
పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలి
జయపురం: టాటా పవర్ సప్లయ్ విభాగ కంపెనీపై కొరాపుట్ జిల్లా కమ్యూనిస్టు పార్టీ ధ్వజమెత్తింది. విద్యుత్ వినియోగదారులపై జులుం చేస్తుందని, విద్యుత్ సరఫరాలో అనుసరిస్తున్న విధానాలకు శ్వస్తి చెప్పి, సవ్యంగా విద్యుత్ సరఫరా చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. బుధవారం కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి జుధిష్టర రౌళో నేతృత్వంలో ఆ పార్టీ శ్రేణులు టాటా పవర్ అధికారులకు కలిశారు. ముఖ్యమంత్రి మోహణ మఝిను ఉద్దేశించి వినతిపత్రం సమర్పించారు. విద్యుత్ చార్జీల పెంపుదలను తగ్గించాలని, రాష్ట్రంలోటాటా విద్యుత్ విభాగం జులుం బంద్ చేయాలని, విద్యుత్ బిల్లుల వసూలులో సాధారణ పేదల విద్యుత్ లైన్‌లు తొలగించటం నిలిపివేయాలని, విద్యుత్ బిల్లులో ఆనేక తప్పులు దొర్లుతున్నాయని, వాటిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. టా టా పవర్ సప్లయ్ అధికారులు బలవంతంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తూ వినియోగదారులను దోచుకుంటున్నారని, దీనిపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని, వ్యవసాయం దాని అనుబంధ సంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని, విద్యుత్ బిల్లులు ఒడియా భాషలో ప్రింట్ చేయాలని డిమాండ్ చేశారు. తక్షణ చర్యలు చేపట్టకపోతే కమ్యూనిస్టు పార్టీ ప్రజాందోళన చేపడుతునందని హెచ్చరించారు.