్ చౌక్ నుండి ప్రారంభమై, కర్తవ్య పథ్ ద్వారా ఎర్రకోటకు చేరుకుంటుంది. ఈ సంవత్సరం కవాతు కార్యక్రమం, శకటాలు, ముఖ్య అతిథి, థీమ్, భద్రతా వివరాలు ఇలా ఉన్నాయి.
గణతంత్ర దినోత్సవం 2025 థీమ్
76వ గణతంత్ర దినోత్సవం థీమ్ 'స్వర్ణ భారతదేశం: వారసత్వం- పురోగతి'. ఈసారి కవాతు 90 నిమిషాల్లో ముగియనుంది. ఈసారి కవాతులో 31 శకటాలు, 18 మార్చింగ్ కంటింజెంట్లు, 15 బ్యాండ్లు పాల్గొంటాయి. కవాతు సందర్భంగా మొత్తం 5,000 మంది కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు.
త్రివిధ సైన్యాల ఉమ్మడి శకటం
గణతంత్ర దినోత్సవ చరిత్రలో తొలిసారిగా మూడు దళాలు అంటే సైన్యం, నౌకాదళం, వైమానిక దళాలకు చెందిన ఒకే శకటం ప్రదర్శితం కానుంది. కవాతులో మొదటిసారిగా మూడు సాయుధ దళాల విభాగాల ప్రత్యేక శకటాలు ఉండవు. ఈ మూడు విభాగాల సమన్వయాన్ని తెలిపేదిగా ఉమ్మడి శకటాన్ని రూపొందించారు.
రాష్ట్రాల ఘనతను చాటే శకటాలు
గణతంత్ర దినోత్సవ కవాతులో బీహార్, మధ్యప్రదేశ్, యూపీ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, చండీగఢ్, గోవా, హర్యానా,జార్ఖండ్‌తో సహా 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన శకటాలు ప్రదర్శితం కానున్నాయి. 2025 మహాకుంభ్ ప్రాముఖ్యతను తెలియజేసే శకటం ప్రత్యేక ఆకర్షణ కానుంది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల శకటాలు కూడా కనిపించనున్నాయి.
ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు
ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో 2025 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే ఈసారి తొలిసారిగా ఇండోనేషియాకు చెందిన 352 మంది సభ్యుల మార్చింగ్, బ్యాండ్ బృందం గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొననుంది. కాగా 1950లో జరిగిన భారతదేశ తొలి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
భద్రతా ఏర్పాట్లు
గణతంత్ర దినోత్సవం వేడుకల వేదిక సమీపంలో యాంటీ-డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అతిథులకు క్యూఆర్ కోడ్ ద్వారా ప్రవేశం కల్పించనున్నారు. ఆర్మీ హెలికాప్టర్లు గస్తీ తిరుగుతాయి. దీనితో పాటు ఎన్‌ఎస్‌జీ కమాండోలు, ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ దళాలు, డీర్‌డీఓ శాస్త్రవేత్తలు భద్రతా బాధ్యతలు చేపట్టనున్నారు. 14 'పరాక్రమ్' కమాండో వాహనాలను ఇప్పటికే మోహరించారు.
ఇది కూడా చదవండి: Mahakumbh: మౌని అమావాస్యకు ఎందుకంత ప్రత్యేకత?