పహల్గాం ఉగ్రదాడిలో విస్తుపోయే విషయాలు | Why Terrorists Choose Pahalgam Baisaran Valley For Attack Full Details | Sakshi
Sakshi News home page

పహల్గాం ఉగ్రదాడిలో విస్తుపోయే విషయాలు

Published Wed, Apr 23 2025 12:02 PM | Last Updated on Wed, Apr 23 2025 1:28 PM

Why Terrorists Choose Pahalgam Baisaran Valley For Attack Full Details

ప్రభుత్వాధికారులను, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకునే పహల్గాం దాడి జరిగిందా? కాల్చి చంపే ముందు ఉగ్రవాదులు టూరిస్టుల ఐడీ కార్డులను ఎందుకు చెక్‌​ చేశారు?. పైగా మృతుల్లో ఐబీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ విభాగాల ఉద్యోగులే అధికంగా ఉండడం.. ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. పహల్గాం ఉగ్రదాడిలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.

కశ్మీర్‌ గడ్డపై నరమేధానికి ఉగ్రవాదులు ఈ పర్యాటక ప్రాంతాన్నే ఎంచుకోవడం వెనుక భద్రతాధికారులు పలు కారణాలు చెబుతున్నారు. పహల్గాం పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్‌ వ్యాలీ(baisaran valley)కి కశ్మీర్‌ ‘మినీ స్విట్జర్లాండ్‌’గా పేరుంది. శీతాకాలంలో మంచు దుప్పటి పర్చుకునే ఈ ప్రాంతం.. మిగతా కాలంలో పచ్చిక బయళ్లతో,  ఫైన్ చెట్లతో.. యూరప్‌ అల్పైన్‌ లోయలను తలపిస్తుంటుంది. అందుకే దేశం నలుమూలల నుంచి పర్యాటకలకు వేసవిలో ఈ ప్రాంతానికి క్యూ కడుతుంటారు.‌ పైగా ల్యూలియన్‌ సరస్సుకు బైసరన్‌ వ్యాలీ బేస్‌గా ఉండడంతో పాటు ట్రెక్కింగ్‌ కోసం సాహస యాత్రికులు ఈ ప్రాంతానికి క్యూ కడుతుంటారు.

అయితే పహల్గాం(pahalgam) బైసరన్‌ లోయకు ఉన్న ప్రత్యేకతలే.. ఉగ్రవాదులు సులువుగా చొరబడి అమాయకులపై దాడి చేయడానికి వీలు కలిపించింది. ఇక్కడి పచ్చదనం పాడు కాకూడదన్న ఉద్దేశంతో మోటార్‌ వెహికిల్స్‌ను అనుమతించరు. పహల్గాం టౌన్‌ నుంచి ఐదు కిలోమీటర్ల పాటు కాలినడకన  లేదంటే పొట్టి గుర్రాలను(Pony) పర్యాటకులు ఆశ్రయించాల్సి ఉంటుంది. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం కోసం తీసుకున్న ఈ చర్యలు ఈ ప్రాంతాన్ని ఒంటరిని చేసేశాయి. తద్వారా అత్యవసర పరిస్థితుల్లో లేదంటే ఊహించని సంఘటనల సమయంలో చర్యలకు జాప్యం కలిగేలా చేశాయి. 

ప్రభుత్వాధికారులే లక్ష్యంగా.. పక్కా ప్లాన్‌తోనే బైసరన్‌ వ్యాలీలో ఉగ్రదాడి జరిగినట్లు స్పష్టమవుతోంది. మంగళవారం మధ్యాహ్నా సమయంలో (2.45గం.-3గం. ప్రాంతంలో) సైన్యం దుస్తుల్లో సమీప అడవుల నుంచి వచ్చిన బృందం.. టూరిస్టులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. బాడీక్యామ్‌లు ధరించిన ముగ్గురు టెర్రరిస్టులు పర్యాటకులను ఒక చోటా చేర్చి.. వివరాలను ఆరా తీసి మరి కాల్చి చంపి ఆ దృశ్యాలను రికార్డు చేశారు. టూరిస్టులు పారిపోతున్న టైంలో స్నైఫర్‌ ఫైర్‌ చేశారు. అయితే ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఆరుగురు ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

ఈ దాడిలో 26 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. బైరసర్‌ వ్యాలీ దగ్గర వాహనాలు లేకపోవడంతో క్షతగాత్రుల తరలింపు మరింత ఆలస్యమైంది. భద్రతా బలగాలు కూడా కాస్త ఆలస్యంగానే అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈలోపు దట్టమైన అడవుల్లోకి ఉగ్రవాదులు పారిపోగలిగారు. జమ్ము కశ్మీర్‌లోనే అంత్యంత ప్రశాంతమైన పర్యాటక ప్రాంతంగా పేరు ఉన్న బైసరన్‌ వ్యాలీ..  నిన్నటి దాడితో ఆ పేరుపై నీలినీడలు కమ్ముకునేలా చేసుకుంది.

ఎమోషనల్‌ పోస్టులు
పహల్గాం ఉగ్రదాడి గురించి తెలిశాక.. చాలా మంది(సెలబ్రిటీలతో సహా) సోషల్‌ మీడియాలో బైసరన్‌ వ్యాలీ అనుభూతుల్ని పంచుకుంటున్నారు. గతంలో తాము అక్కడికి వెళ్లిన సందర్భంలో దిగిన చిత్రాలను షేర్‌ చేస్తూ.. ఉగ్రదాడిపై దిగ్‌భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతమైన ఆ నేల నెత్తురోడడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రాన్ని కోరుతున్నారు. 

👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement